Crime News: స్వేచ్ఛ బ్యూరో: వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను పోలీస్ కానిస్టేబుల్ ఉన్నప్పటికీ భర్త కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన జహీరాబాద్ లో సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జహీరాబాద్ పట్టణ పరిధిలోని వెంకటరమణ కాలనీలో నివాసముండే కవిత అనే వివాహిత మార్చ్ 27న ఇంటి నుంచి తన ప్రియుడు పవన్ తో కలిసి వెళ్ళింది. భార్య కనిపించకపోవడంతో భర్త సిద్ధారెడ్డి మార్చ్ 30వ తేదీన జహీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన జహీరాబాద్ పోలీసులు విచారణ చేపట్టి కవిత తన ప్రియుడితో జడ్చర్లలో ఉన్నట్లు గుర్తించారు.
సోమవారం కవితను తిరిగి జహీరాబాదుకు తీసుకురావడానికి ఒక కానిస్టేబుల్ భర్త సిద్ధారెడ్డిని వెంట తీసుకొని జడ్చర్లకు వెళ్లారు. జడ్చర్లలో కవితతో మాట్లాడిన భర్త సిద్ధారెడ్డి, కానిస్టేబుల్ ఆమెను తీసుకొని కారులో జహీరాబాద్ కు బయలుదేరారు. మార్గ మధ్యలో సిద్ధారెడ్డి అనుమానం రాకుండా బయటకు వెళ్లి ఓ కత్తి కొనుగోలు చేసి తన వద్ద ఉంచుకున్నాడు. కవితతో పాటు ఆమె భర్త సిద్ధారెడ్డి కారు వెనుక సీట్లో కూర్చోగా, వెనుక వచ్చిన కానిస్టేబుల్ ముందు సీట్లో కూర్చున్నాడు. వెనుక కూర్చున్న భార్య భర్తలు ఇప్పటివరకు అయినదేదో అయింది ఇకముందు మంచిగా ఉందామని మాట్లాడుకున్నారు.
Also Read: నల్లగొండ పాలిటిక్స్‌లో పెను మార్పులు.. కోమటిరెడ్డి నిర్ణయంపైనే అందరి కళ్లు!
సదాశివపేట మండలం నంది కంది గ్రామ సమీపంలోకి వచ్చేవరకు వారు మాట్లాడుకున్నారు. కానీ కవిత మాత్రం భర్త సిద్ధారెడ్డి తో ఉండేందుకు ససేమిరా ఒప్పుకోకపోవడంతో కోపాన్ని ఆపుకోలేక ఆవేశంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో కవిత గొంతు పై పొడిచి హత్య చేశాడు.ముందు సీట్లో కూర్చున్న కానిస్టేబుల్ భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారన్న ఉద్దేశంతో వారిపై దృష్టి పెట్టలేదు. సిద్ధారెడ్డి కత్తితో కవితను పొడవడంతో ఆమె పెట్టిన అరుపులకు కానిస్టేబుల్ అప్రమత్తమయ్యాడు. వెంటనే తీవ్ర గాయాలైన కవితను జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితుడు సిద్ధారెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు జహీరాబాద్ సిఐ శివలింగం తెలిపారు.
Also Read: నూతన రైతు డిస్కంలో ప్రాంతీయ చిచ్చు.. సీఎండీ ఆఫీసులో అవమానకర సీన్లు..?