HBD Nag Ashwin: ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో డైరెక్టర్ గా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకొని, ఆ తర్వాత ‘మహానటి’ సినిమాతో రికార్డు సృష్టించారు డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin). పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా చూడడానికి చాలా సింపుల్ గా ఉంటాడు.. కట్ చేస్తే ఆయన ప్రతిభను మెచ్చుకోవడానికి మాటలు ఉండవు. అంతలా తన అద్భుతమైన డైరెక్షన్తో అందరినీ మెప్పించారు. ముఖ్యంగా గత ఏడాది వచ్చిన ‘కల్కి 2898AD’ సినిమా తర్వాత ఆయన అసలైన ప్రతిభ బయటపడింది. ఇక ప్రస్తుతం కల్కి2 ను తెరకెక్కించే పనిలో పడ్డారు. ఇకపోతే ఈరోజు డైరెక్టర్ నాగ్ అశ్విన్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా.. డైరెక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకుంటున్న ఈయన ఒకప్పుడు డాక్టర్ కావాల్సినవాడట. మరి ఇండస్ట్రీ వైపు ఎలా మలుపు తిరిగాడు..? ఈయనకి ఆ ఆలోచనలు ఎలా వచ్చాయి..? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. మరి నాగ్ అశ్విన్ రియల్ లైఫ్ స్టోరీ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
డాక్టర్ కావాల్సినవాడు డైరెక్టర్ అయ్యాడు..
నాగ్ అశ్విన్ అసలు పేరు నాగ్ అశ్విన్ రెడ్డి.. 1986 ఏప్రిల్ 23న హైదరాబాదులో జయరాం రెడ్డి (Jayaram Reddy), జయంతి(Jayanthi ) దంపతులకు జన్మించారు. వీరిద్దరూ డాక్టర్లే కావడం విశేషం. నిఖిల (Nikhila) అనే చెల్లి ఉండగా ఆమె కూడా డాక్టర్ కావడం గమనార్హం. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన ఈయన.. ఆ తర్వాత మాస్ కమ్యూనికేషన్ జర్నలిజంలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లోనే కాలేజ్ మ్యాగజైన్ కి ఎడిటర్ గా పనిచేశారు. అంతేకాదు కాలేజీలో చెట్లు కొట్టడం తప్పని ఒక వ్యాసం రాసి తిట్లు కూడా తిన్నారు. ఎప్పుడూ చదువులో ముందుండే నాగ్ అశ్విన్ ను చూసిన వారంతా కూడా.. తన తల్లిదండ్రులు లాగే డాక్టర్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ నాగ్ అశ్విన్ మాత్రం మణిపాల్ మల్టీమీడియా కోర్సులో చేరారు. అక్కడ వీడియో ఎడిటింగ్ తో పాటు సినిమా కోర్సుకి కావాల్సిన నాలెడ్జ్ ను సంపాదించుకున్నారు.
నాగ్ అశ్విన్ సక్సెస్ స్టోరీ వెనుక ఇంత కథ ఉందా ..?
ఇక తర్వాత తనకు డైరెక్టర్ అవ్వాలని ఉందని ఇంట్లో వాళ్లకు చెప్పి, న్యూయార్క్ ఫిలిం అకాడమీ ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్ లో చేరారు. ఆ సమయంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలనుకున్నాడు. కానీ ఎలాంటి సపోర్ట్ లేదు. పైగా బ్యాక్ గ్రౌండ్ కూడా లేదు. అయితే కొడుకు ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) వద్దకు నాగ్ అశ్విన్ ను పంపించారు. అప్పుడు ఆయన ‘గోదావరి’ సినిమాను చిత్రీకరిస్తున్నారట. దాంతో తర్వాత ప్రాజెక్టులో తన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం ఇస్తానని శేఖర్ కమ్ముల చెప్పారట. ఈ గ్యాప్ లో మంచు మనోజ్ (Manchu Manoj) హీరోగా నటించిన ‘నేను మీకు తెలుసా?’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయగా ఇందుకోసం 4000 రూపాయల మొదటి పారితోషకం కూడా ఆయనకు లభించింది. ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల నుండి కాల్ వచ్చింది. అలా ‘లీడర్’ , ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. పనిచేయడమే కాదు లీడర్ సినిమాకు ట్రైలర్ కట్ చేసింది కూడా ఈయనే. దీంతో ఈయన టాలెంట్ ను గుర్తించి శేఖర్ కమ్ముల మెచ్చుకున్నారు. ఇక తర్వాత తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవాలనుకున్న నాగ్ అశ్విన్ ‘యాదోమ్ కీ భారత్’ అనే షార్ట్ ఫిలిం కి మొదటిసారి దర్శకత్వం వహించారు. అంతేకాదు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమా ప్రదర్శించబడింది కూడా. ఇక ఈ ప్రదర్శన తర్వాత వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీ దత్ కూతుర్లు ప్రియాంక దత్ (Priyanka Dutt), స్వప్న దత్ (Swapna Dutt)లు ఈయనకు అవకాశం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇక అప్పుడు నాగ్ వీరికి ‘ ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా కథ వినిపించారు. ఇక కథ నచ్చడంతో ప్రియాంక , స్వప్న కూడా సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చారు. అలా తక్కువ బడ్జెట్ తో 2017లో చాలా రిచ్ గా వెండితెరపై మెరిసిన చిత్రం ఎవడే సుబ్రహ్మణ్యం. నాని (Nani), విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. అంతేకాదు ఆ ఏడాది ఉత్తమ చిత్రంగా నంది అవార్డు కూడా లభించింది. ఇక ఆ సమయంలో పలు యాడ్స్ కి డైరెక్షన్ కూడా చేశారు. ఇక అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ‘మహానటి’, ఇప్పుడు ‘కల్కి’ లాంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఈ ప్రయాణంలోనే ప్రియాంక దత్ తో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది.
also read:HBD Singer Janaki : ‘నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా’ గురించి ఎవరికీ తెలియని విషయాలివే..!