Ongole Honour Killing: క్షణికావేశంతో తల్లిదండ్రులే కుమార్తె గొంతు నులిమి చంపడం సంచలనం సృష్టించింది. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. పెళ్లైన వ్యక్తిని ప్రేమించిందన్న ఆగ్రహంతో ముంగమూరు రోడ్డులోని రమేష్, లక్ష్మి దంపతులు చిన్న కుమార్తె తనూషను హత్య చేశారు.
ప్రేమలో పడిన తనూష – కుటుంబానికి నచ్చని సంబంధం
డిగ్రీ చదివి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేది తనూష. అయితే కొన్ని రోజుల క్రితం ఉద్యోగం మానేసి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ క్రమంలో ఒంగోలుకు చెందిన పెళ్లయి పిల్లలున్న ఒక వ్యక్తిని తనూష ప్రేమించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు రమేష్, లక్ష్మిలు తీవ్ర ఆవేశానికి గురయ్యారు. ఇలా చేయడం తప్పు అని ఆమెను తీవ్రంగా మందలించారు.
ఘర్షణ.. ఆపై ఘోరానికి దారి
ఇదే విషయమై తనూషకు.. ఆమె తల్లిదండ్రులకు మధ్య తీవ్ర వివాదం జరిగింది. అనేకసార్లు మాటామాటా పెరిగి, తల్లిదండ్రులు–కుమార్తె మధ్య విబేధాలు పెరిగాయి. చివరకు గురువారం రోజు, మరోసారి మాటల తూటాలు పేలడంతో ఆవేశానికి లోనైన తల్లిదండ్రులు తీవ్రంగా దాడికి దిగారు. రమేష్, లక్ష్మిలు తనూష గొంతు నులమడంతో ఊపిరాడక ప్రాణం వదిలింది.
హత్యను ఆత్మహత్యగా మార్చే ప్రయత్నం
ఘటనను ఆత్మహత్యలా మలచేందుకు కుట్ర పన్నారు. తనూష మెడకు చున్నీ బిగించి ఫ్యానుకు వేలాడదీశారు. తమ కుమార్తె ఇంట్లో ఉరివేసుకుందని, అప్పటికే ఇంట్లో కరెంట్ లేదని.. అందుకే గమనించలేకపోయామంటూ నాటకం ఆడారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అందించిన సమాచారం మేరకు.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. తనూష మృతదేహాన్ని జీజీహెచ్ కి తరలించారు.
అనుమానాలపై విచారణ – అసలు కథ బయటపడింది
ఘటనపై మొదటి నుంచీ అనుమానంగా చూసిన పోలీసులు, తల్లిదండ్రుల వాంగ్మూలంలో తడబాటును గుర్తించారు. వారి వ్యవహార శైలిలో అన్మానాస్పదత కనిపించడంతో.. వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. మరోవైపు మృతదేహంపై పోస్టుమార్టం నివేదికలోనూ ఉరి కాదు, గొంతు నులిమిన గుర్తులున్నాయని తేలింది. దీంతో తల్లిదండ్రులను కఠినంగా ప్రశ్నించగా, వారు చివరకు హత్య చేసిన విషయం ఒప్పుకున్నారు.
కేసు నమోదు – పోలీసులు దర్యాప్తు ముమ్మరం
పోలీసులు తల్లిదండ్రులపై హత్య నేరంగా.. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. కేసు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనలో ఇప్పటికే సమీప బంధువుల వాంగ్మూలాలు తీసుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.
Also Read: లవ్ ఫెయిల్యూర్.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
మానవ సంబంధాలపై మచ్చ
ఈ ఘటన మానవ సంబంధాలను తీవ్రంగా కలచివేస్తోంది. తల్లిదండ్రులు తమ కుమార్తె భవిష్యత్తును కాపాడాలన్న ఉద్దేశంతోనే ఇలా చేసినా, ఇది చట్టపరంగా సరైన మార్గం కాదని నిపుణులు అంటున్నారు. ఒంగోలులో జరిగిన ఈ దారుణ ఘటన తల్లిదండ్రులు, పిల్లల మధ్య వాదనలపై సున్నితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. క్షణికావేశంతో నిండు జీవితం ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. సమాజంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరంతరం అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.