Meerut Murders : ఉత్తర్ ప్రదేశ్ లోని మేరఠ్ లో ఘోర ఘటన వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన దంపతులు సహా పదేళ్లలోపు ఉన్న ముగ్గురు చిన్నారులు దారణ హత్యకు గురయ్యారు. తల్లిదండ్రుల మృతదేహాలు దుప్పట్లో చుట్టి కింద పడేయగా, ముగ్గురు చిన్నారుల మృతదేహాల్ని గోనె సంచుల్లో చుట్టి.. పరుపు కింద పెట్టే బాక్సుల్లో కుక్కారు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు.. ఇప్పటికే ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకోగా, మరికొందర్ని విచారిస్తున్నారు.
సంఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు తెలిపిన పోలీసులు.. వారి తలలపై లోతైన గాయాలు ఉన్నట్లు వెల్లడించారు. ఏదైనా రాడ్డు లాంటి దానితో బలంగా దాడి చేయడం కారణంగానే వీరు మరణించినట్లుగా పోలీసులు తెలుపుతున్నారు. కాగా.. చనిపోయిన వారిని.. మొయిన్(52) అతని భార్య ఆస్మా(45)ల కుటుంబంగా పోలీసులు తెలిపారు. మొయిన్ తాపీ మేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరితో పాటుగా.. వీరి ముగ్గురు కుమార్తెలు అఫ్సా(8), అజీజా(4), అదీబా(1)లుగా గుర్తించారు. వీరంతా.. లిసారి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుహైల్ గార్డెన్ ప్రాంతంలో నివసిస్తున్నారు.
ఒక్కసారిగా అన్నా, వదినలు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన అస్మా సోదరుడు సలీం ఇంటికి వెళ్లి చూడగా.. ఇంటికి తాళం వేసి ఉంది. అనుమానంతో స్థానికుల సాయంతో.. తాళం పగులగొట్టి చూడగా ఇంట్లో మృతదేహాలు కనిపించాయి. చిన్నారులు సహా అన్నా, వదినలు విగతజీవులుగా పడి ఉండడంతో దిగ్భ్రాంతికి గురైన సలీం.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. చనిపోయిన అందరి తలలకు తీవ్ర గాయాలున్నాయని, మెడపై కోసిన గుర్తులు ఉన్నట్లు గుర్తించారు.
ఈ హత్యలకు ఆస్మా చిన్న ఆడపడచు, ఆమె ఇద్దరు సోదరులే ఈ దారుణానికి కారణమని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. కాగా.. నిందితుల్లో ఇప్పటికే ఇద్దర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరింత మంది అనుమానితుల్ని ప్రశ్నిస్తున్నారు. ఇంటికి బయట నుంచి తాళం వేయడాన్ని బట్టి కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు పోలీసులు. ఇంత దారుణంగా హత్యలు చేసేందుకు పాత కక్షలే కారణమని భావిస్తున్నారు. చుట్టుపక్కల విచారణలోనూ వారు కుటుంబ సభ్యులే ఇటీవల ఈ ప్రాంతానికి వచ్చినట్లు తేలిందన్నారు.
Also Read : కొండపోచమ్మ సాగర్ లో ఐదుగురు యువకులు గల్లంతు.. పండుగ వేళ తీవ్ర విషాదం
ప్రస్తుతం.. అనుమానితుల్లో కొందరు పరారీలో ఉన్నట్లు తెలిపిన సీనియర్ పోలీస్ అధికారులు.. త్వరలోనే నిందితుల్ని అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ ఆధారాలు సేకరిస్తున్నారు. హత్యలకు కారణాలేమైనా.. అభంశుభం తెలియని చిన్నారుల ప్రాణాలు తీయాడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. అల్లారుముద్దుగా.. తిరిగిన పిల్లలు నిర్జీవంగా పడి ఉండడాన్ని చూసి చలించిపోతున్నారు.