Afzalgunj Firing Case | అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో నిందితుల పట్టుబడటానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించి, నిందితుల కదలికలను సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. దోపిడీ కోసం దుండగులు వాడిన బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎంజీబీఎస్ బస్టాండ్ పార్కింగ్ ఏరియాలో వాహనం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కాల్పుల ఘటనలపై విచారణ
ఇటీవల కర్ణాటకలోని బీదర్‌లో జరిగిన దారుణ ఘటన జరిగింది. ఏటీఎంలో నగదును జమ చేస్తుండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు సెక్యూరిటీ సిబ్బంది, బ్యాంకు సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు రూ.93 లక్షల నగదును దొంగిలించిన నిందితులు, నగరానికి చేరుకుని నగదును బ్యాగుల్లో మార్చారు.
Also Read: డాక్టర్ చేతిలో పేషెంట్ సజీవ దహనం!.. వైద్యుడే హంతకుడు
అంతకుముందే హైదరాబాద్ చేరుకొని నగరం శివారుల్లో నుంచి ఒక బైక్ దొంగతనం చేశారు. ఆ బైక్ పైనే ఇద్దరు దుండగులు బీదర్ వరకు వెళ్లి దోపిడి చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఏటిఎం దోపిడీ తరువాత తిరిగి అదే టూ వీలర్‌పైనే హైదరాబాద్ చేరుకున్నారు. MGBS బస్టాండ్‌లోనే బైక్ పార్క్ చేసి వెళ్లిపోయారు. అక్కడి నుంచి రాయ్ పూర్ వెళ్లేందుకు అఫ్జల్‌గంజ్ లోని ఒక ట్రావెల్ ఏజెన్సీలో సంప్రదించగా.. అక్కడ ట్రావెల్ ఏజెన్సీ సిబ్బందితో గొడవ జరిగి అతనిపై దుండగులు కాల్పులు జరిపారు.
అఫ్జల్‌గంజ్ ఘటన
రోషన్ ట్రావెల్స్ బస్సు ద్వారా రాయ్‌పూర్ వెళ్లేందుకు టికెట్ తీసుకున్న నిందితులు, ట్రావెల్స్ ఏజెంట్ జహంగీర్ అనుమానంతో బ్యాగులను తనిఖీ చేయాలని ప్రయత్నించగా, ఆయనపై కాల్పులు జరిపి పరారయ్యారు.
అఫ్జల్‌గంజ్‌లో కాల్పులు జరిపిన తరువాత దుండగులు మొదట తిరుమలగిరి నుంచి ఆటోలో షామీర్‌పేట్ వరకు చేరుకొని, అక్కడి నుంచి షేరింగ్ ఆటోలో గజ్వేల్‌కు వెళ్లారు. ఆ తరువాత గజ్వేల్ నుంచి లారీలో ఆదిలాబాద్‌కు చేరుకున్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బీహార్‌కు వెళ్ళినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
నిందితుల గుర్తింపు
పోలీసులు దర్యాప్తులో బీహార్‌కు చెందిన అమిత్, అతడి సహచరుడు మనీష్‌లను ప్రధాన నిందితులుగా గుర్తించారు. వీరి కోసం బీదర్, హైదరాబాద్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో తిరిగినట్లు గుర్తించారు. సికింద్రాబాద్‌లో వీరిని ఆటో డ్రైవర్ దింపినట్లు సమాచారం సేకరించారు. వీరిద్దరూ కొన్ని రోజుల క్రితం ఛత్తీస్ గడ్ లో కూడా ఏటీఎం సిబ్బందిని తుపాకీతో బెదిరించి రూ.70 లక్షలు కాజేసినట్లు తెలిసింది. గతంలో కూడా మనీష్ ఇలాంటి దొంగతనాల కేసులో నిందితుడిగా ఉండగా.. అతను నేపాల్ పారిపోయి అక్కడ కొంతకాలం ఉన్నాడు ఆ తరువాత ఇటీవల ఇండియా తిరిగి మళ్లీ దోపిడీలు మొదలు పెట్టాడు. ఈ క్రమంలో అతని కోసం నాలుగు రాష్రాల పోలీసులు (ఛత్తీస్ గడ్, బీహార్, తెలంగాణ, కర్ణాటక) గాలిస్తున్నారు.
నిందితులు పోలీసులను తప్పించుకుని విభిన్న ప్రాంతాలల్లో దాక్కొని ఉండగా.. వారిని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. అయితే, వారిని పట్టుకునే వరకు తమ ప్రయత్నాలు ఆగవని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.