Telugu Student Dies In US: చదువులో ఆ యువతికి తిరుగు లేదు. విదేశాల్లో చదివితే తన కూతురు భవిష్యత్ బాగుంటుందని ఆశపడ్డాడు కన్న తండ్రి. ఉన్న ఆస్తిని అమ్మాడు.. విదేశాలకు పంపాడు. మరో నెల రోజులో కోర్సు పూర్తి కానుంది. బంగారు తల్లికి ఇంటికి వస్తుందనే ఆనందంలో ఆ కుటుంబం ఉంది. అంతలోనే మృత్యువు తరుము కుంటూ వచ్చింది. కారు ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన యువతి, రెండురోజులుగా చావు బతుకుల మధ్య పోరాడుతూ శుక్రవారం ఉదయం మృతి చెందింది.
స్టోరీలోకి వెళ్తే..
గుంటూరులోని రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల వంగవోలు దీప్తి అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. రెండురోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ శుక్రవారం ఉదయం చనిపోయింది. గుంటూరుకి చెందిన హనుమంతరావు- రమాదేవి మొదటి కూతురు దీప్తి. హనుమంతరావు చిరు వ్యాపారి కాగా, భార్య గృహిణి. పెద్ద కూతురు దీప్తి పదో తరగతి, ఇంటర్, ఇంజినీరింగ్‌లో టాపర్‌గా నిలిచింది.
కూతుర్ని చూసి ఆ తండ్రి పొంగిపోయేవాడు. సాక్షాత్తూ చదువుల తల్లి తన ఇంట్లో ఉండేదని ఆనందపడేవాడు. తనకున్న ఆస్తిలో కొంత పొలాన్ని అమ్మేశాడు. చివరకు దీప్తిని అమెరికా పంపించాడు. టెక్సాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చేస్తోంది. మరో నెల రోజులు గడిస్తే చదువు పూర్తి అయ్యేది. ఈనెల 12న ఫ్రెండ్ స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది దీప్తి. వేగంగా వచ్చిన కారు వీరిద్దరిని ఢీ కొట్టింది.
హిట్ కొట్టిన కారు
ఈ ఘటనలో దీప్తి తలకు తీవ్ర గాయమైంది. అలాగే ఆమె ఫ్రెండ్ స్నిగ్ధకూ గాయాలయ్యాయి. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఉన్నత చదువు పూర్తి చేసుకుని నెల రోజుల్లో తిరిగి వస్తుందనుకుంటే ప్రమాదం బారిన పడడం తట్టుకోలేకపోయారు. వెళ్లాలంటే టెక్సాస్ ఎక్కడో కూడా వీరికి తెలీదు.
ALSO READ: ముచ్చటగా మూడో పెళ్లికి ప్లాన్.. నాలుగు నెలలకే ఆ పాపకు నూరేళ్లు
చివరకు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కూతురు చనిపోయిందన్న విషయం ఆ కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచేసింది. తన కూతురు విగత జీవిగా మారడం ఆ తండ్రిని కలచి వేసింది. తండ్రి హనుమంతరావు కన్నీటి మున్నీరు అయ్యారు. మరోవైపు దీప్తి సోదరి ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ నెల 10న తాను దీప్తితో ఫోన్‌లో మాట్లాడానని అవే చివరి మాటలు అవుతాయని అనుకోలేదని కన్నీరు పెట్టింది.
పెమ్మసాని సహాయం
కళాశాలకు వెళ్లి ఆదివారం మాట్లాడతానని చెప్పిందని తెలిపింది. చివరి మాటలని గుర్తు చేసుకుంటూ బోరున విలపించింది. కూతురు ప్రమాదం గురించి తెలియగానే తండ్రి హనుమంతరావు గుంటూరులోని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ క్యాంప్ కార్యాలయాన్ని సంప్రదించారు. తెలిసిన సమాచారం పెమ్మసానికి అందజేశారు. చంద్రశేఖర్ తన టీమ్‌ని అప్రమత్తం చేసి చికిత్స అందించేలా జాగ్రత్త తీసుకున్నారు.
పెమ్మసాని సోదరుడు రవిశంకర్ గుంటూరులో ఉంటున్నాడు. తన ఫ్రెండ్స్ ద్వారా క్రౌడ్ ఫండింగ్ కి చర్యలు తీసుకున్నారు. విరాళాల రూపంలో వచ్చిన నిధులు చికిత్స అందజేశారు. అయినా ఫలితం లేకపోయింది. మూడురోజుల కిందట దీప్తి ఈ లోకాన్ని విడిచిపెట్టింది. దీప్తి మృతదేహాన్ని శనివారం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. అందుకు సంబంధించి ఏర్పాట్లను చేస్తున్నారు పెమ్మసాని రవిశంకర్.