Kitchen Tiles Cleaning : వంటగది శుభ్రత ఇంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. వంటగదిలో జిడ్డు, నూనె మరకలు, ఆహార పదార్థాల మరకలు లేకుండా టైల్స్, సింక్, స్టవ్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. వెనిగర్, బేకింగ్ సోడా వంటి సహజ పదార్థాలు జిడ్డును తొలగించి, మెరుపును అందిస్తాయి. శుభ్రమైన వంటగది క్రిములను దూరంగా ఉంచి.. కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తుంది.
కానీ కిచెన్ ఎక్కువగా వాడటం వల్ల టైల్స్ త్వరగా నల్లగా లేదా పసుపు రంగులోకి మారతాయి. ఇవి చూడటానికి అసహ్యంగా కనిపించడమే కాకుండా.. బ్యాక్టీరియా పెరగడానికి కూడా దోహదపడతాయి. అయితే.. మార్కెట్లో లభించే ఖరీదైన, రసాయనాలతో తయారు చేసిన క్లీనర్లకు బదులుగా.. మీ ఇంట్లో సులభంగా దొరికే కొన్ని పదార్థాలతోనే కిచెన్ టైల్స్‌ను మెరిసేలా చేయవచ్చు. ఈ ఇంటి చిట్కాలు ప్రభావవంతంగా పనిచేయడమే కాకుండా. మీ ఆరోగ్యానికి కూడా ఎలాంటి హాని కలిగించవు.
1. బేకింగ్ సోడా, వెనిగర్:
కావాల్సినవి:
సగం కప్పు- బేకింగ్ సోడా
తగినంత -వెనిగర్
ఎలా వాడాలి ?
ఒక గిన్నెలో సగం కప్పు బేకింగ్ సోడా తీసుకొని.. దానికి సరిపడా నీటిని కలిపి చిక్కటి పేస్ట్‌ను తయారు చేయండి. ఈ పేస్ట్‌ను జిడ్డు పట్టిన టైల్స్‌పై.. ముఖ్యంగా మరకలు ఎక్కువగా ఉన్న చోట అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత 15-20 నిమిషాలు అలాగే ఉంచండి.
తర్వాత ఒక స్ప్రే బాటిల్‌లో తెల్ల వెనిగర్‌ను తీసుకొని.. పేస్ట్ వేసిన చోట స్ప్రే చేయండి. బేకింగ్ సోడా, వెనిగర్ కలిసినప్పుడు బుడగలు వస్తాయి. కొన్ని నిమిషాలు అలా ఉంచి, ఆపై ఒక స్క్రబ్బర్ లేదా బ్రష్‌తో రుద్ది శుభ్రం చేయండి. చివరగా.. తడి క్లాత్ తో తుడిచి ఆరనివ్వండి. వెనిగర్ యాసిడ్ గుణాలు జిడ్డును తొలగిస్తాయి. అంతే కాకుండా బేకింగ్ సోడా తక్కువ సమయంలో మరకలను మాయం చేస్తుంది. బేకింగ్ సోడాతో పాటు వెనిగర్ మిశ్రమం కిచెన్ టైల్స్ శుభ్రపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
2. నిమ్మరసం, ఉప్పు:
కావాల్సినవి:
నిమ్మరసం- ఒక కప్పు
ఉప్పు- తగినంత
ఎలా వాడాలి ?
ఒక గిన్నెలో శుభ్రం చేయాలనునే ప్రదేశానికి సరిపడా నిమ్మకాయ రసం తీసుకొని.. దానికి తగినంత ఉప్పును కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని నేరుగా మరకలపై రుద్దండి. పది నిమిషాలు అలాగే వదిలేయండి. అనంతరం స్క్రబ్బర్‌తో రుద్ది, గోరువెచ్చని నీటితో తుడిచి శుభ్రం చేయండి. నిమ్మ వాసన కిచెన్‌ను తాజాగా ఉంచుతుంది. అంతే కాకుండా నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ సహజమైన క్లీనర్‌గా పనిచేస్తుంది. ఉప్పు స్క్రబ్బింగ్ ఏజెంట్‌గా సహాయపడుతుంది.
3. గోరువెచ్చని సబ్బు నీరు:
కావాల్సినవి:
గోరు వెచ్చటి నీరు – చిన్న బకెట్
లిక్విడ్ డిటర్జెంట్ (సర్ఫ్)- తగినంత
ఎలా వాడాలి ?
బకెట్‌లో గోరువెచ్చని నీటిని తీసుకొని..దానికి కొద్దిగా డిష్ సోప్ లేదా లిక్విడ్ డిటర్జెంట్ కలపండి. తర్వాత ఒక స్పాంజ్ లేదా క్లాత్ ను ఈ నీటిలో ముంచి, కిచెన్ టైల్స్‌ను పూర్తిగా తుడవండి. లేదంటే బ్రష్‌తో రుద్దండి. ఇది తేలికపాటి జిడ్డు, ధూళిని సులభంగా తొలగిస్తుంది. చివరగా.. శుభ్రమైన తడి క్లాత్ తుడిచి ఆరనివ్వండి.
4. హైడ్రోజన్ పెరాక్సైడ్ :
ఎలా వాడాలి ?
హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను నేరుగా టైల్స్ పై స్ప్రే చేయండి. 10-15 నిమిషాలు అలాగే ఉంచి.. చిన్న బ్రష్ లేదా పాత టూత్‌బ్రష్‌తో రుద్ది శుభ్రం చేయండి. ఇది ట్రైల్స్ లోపల పేరుకుపోయిన మురికిని, శిలీంధ్రాలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా కొత్త వాటిలాగా మెరిసేలా చేయడంలో ఉపయోగపడుతుంది. టైల్స్ యొక్క లైన్స్ మధ్య ఉండే మురికిని శుభ్రం చేయడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ చాలా బాగా పనిచేస్తుంది.
Also Read: గ్యాస్ బర్నర్‌లు నల్లగా మారాయా ? ఇలా చేస్తే.. కొత్త వాటిలా మెరిసిపోతాయ్
అదనపు చిట్కాలు:
తరచుగా శుభ్రపరచడం: జిడ్డు పేరుకుపోకుండా ఉండాలంటే.. రోజూ సబ్బు నీటితో టైల్స్‌ను తుడవండి.
స్ప్రిట్జ్ బాటిల్: వెనిగర్, బేకింగ్ సోడా మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్‌లో ఉంచుకొని.. అవసరమైనప్పుడు వాటిపై చల్లి క్లీన్ చేయండి. ఉపయోగించండి.
రక్షణ: వంట చేసేటప్పుడు వీలైనంత వరకు జిడ్డు మరకలు పడకుండా చూసుకోవడానికి.. స్టవ్ వెనుక గోడకు స్ప్లాష్ గార్డు ఉపయోగించండి.