New bride Suicide: సారీ నాన్న.. ఈ మెంటల్ టార్చర్ ఇక భరించలేనంటూ.. పెళ్లైన 2 నెలలకే నవ వధువు సూసైడ్ చేసుకుంది. ఈ విషాద సంఘటన తమిళనాడులోని తిరుప్పూర్‌లో జరిగింది. చెన్నైకి చెందిన గార్మెంట్ కంపెనీ ఓనర్ అన్నాదురై తన కుమార్తె రిధన్య వివాహం గత ఏప్రిల్ లో జరిపించారు. దాదాపు రూ. 2.5 కోట్లు ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా ఈ వివాహం చేశారు. కట్నం కింద 800 గ్రాముల బంగారు అభరణాలు, రూ.70 లక్షల విలువైన వోల్వో కారు ఇచ్చారు. అయిన సరే పెళ్లైన పది రోజులకే అత్తింటి వారి నుంచి రిధన్యకు వేధింపులు మొదలయ్యాయి.
భర్త కవిన్ కుమార్, అతని తల్లిదండ్రులు రిధన్యపై అదనపు కట్నం కోసం తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ఆమెను మాటలతోనే కాదు, శారీరకంగా కూడా హింసించారు. భర్త నుంచి ప్రేమ లభించకపోవడమే కాకుండా రోజూ కించపరచే మాటలు, హింస కారణంగా ఆమె మానసికంగా బాగా దెబ్బతింది. తన తల్లిదండ్రులకు ఏమీ చెప్పకుండా ఆ వేదనను మౌనంగా భరిస్తూ వచ్చింది. అత్తింటి వేధింపులు ఎక్కువ కావటంతో రిధన్య సూసైడ్ చేసుకుంది.
అయితే, ఆదివారం రోజున రిధన్య “ఓ ఆలయానికి వెళ్తున్నాను” అంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కానీ మధ్యలో తన కారులోనే పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
మరణానికి ముందు రిధన్య తన తండ్రికి వరుసగా.. ఏడు వాట్సాప్ మెసేజులు పంపింది. వాటిలో తాను ఎదుర్కొంటున్న మానసిక, శారీరక వేధింపులను వివరించింది. “ఈ జీవితం నాకిష్టం లేదు నాన్న.. మీరు ఎంతో ఘనంగా పెళ్లి చేశారు. కానీ వాళ్లు నన్ను తీవ్రంగా హింసించారు. నేను ఇక బతకలేను ఇంక. “నువ్వు, అమ్మ నా ప్రపంచం. నా చివరి శ్వాస వరకు నువ్వే నా ఆశ, కానీ నేను నిన్ను చాలా బాధపెట్టాను. నువ్వు ఈ విషయం బహిరంగంగా చెప్పలేకపోతున్నావు, నన్ను ఇలా చూడలేకపోతున్నావు. నీ బాధ నాకు అర్థమవుతుంది. క్షమించండి నాన్న.. అంతా అయిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను” అంటూ రుధిరించిన మాటలు మెసేజ్‌లలో ఉన్నాయి.
తన కుమార్తెను ఎంతో ప్రేమతో పెంచిన అన్నాదురై దంపతులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. “అమ్మాయికి సుఖంగా ఉండాలని భారీగా కట్నం ఇచ్చాం. కానీ ఈ రోజు మిగిలింది కూతురి మృతదేహం మాత్రమే..” అని కన్నీళ్లతో రిధన్య తల్లితండ్రులు తీవ్ర దుఖంలో మునిగిపోయారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.
Also Read: ఫుల్‌గా మందుకొట్టి.. కారులో ఏసీ వేసుకుని నిద్ర.. తెల్లారేసరికి ఆ ఇద్దరూ..
పోలీసులు కేసు నమోదు చేసి, రిధన్య భర్త కవిన్ కుమార్, అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. వారి అరెస్టు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. రిధన్య మరణం కట్న వేధింపుల ఘోరతను మరోసారి బయటపెట్టింది. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా.. చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు, హ్యూమన్ రైట్స్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.