Road Accident: జాతీయ రహదారిపై అర్ధరాత్రి వేళ ప్రయాణం అంటేనే ఒక తెలియని భయం. అలాంటిది నిశ్శబ్దంగా ఉన్న ఆ రాత్రిని ఒక్కసారిగా మృత్యువు ముంచేసింది. పల్నాడు జిల్లా బోయపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఊహించని రీతిలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఒక లారీని, వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన మరో లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు రెండు లారీల్లోనూ ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే అగ్నికీలలు వాహనాలను చుట్టుముట్టడంతో, లోపల ఉన్నవారు బయటపడేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది.
ఈ పెను ప్రమాదంలో రెండు లారీలకు సంబంధించిన ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు క్లీనర్లు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో మంటలు ఆకాశాన్ని తాకేలా ఎగసిపడటంతో స్థానికులు, తోటి వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. క్యాబిన్లలో చిక్కుకుపోయిన బాధితులు ప్రాణాల కోసం చేసిన హాహాకారాలు అక్కడి వారిని కలచివేసాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చినప్పటికీ, అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. నలుగురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. మితిమీరిన వేగం లేదా డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. చీకటిగా ఉన్న సమయంలో రోడ్డుపై ఆగివున్న లారీని గమనించకపోవడం కూడా దీనికి ఒక కారణం కావచ్చు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాదంతో జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. క్షణకాలం అజాగ్రత్త ఎంతటి పెద్ద విపత్తుకు దారితీస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది. మృతుల కుటుంబాల్లో ఈ ప్రమాదం కోలుకోలేని విషాదాన్ని నింపింది.
Also Read: బీ అలర్ట్.. నేడు తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ జిల్లాల్లో పిడుగుల వాన!