హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన నార్సింగి జంట హత్యల కేసు చిక్కుముడి వీడింది. ఈ దారుణానికి పాల్పడింది హత్యకు గురైన మహిళ రెండో ప్రియుడిగా పోలీసులు తేల్చారు. హంతకుడిని, అతడికి సహకరించిన మరో ముగ్గురు నిందితులను నార్సింగి పోలీసులు మధ్యప్రదేశ్ లో అరెస్టు చేశారు. త్వరలో వీరిని హైదరాబాద్ కు తీసుకురానున్నారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?
ఈ నెల 12న నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పుప్పాలగూడలో జంట హత్యలు కలకలం రేపాయి. వివాహితతో పాటు ఆమె ప్రియుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మంగళవారం (జనవరి 14న) నాడు కొంత మంది యువకులు గాలి పటాలు ఎగురవేసేందుకు పద్మనాభస్వామి గుట్టల వైపు వెళ్లారు. అక్కడ రెండు మృతదేహాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్ కు చేరుకుని పోలీసులు విచారణ జరిపారు. మృతులు చత్తీస్ గఢ్ కు చెందిన బిందు(27), మధ్యప్రదేశ్ కు చెందిన అంకిత్ సాకేత్(27)గా గుర్తించారు. బిందుకు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది.
వివాహేతర సంబంధమే హత్యలకు కారణం
జంట హత్యల కేసును నార్సింగి పోలీసులు ముమ్మరం చేశారు. రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విచారణలో అక్రమ సంబంధాల కారణంగానే జంట హత్యలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నానక్ రామ్ గూడలో ఉంటున్న అంకిత్ కు ఎల్బీనగర్ లో ఉంటున్న బిందుకు కొంతకాలం క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అంకిత్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే, మరో యువకుడితో ఎఫైర్ పెట్టుకుంది. ఈనె ఈనెల 3న ఇంటి నుండి వెళ్లిపోయిన బిందు.. సాకేత్ దగ్గరికి చేరింది. తన భార్య బిందు కనిపించడం లేదంటూ భర్త జనవరి 4న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మధ్యప్రదేశ్ లో నిందితుల అరెస్ట్
ఈ నెల 12న సాకేత్, బిందు కలిసి పుప్పాలగూడ గుట్ట దగ్గరికి వెళ్లారు. విషయం తెలుసుకున్న బిందు రెండో ప్రియుడు.. పుప్పాలగూడ గుట్ట దగ్గరికి వెళ్లాడు. బిందు సాకేత్ తో ఏకాంతంగా ఉండటాన్ని తట్టుకోలేకపోయాడు. ఇద్దరిని కత్తులతో విచక్షణారహితంగా పొడిచాడు. అతడి నుంచి తప్పించుకుని పారిపోయేందు ప్రయత్నించినా, వెంటాడి వేటాడి చంపాడు. అనంతరం బండరాళ్లతో మోదాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి ఆచూకీ కనిపెట్టే ప్రయత్నం చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. హత్య చేసిన అనంతరం మధ్యప్రదేశ్ కు పారిపోయినట్లు గుర్తించి పోలీసులు, అక్కడికి వెళ్లి ప్రధాన నిందితుడితో పాటు అతడికి సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. రెండు రోజుల్లో వారిని హైదరాబాద్ కు తీసుకురానున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also: ఇంటి తాళం పగులగొట్టి 20 తులాల బంగారం, 25 లక్షలు చోరీ.. తెలిసిన వాళ్ల పనేనా?