Srikakulam Crime: వివాహేతర సంబంధాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. భార్య, భర్తల సంబంధంలో మూడో వ్యక్తి రావడంతో జీవితంలో సరిదిద్దుకోలేని తప్పుకు దారితీస్తున్నారు. ఇలాంటి సంఘటనే శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో సంచలనంగా మారింది. పాతపట్నంలో నల్లి రాజు అనే వ్యక్తి మృతి కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ కేసు పోలీసులకే షాక్ కు గురిచేసింది.
అసలు కథ ఇదీ..
పాతపట్నం మొండిగళ్ళ వీధికి చెందిన నల్లి రాజును అతని భార్య నల్లి మౌనికకు వివాహం జరిగి 8 ఏళ్లు అవుతోంది. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. అన్యోన్యంగా సాగిన వీరి జీవితంలో పాతపట్నంలోని మాదిగ వీధికి చెందిన గుండు ఉదయ్ కుమార్ తో మౌనిక పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. భార్యా అక్రమ సంబంధం విషయం రాజుకు తెలిసి వారిద్దరి మధ్య కొంత కాలంగా గొడవలు మొదలయ్యాయి. ఈవిషయం మౌనిక, ఉదయ్ తో తెలిపింది. దీంతో ఇద్దరు కలిసి రాజు అడ్డు తొలగించేందుకు ప్లాన్ వేశారు. ఇందుకోసం ఉదయ్ బావమరిది మల్లికార్జునరావు సహాయం తీసుకున్నాడు. ముగ్గురు కలిసి ఉదయ్ కొత్త ఫోన్ నెంబర్‌తో రాజుతో ఓ అమ్మాయి చేసినట్లు వాట్సప్‌లో చాటింగ్ చేశారు. ఏకాంతంగా కలుద్దాం రమ్మని పిలిచిన రాజు వెళ్లలేదు. దీంతో మొదటి ప్లాన్ బెడిసి కొట్టింది.
పక్కా ప్లాన్ వేసి మరీ
దీంతో రెండో ప్లాన్ వేశారు. ఈసారి ఫెయిల్ కాకుండా గట్టిగా ప్లాన్ చేసుకున్నారు. రాజును ఇంటిలోనే హతమార్చడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. మొదటిరోజు నాలుగు నిద్ర మాత్రలను గుండ చేసి అన్నంలో కలిపి పెట్టగా రాజు మత్తులోకి జారుకున్నాడు. వరుసగా రెండో అంటే హత్య జరిగిన రోజు ఆగస్టు 6న రాత్రి మౌనిక మరో ఆరు నిద్ర మాత్రలను గుండ చేసి రాజుకు అన్నంలో కలిపి పెట్టగా అదితిన్న రాజు తీవ్రమైన మత్తులోకి జారుకున్నాడు. మౌనిక తన ప్రియుడు ఉదయ్‌ను ఫోన్ చేసి రమ్మని పిలిచిందని ఆరోజు రాత్రి 11.30 గంటల సమయంలో ఉదయ్, మల్లికార్జున లు ఇద్దరు కలిసి మొండిగళ్ళ వీధిలో వీధిలైట్లు ఆపేసి మౌనిక ఇంట్లోకి ప్రవేశించారు. రాజు కాళ్లు, చేతులను బలంగా పట్టుకుని రాజు చాతి పై కూర్చుని అతని ముఖంపై తలగడ పెట్టి రాజును ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆ తర్వాత రాజు తాగి పడిపోయినట్లు బండిపై ఒక మద్యం బాటిల్, చెప్పులను తీసుకెళ్లి ఎస్సీ వీధి చివర పెట్టి వచ్చాడు ఉదయ్.
డీఎస్పీ లక్ష్మణరావు వివరణ
రాజు కట్టుకున్న లుంగీని తీసేసి టీ షర్ట్, షార్ట్ వేసి వీధి చివర రాజు మృతదేహాన్ని పడేసి ఏమీ తెలియనట్లు ఉదయ్, మల్లికార్జున.వాళ్ళ ఇళ్లకు వెళ్లిపోయారు. అనంతరం మృతుడు భార్య మౌనిక అత్తకు ఫోన్ చేసి రాత్రి బయటకు వెళ్లి తిరిగి రాలేదని, ఫోన్ చేసిన లిప్ట్ చేయలేదని తెలిపింది. ఎవరికి అనుమానం రాకుండా పాతపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఏడుపు నటిస్తూ తన భర్త మృతిపై పాతపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు ముమ్మరంగా జరగడంతో చివరకు ముగ్గురు భయాందోళన చెంది విషయం ఒప్పుకున్నారు. మౌనిక, ఉదయ్ మల్లికార్జున లు రెవెన్యూ అధికారి వద్ద స్వచ్ఛందంగా లొంగిపోయారు. దీనిపై డీఎస్పీ లక్ష్మణరావు మీడియాకు వివరించారు. ఈనెల13న సాయంత్రం ముగ్గురిని అరెస్టు చేసి నాలుగు సెల్ ఫోన్లు, ఒక స్కూటీని పాతపట్నం సీఐ రామారావు స్వాధీనం చేసుకున్నారు.