Maharashtra: పెళ్లి పేరుతో అమాయక మహిళలను నిలువునా ముంచేస్తూ, కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న ఒక కేటుగాడి గుట్టును మహారాష్ట్ర పోలీసులు రట్టు చేశారు. మ్యాట్రిమోనియల్ సైట్లను వేదికగా చేసుకుని, వరుస పెళ్లిళ్లతో దాదాపు 25 మందికి పైగా మహిళల జీవితాలతో ఆడుకున్న ఈ ‘మాయగాడి’ కథ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనూజ్ కుమార్ చంద్రప్రకాష్ త్రివేది అనే వ్యక్తి.. మ్యాట్రిమోనియల్ ప్లాట్‌ఫామ్‌లలో ‘అజయ్ అగర్వాల్’ అంటూ పేరు మార్చుకుని తిరిగేవాడు. ముఖ్యంగా వితంతువులు, దివ్యాంగులు, ఆర్థికంగా స్థిరపడి ఒంటరిగా ఉన్న నిస్సహాయ మహిళలను ఇతడు టార్గెట్ చేసేవాడు. మొదట ఎంతో సానుభూతి నటిస్తూ వారిని నమ్మించి పెళ్లి చేసుకునేవాడు. ఆ తర్వాత కొత్త ప్లాట్ కొనాలనో, ఇల్లు కట్టాలనో రకరకాల కారణాలు చెప్పి వారి నుంచి భారీగా డబ్బు గుంజేసి పారిపోవడం ఇతడి నైజం.
ఈ ఘరానా మోసం వెలుగుచూడటానికి ఓ వృద్ధురాలు ఇచ్చిన ధైర్యమే కారణం. 2019లో పేపర్‌లో వచ్చిన పెళ్లి ప్రకటన చూసి ఆమె తన మనవరాలిని వీడికిచ్చి వివాహం చేసింది. పెళ్లయ్యాక కొన్నాళ్లకు ఒత్తిడి చేసి వారి నుంచి రూ. 82 లక్షల నగదు వసూలు చేశాడు. అంతేకాకుండా, 2022 ఫిబ్రవరిలో బంధువుల పెళ్లికి వెళ్తున్నానని చెప్పి.. ఇంట్లోని 33 తులాల బంగారంతో ఉడాయించాడు. దీంతో మోసపోయామని గ్రహించిన సదరు వృద్ధురాలు 2022 మార్చిలో ఠానే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేయగా కళ్ళు బైర్లు గమ్మే నిజాలు బయటపడ్డాయి. ఇతగాడు ఇదే తరహాలో ఏకంగా 25 మందికి పైగా మహిళలను మోసం చేసినట్లు తేలింది. మహిళల నుంచి కాజేసిన సొమ్ముతో జల్సాలు చేస్తూ ఒక లగ్జరీ బీఎండబ్ల్యూ (BMW) కారును కూడా కొనుగోలు చేశాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆ కారును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మరో షాకింగ్ నిజం ఏమిటంటే.. తండ్రి చేస్తున్న ఈ దగా దందాలో అతడి కుమారుడికి కూడా భాగస్వామ్యం ఉన్నట్లు తేలడంతో, పోలీసులు అతనిపై కూడా కేసు నమోదు చేశారు.
Also Read: అస్సాంలో ఘోర ప్రమాదం.. జోర్హాట్ ఐఏఎఫ్ బేస్‌లో కుప్పకూలిన కార్గో విమానం!