Kakinada Crime: న్యూ ఇయర్ ను పురస్కరించుకుని సరదా కోసం బీచ్ వద్దకు వెళ్లిన విద్యార్థులు గల్లంతైన ఘటన ఏపీలోని కాకినాడ జిల్లాలో బుధవారం జరిగింది. నూతన సంవత్సర వేడుకలను నిర్వహించిన విద్యార్థులు సరదాగా ఎన్టీఆర్ బీచ్ వద్దకు వెళ్లారు. అయితే అలల ఉధృతి అధికం కావడంతో ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోయారు. స్థానికులు వెంటనే వారిని రక్షించేందుకు తీరంలోకి వెళ్లి, ముగ్గురిని కాపాడారు.
కాకినాడలోని ఆదిత్య కాలేజ్ కు చెందిన 13 మంది విద్యార్థులు ఎన్టీఆర్ బీచ్ వద్దకు వెళ్లారు. అయితే న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించిన విద్యార్థులు సరదాగా బీచ్ వద్దకు వెళ్లాలని నిర్ణయించుకొని, కళాశాల యాజమాన్యం అనుమతి తీసుకుని వెళ్లారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. 13 మంది విద్యార్థులు బీచ్ వద్దకు వెళ్లి సరదాగా తమ సమయాన్ని వెచ్చించారు. అంతలోనే అలల ఉధృతి అధికం కాగా, ఐదుగురు విద్యార్థులు తీరం లోపలికి కొట్టుకుపోయారు. మిగిలిన విద్యార్థులు బిగ్గరగా కేకలు వేయడంతో స్థానిక మత్స్యకారులు అక్కడికి చేరుకున్నారు.
హుటాహుటిన తీరం లోపలికి వెళ్ళిన వారు, అతి కష్టం మీద ముగ్గురు విద్యార్థులను రక్షించారు. మిగిలిన ఇద్దరు విద్యార్థులను రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో వారు వెనుతిరిగారు. తీరంలో గల్లంతైన విద్యార్థులు సాయి, శ్రీనివాస్ లుగా పోలీసులు గుర్తించారు. అయితే గల్లంతైన ఇద్దరు విద్యార్థులు తల్లిదండ్రులు ఆదిత్య కళాశాల వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. తమ అనుమతులు లేకుండా ఎలా ఔటింగ్ ఇచ్చారంటూ కళాశాల యాజమాన్యాన్ని నిలదీశారు.
Also Read: CM Chandrababu: సీఎం కాగానే జగన్‌ను జైల్లో పెట్టేవాళ్లం, కానీ.. చంద్రబాబు కామెంట్స్
దీనితో శాంతిభద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా పోలీసులు బందోబస్తు చేపట్టారు. తమ పిల్లలను ఎలాగైనా రక్షించాలని ఆ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అందరినీ కన్నీటి పర్యంతం చేసింది. అయితే పోలీసులు స్థానిక మత్స్యకారుల సహకారంతో గాలింపు చేపట్టారు. కొత్త సంవత్సరం ప్రారంభమైన తొలి రోజే ఆ ఇద్దరి విద్యార్థుల కుటుంబాల విషాదం నెలకొనడం, అందరినీ కలచి వేసింది.