తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. ప్రియుడి మరణం తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. రెండు రోజుల క్రితం ప్రేమించినవాడు ఆత్మహత్య చేసుకోగా ప్రియురాలు కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే.. తిరుపతిలోని శ్రీపద్మావతీ మహిళా డిగ్రీ కాలేజీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని తండ్రి కృష్ణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్వీయూ సీఐ రామయ్య కేసు నమోదు చేసుకున్నారు. అన్నమయ్య జిల్లాకు గుర్రంకొండకు చెందిన కృష్ణమూర్తి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోశించుకుంటున్నాడు.
Also read:ఏపికి రెయిన్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు!
ఆయన రెండవ కుమార్తె అనిత డిగ్రీ 2వ సంవత్సరం చదువుతోంది. కాగా అనిత సాయి రెడ్డి అనే యువకుడితో సన్నిహితంగా ఉన్నట్టు సమాచారం. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. సాయి రెడ్డిది కూడా అనిత స్వగ్రామం గుర్రంకొండగా పోలీసులు గుర్తించారు. అయితే రెండు రోజుల క్రితం సాయి రెడ్డి ఆత్మహత్య చేసుకోగా ఆ తరవాత అతడి అంత్యక్రియల రోజునే అనిత ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది.
హాస్టల్ గదిలో ఆమె ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. కానీ అనిత స్నేహితులు, సన్నిహితులు ఇచ్చిన వివరాల ప్రకారం విచారణ జరిపిన పోలీసులు మనస్థాపంతోనే ఆత్మహత్య చేసుకుందని ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. ఈ క్రమంలో సాయి రెడ్డి అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? అతడి ఆత్మహత్య తరవాత కుటుంబ సభ్యులు అనితను ఇబ్బందులకు గురి చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త అటు యూనివర్సిటీలో ఇటు గుర్రంకొండలో సంచలనం రేపుతోంది.