Man Kills 10th Wife| ఈ ప్రపంచంలో క్రూర స్వభావం కలవారు ఇప్పటికీ ఉన్నారని చెప్పేందుకు తాజాగా ఒక ఘటన జరిగింది. ఒక వ్యక్తి తన భార్య చిన్న తప్పు చేసిందని ఆరోపిస్తూ ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. అయితే అంతకుముందు అతడు తొమ్మిది సార్లు వివాహం చేసుకున్నాడని వారందరూ అతడి నుంచి విడాకులు తీసుకొని వెళ్లిపోయారని తెలిసింది. ఈ ఘటన ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని జష్‌పూర్ పట్టణానికి చెందిన ధులా రామ్ అనే 38 ఏళ్ల యువకుడికి మానసిక సమస్యలున్నాయి. అతను గతంలో 9 సార్లు పెళ్లి చేసుకున్నాడు. అయితే ధులా రామ్ కోపిష్టి కావడంతో తన భార్యలకు చిత్రహింసలు పెట్టేవాడు. ప్రతీ చిన్న విషయానికి పట్టరాని కోపంతో వారిని చితకబాదేవాడు. ధులా రామ్ పెట్టే హింసలు తట్టుకోలేక అతడిని ఆ 9 మంది భార్యలు వదిలి పెట్టి వెళ్లిపోయారు. అయినా ధులారామ్ వారిని వేధిస్తుండడంతో ఆ తరువాత అతడి నుంచి విడాకులు తీసుకున్నారు.
ఎంత మంది వెళ్లిపోయినా ధులా రామ్ ప్రవర్తనలో మార్పు రాలేదు. అందుకే అతను ఒక భార్య వెళ్లిపోతే మరొక భార్య తీసుకొచ్చేవాడు. అలా 9 మంది భార్యలు వరుసగా వెళ్లిపోయినా ధులా రామ్ పదో సారి పెళ్లి చేసుకున్నాడు. అతని పదో భార్య పేరు బసంతి బాయి. అయితే పేద కుటుంబానికి చెందిన బసంతి బాయి తన భర్త పట్ల నమ్మకంగా ఉండేది. అయినా ధులా రామ్ ఆమెను కూడా కొట్టేవాడు.
ఈ క్రమంలో ధులా రామ్ తన బంధువుల పెళ్లికి బగీచా అనే గ్రామంలో అతిథిగా వెళ్లాడు. తనతో పాటు తన భార్యను కూడా తీసుకెళ్లాడు. ఆ పెళ్లిలో వంట నూనె, బియ్యం, కొన్ని ఖరీదైన బట్టలు ఒక గదిలో నుంచి కనిపించకుండా పోయాయి. దీంతో ఆ గది పక్కనే ఉన్న బసంతి బాయి పై కొందరు అనుమానం వ్యక్తం చేయగా.. ధులా రామ్ ఏ మాత్రం ఆలోచించకుండా ఆమె చితకబాదాడు. ఆ సమయంలో బసంతి బాయి అందరి ముందు ధులా రామ్ లాంటి భర్త తనకు వద్దు అని అతడిని వదిలి వెళ్లిపోతానని బెదిరించింది. దీంతో ధులా రామ్ మరింత కోపం తో ఆమెను కొట్టాడు.
Also Read: ఒక్క రూపాయి కోసం హత్య.. కస్టమర్‌ని చంపిన పాన్ షాపు ఓనర్
ఈ క్రమంలో ఆమె స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకు వెళ్లాల్సిందిగా అందరూ సూచించగా.. ధులా రామ్ ఆమెకు వైద్యం చేయించడానికి తీసుకెళుతూ.. ఇక ఆమె తిరిగి కోలుకుంటే తనను వదిలి వెళ్లిపోతుందని.. ఆలోచించి ఆస్పత్రికి తీసుకెళ్లకుండా సమీపంలోని అడవి ప్రాంతానికి తీసుకెళ్లి బండరాయితో ఆమె తలను పగుల గొట్టాడు. ఆ తరువాత శవంపై అడవిలో విరిగి పడి ఉన్న కొమ్మలు, ఆకులు కప్పేసి పారిపోయాడు. అయిదు రోజుల తరువాత గ్రామస్తులు అటుగా వెళుతుంటే ఏదో దుర్వాసన వచ్చింది. దెగ్గరికి వెళ్లి చూస్తే.. ఏదో గుర్తు తెలియని మహిళ శవం కనిపించింది. ఆ శవాన్ని గ్రామస్తులు ధులా రామ్ భార్యగా గుర్తు పట్టడంతో పోలీసులు ధులా రామ్ ని అరెస్ట్ చేసి హత్య కేసు నమోదు చేశారు.