Delhi News: దేశంలో దొంగలు రూటు మార్చారా? ఒకప్పుడు భారీ భవనాలపై దృష్టి పెట్టేవారు. ఇప్పుడు భారీ ఈవెంట్లపై కన్నేశారు. దేశ రాజధాని ఢిల్లీలో అదే జరిగింది. భారీ భద్రత ఉండే చారిత్రక ఎర్రకోట ప్రాంగణంలో ఊహించని భారీ చోరీ జరిగింది. జైనుల మతపరమైన కార్యక్రమంలో ప్రదర్శనకు ఉంచిన కోటిన్నర రూపాయల విలువ చేసే రెండు బంగారు కలశాలను దుండగులు తమదైన స్టయిల్‌లో అపహరించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బయటపడింది. నిందితుల కోసం పోలీసుల వేట మొదలైంది. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
ఎర్రకోటలో జైనులకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆగష్టు 15 నుంచి మొదలైన ఈ వేడుకలు సెప్టెంబరు 9 వరకు జరుగుతున్నాయి. అయితే ఈ వేడుకలకు ఢిల్లీ కేంద్రంగా ఉండే ఓ వ్యాపారవేత్త సుధీర్ జైన్ ప్రతిరోజూ తన పూజలో ఉపయోగించే విలువైన కలశాలను తీసుకొస్తున్నారు. 760 గ్రాముల బంగారం, 150 గ్రాముల వజ్రాలు, కెంపులు, పచ్చలతో పొదిగిన ఈ కలశాలు అక్కడికి వచ్చిన వారిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ విషయమై చర్చ జరుగుతున్న సమయంలో దొంగలు గెటప్ మార్చేశారు.
పక్కాగా జైన్ సంప్రదాయ శైలిలో ఎంట్రీ ఇచ్చారు. వారం ప్రారంభంలో జరిగిన ఓ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. ఆయనకు స్వాగతం పలికే సమయంలో సిబ్బంది నిమగ్నమయ్యారు. వచ్చిన అతిధులతో కలిసి దొంగ ఎంట్రీ ఇచ్చాడు. దీన్ని గమనించిన నేరగాడు వేదికపై ఉన్న కలశాలను దొంగిలించాడు. కార్యక్రమం మొదలయ్యాక కలశాలు కనిపించకపోవడంతో నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దొంగ ఆ బంగారు కలశాలను దొంగలించి సైలెంట్‌గా అక్కడి నుంచి పరారైన విజువల్స్ సీసీటీవీలో చిక్కాయి.
నిర్వాహకుల ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు దిగారు. అక్కడుండే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఓ వ్యక్తి కదలికలను గుర్తించినట్లు పోలీసులు, త్వరలో అరెస్టు చేస్తామని చెబుతున్నారు. బాధితుడి బంధువు పునీత్ జైన్ మీడియాతో మాట్లాడారు. నిందితుడు గతంలో మూడు దేవాలయాల వద్ద ఇలాంటి ప్రయత్నాలు చేసినట్టు చెప్పుకొచ్చాడు. ఈ చోరీతో ఎర్రకోట భద్రతా లోపాలపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. ప్రధాని జెండా ఎగురవేసే ఈ చారిత్రక ప్రదేశంలో భద్రతా లోపాలు బయటపడటంపై సర్వత్రా విమర్శలు మొదలయ్యాయి. కొన్ని రోజుల కిందట స్వాతంత్ర్య దినోత్సవ భద్రతా డ్రిల్‌లో భాగంగా డమ్మీ బాంబును గుర్తించడంలో విఫలమైనందుకు ఏడుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది.
ఎర్రకోటలో భారీ చోరీ.. రూ.కోటి విలువైన కలశాలు మాయం..
ఇటీవల ఎర్రకోటలో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో రూ.కోటి విలువ చేసే రెండు కలశాలు చోరీ
సీసీ కెమెరాల్లో రికార్డు అయిన చోరీ దృశ్యాలు
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు
కలశాలు చోరీ చేసిన నిందితుడి కోసం పోలీసుల గాలింపు pic.twitter.com/iOX554UsHg
— BIG TV Breaking News (@bigtvtelugu) September 7, 2025