Veera Raghava Reddy: నేనే దేవుడిని.. నా మాటే శాసనం.. ఇలాంటి మాటలు సినిమాలలో చూస్తూ ఉంటాం. నిజ జీవితంలో ఇలాంటి మాటలు పలికిన వ్యక్తి ఇప్పుడు కటకటాల పాలయ్యారు. ఆ వ్యక్తి ఎవరో కాదు ఇటీవల చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్ పై దాడి చేసిన వీర రాఘవరెడ్డి. ఈ విషయాలను వెల్లడించింది పోలీసులే కావడం విశేషం. ఇటీవల వీర రాఘవరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు, రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెల్లడించారు.
ఏపీకి చెందిన వీర రాఘవరెడ్డి ఇటీవల చిలుకూరు ఆలయ అర్చకులు రంగరాజన్ పై దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, పోలీసులు కేసు నమోదు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు, హిందూ సంఘాలు దాడిని వ్యతిరేకించాయి. ఈ కేసులో ఇప్పటికే వీర రాఘవరెడ్డిని, మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరంతా రిమాండ్ లో ఉన్నారు.
పోలీసుల రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న అంశాల ఆధారంగా.. వీర రాఘవరెడ్డి పై 2015,2016 లోనే పలు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. తనకు తాను శివుడి అవతారం అంటూ ప్రచారం సాగించి, తన అనుయాయులతో ప్రచారం సాగించారు. శివుడి అవతారంలో రామరాజ్యం స్థాపనకు కృషి చేయాలన్న ఆలోచనతో తనకంటూ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొనేందుకు ప్రత్యేక నియామకాలు నిర్వహించారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ రామ రాజ్యం తోనే సాధ్యమని సోషల్ మీడియా వేదికగా వీడియోలను పోస్ట్ చేస్తూ ప్రచారం సాగించారు.
రామరాజ్యం పేరుతో తనకు మద్దతు పలకాలని, పూజారులను బెదిరించడం వీర రాఘవరెడ్డి అలవాటుగా మార్చుకున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించారు. ఈయనకు గతంలో నేర చరిత్ర ఉందని, అందుకే రామరాజ్యం పేరుతో దోపిడీకి పాల్పడేందుకు పథక రచన చేశారన్నారు. ఒకవేళ వీర రాఘవరెడ్డిని అరెస్టు చేయకుండా ఉంటే, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు అభిప్రాయపడ్డారు. చిలుకూరు రంగరాజన్ వద్దకు వెళ్లిన సమయంలో దాడికి పాల్పడడమే కాక, తనకు మద్దతునివ్వడంలో ఉగాది లోగా ఆలోచించుకోవాలని సమయం ఇచ్చారన్నారు.
Also Read: పార్టీలను కాదు.. పాటను నమ్ముకున్నా.. మంగ్లీ సీరియస్ కామెంట్స్
ఇది ఇలా ఉంటే వీర రాఘవరెడ్డికి చెందిన పలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక జిల్లా కలెక్టర్ ను అరెస్ట్ చేసినట్లు సీఐ తో ఫోన్ లో మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. చట్టాన్ని మీరెలా తీసుకుంటారని సీఐ ప్రశ్నించగా, చట్టం అన్ని హక్కులు ఇచ్చినట్లు ఆ ఆడియోలో ఉంది. మరి ఆ ఆడియోలో ఉన్నది వీర రాఘవరెడ్డి వాయిస్ ఔనా కాదా అన్నది తేలాల్సి ఉంది. అలాగే ఒక వ్యక్తి చేత రామరాజ్యం రాజు అనే తరహాలో ప్రమాణం చేయించిన వీడియోలు కూడా వైరల్ గా మారాయి.