Sri Satya Sai District Crime: ఆడుతూ పాడుతూ.. ఆనందంగా సాగిపోవాల్సిన బాల్యం.. మృగాళ్ల విష కౌగిట్లో చిక్కుకుంటోంది. సుకుమారమైన లేత ప్రాయం.. కామాంధుల ఉక్కుపిడికిలి మధ్య నలిగిపోతుంది. దేశంలో మహిళలపై, చిన్నారులపై అఘాయిత్యాలు, అరాచకాలకు అంతులేకుండా పోతుంది. ఆఖరికి పసిపిల్లను కూడా వదలడం లేదు. ఒక మహిళ అర్ధరాత్రి ఒంటరిగా నడిరోడ్డుపై ధైర్యంగా నడిచి వెళ్లగలిగినప్పుడే.. దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లు అని ఆనాడు మహాత్మగాంధీ చెప్పారు.
కానీ సమాజంలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. అర్ధరాత్రి కాదు.. పట్టపగలు కానే కాదు.. నడిరోడ్డుపై రావాల్సినవసరం అంతకన్నా లేదు. గడప దాటకుండానే అత్యాచారాలు జరుగుతున్నాయి. అక్కడితో ఆగకుండా దారుణాతి దారుణంగా హత్యలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మహిళల హాహాకారాలు దేశం అంతా వినిపిస్తున్నాయి. పసిబిడ్డల సైతం కామాంధుల విష పిడికిలిలో నలిగి చనిపోతున్నారు. కనీసం మృతదేహాలు కూడా దొరకని పరిస్థితి. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటుతున్నాయి.
తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలో యావత్ సమాజం తలదించుకునే.. అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. రామగిరిలో ఏకంగా రెండేళ్లుగా మైనర్ బాలికపై 13 మంది మృగాళ్లు.. దారుణానికి పాల్పడ్డారు. కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా.. మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వారిలో మైనర్లు, 50 ఏళ్ల వృద్ధులు, ఒక రౌడీషీటర్ కూడా ఉన్నాడు. బాలికపై ఎనిమిదో తరగతి నుంచే ఈ దారుణానికి ఒడిగట్టారు.
బాలిక క్లాస్ మేట్స్ కూడా ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. పంచాయితీ కోసం పెద్దల దగ్గరికి వెళ్తే ఆ గ్రామ పెద్దలు కూడా.. ఆ బాలికపై ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈనెల 5వ తేదీన బయటికి రావడంతో.. అప్పటి నుంచి మైనర్ బాలిక కుటుంబాన్ని.. గ్రామ పెద్దలు కొండ గుట్టల్లో దాచుంచారు. బాలికపై 8వ తరగతి నుంచే ఈ దాడికి ఒడిగట్టారని.. వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మైనర్ బాలిక గర్భం దాల్చినట్లు తెలిపారు.
Also Read: ఏళ్ల మగాడిని లేపేసిన ఆరుగురు మహిళలు.. సినిమా స్టోరీని తలపించే ఘటన
ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం మైనర్ బాలిక గర్భం దాల్చినట్లు పోలీసులు వెల్లడించారు. గతంలోనూ బాలిక గర్భం దాల్చితే అబార్షన్ చేయించారు. ప్రస్తుతం అనంతపురంలోని సఖి సెంటర్‌లో మైనర్ బాలికను ఉంచారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజా సంఘాలు, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.