TGRTC Bus Fire: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో జులై 23, 2025 అర్ధరాత్రి ఆర్టీసీ బస్సుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మిర్యాలగూడ డిపోకు చెందిన TS05Z0047 నంబర్ గల ఈ బస్సు, రోజువారీగా తడకమళ్ల గ్రామంలోని ప్రధాన బస్‌స్టాప్ కూడలిలో నైట్‌హాల్ట్ కోసం పార్క్ చేశారు. అయితే, గుర్తుతెలియని ఆకతాయిలు బస్సు వెనుక భాగంలో నిప్పు అంటించడంతో మంటలు చెలరేగాయి. స్థానికుల ఆరోపణల ప్రకారం, ఈ ఘటనకు తాగుబోతులు లేదా గంజాయి బ్యాచ్ కారణమని అనుమానిస్తున్నారు.
ఆర్టీసీ బస్సుకు నిప్పు.. ఎగసిపడ్డ మంటలు..
ఈ ఘటనను గమనించిన బస్సు డ్రైవర్, కండక్టర్ వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం తెలిపారు. సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పడంలో సఫలీకృతమయ్యారు. అయినప్పటికీ, బస్సు వెనుక భాగం టైర్లతో సహా పూర్తిగా దగ్ధమైంది. బస్సు లోపలి భాగం కూడా కాలిబూడిదైందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది.
ఘటనపై స్పందించిన సీఐ పీఎన్‌డీ ప్రసాద్, ఎస్‌ఐ లక్ష్మయ్య
మిర్యాలగూడ రూరల్ సీఐ పీఎన్‌డీ ప్రసాద్, ఎస్‌ఐ లక్ష్మయ్య సంఘటనా స్థలానికి చేరుకొని బస్సును పరిశీలించారు. పోలీసులు ఈ ఘటనకు కారణమైన వ్యక్తులను గుర్తించేందుకు గాలింపు చేపట్టారు. స్థానికుల నుండి సమాచారం సేకరించి, సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. కానీ, ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది, ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అంతేకాకుండా ఈ ఘటనలో ఆర్టీసీ ఆస్తుల భద్రతపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది.
Also Read: విషాదం నింపిన బోనాలు.. ఫ్రిజ్‌లో పెట్టిన మాంసం తిని..
కఠినంగా శిక్షించాలని గ్రామస్తుల ఆవేదన..
అయితే తడకమళ్ల గ్రామంకు బస్సు లేకపోవడంతో 3 నెలల క్రితం RMకి ఆ ఊరి ప్రజలందరు గ్రామ పంచాయితీతో ఫోన్ చేయించారు. RM వెంటనే స్పందించి తడకమళ్ల నుంచి హైదరాబాద్‌కు బస్సు వసతిని కల్పించారు. అయితే గత మూడు నెలలుగా బస్సు రోజూ వస్తూ నైట్‌హాల్ట్ అక్కడే ఉండటం జరిగేది. ఇంతలోనే రాత్రి 2 నుంచి 2:30 గంటల మధ్య బస్సును తగలబెట్టారు. ఇది ఒక్కటే కాదు ఆ ఊర్లో గత రెండు సంవత్సరాలుగా ఆరచకాలు జరుగుతూనే ఉన్నాయట. ఇంత జరిగిన కూడా ఏ అధికారి పట్టించుకోవడం లేదని.. దీనిని ఇంకా ప్రోత్సహిస్తున్నారని గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు బస్సు తగలబెట్టిన వారిని వెంటనే కనిపెట్టి కఠినంగా శిక్షిస్తే మరోసారి ఇలాంటి తప్పు జరగదని తడకమళ్ల గ్రామస్తులు కోరుతున్నారు.