Cyber fraud: సైబర్ మోసాలు రోజురోజుకు కొత్త రకాల పద్ధతులతో విస్తరిస్తున్నాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా మరో సంచలన కేసును బట్టబయలు చేశారు. ఈసారి బలమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొని, కేవలం రెండు నెలల్లోనే రూ.500 కోట్ల నగదు లావాదేవీలు జరిపిన విజయవాడకు చెందిన శ్రవణ్ కుమార్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలు వెలుగులోకి రాగానే సైబర్ నేరాలపై మళ్లీ చర్చ మొదలైంది.
అందిన సమాచారం ప్రకారం, శ్రవణ్ కుమార్ కొద్ది నెలల క్రితం నుంచే తన నెట్‌వర్క్‌ను నిర్మించుకున్నాడు. దేశవ్యాప్తంగా 500కి పైగా మ్యూల్ బ్యాంక్ అకౌంట్లను ఉపయోగిస్తూ, ఒకే సమయంలో అనేక నగరాల్లోకి సైబర్ మోసాల ద్వారా వచ్చిన డబ్బులను తిప్పుతున్నాడు. ఈ అకౌంట్ల ద్వారా రూ.500 కోట్లకు పైగా లావాదేవీలు జరిపినట్లు దర్యాప్తులో తేలింది.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం, శ్రవణ్ కుమార్ వాస్తవానికి ఒక పెద్ద నెట్‌వర్క్‌లో భాగమని తెలుస్తోంది. ఈ నెట్‌వర్క్ దేశంలోని పలు రాష్ట్రాలు మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా విస్తరించి ఉందని పోలీసులు గుర్తించారు. శ్రవణ్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత అతని వద్ద నుండి అనేక డెబిట్ కార్డులు, ల్యాప్‌టాప్‌లు, సిమ్ కార్డులు, మరియు నకిలీ గుర్తింపు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
సైబర్ క్రైమ్ అధికారులు చెబుతున్న ప్రకారం, ఈ నేరాలు పక్కా ప్లాన్ తో జరుగుతున్నాయట. ఫిషింగ్ లింకులు, ఫేక్ వెబ్‌సైట్లు, మోసపూరిత యాప్‌లు ద్వారా సాధారణ ప్రజలను ఉచ్చు వేస్తూ డబ్బు దోచుకుంటున్నారు. మోసపోయిన డబ్బు ఈ మ్యూల్ అకౌంట్ల ద్వారా తక్షణమే వేరే ఖాతాలకు బదిలీ అవుతుండటంతో గుర్తించడం కష్టమవుతోంది. ఈ నెట్‌వర్క్‌లో టెలికాం, ఈ-కామర్స్, ఆన్‌లైన్ లావాదేవీలు, గేమింగ్ యాప్‌లు వంటి రంగాల్లో పనిచేసే అనేక వ్యక్తులు కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
శ్రవణ్ కుమార్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు క్షుణ్ణంగా నిఘా పెట్టారు. రెండు నెలలపాటు జరిగిన గోప్య దర్యాప్తు అనంతరం, చివరికి అతను విజయవాడలో ఉన్న చోట సిబ్బంది దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో, అతను తన మాస్టర్‌మైండ్‌ల నుంచి వచ్చే సూచనల ఆధారంగా డబ్బు లావాదేవీలు నిర్వహించినట్లు ఒప్పుకున్నాడు.
500 బ్యాంక్ అకౌంట్లు ద్వారా డబ్బులు తిప్పడం ఈ కేసులో ప్రధాన అంశంగా మారింది. శ్రవణ్‌తో పాటు ఈ అకౌంట్లను కల్పించిన దళారుల గురించి కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అంతేకాదు, 500కు పైగా సైబర్ లింకుల ద్వారా డబ్బులు మ్యూల్ అకౌంట్లలోకి చేరుతున్నట్లు కూడా దర్యాప్తులో బయటపడింది. ఈ లావాదేవీలలో భాగంగా ఉన్న ప్రతి లింక్, అకౌంట్ వివరాలను ఐటీ నిపుణుల సహాయంతో ట్రాక్ చేస్తున్నారు.
Also Read: Gandhi Hospital: భార్యతో గొడవ… బ్లేడ్లు మింగిన ఆటో డ్రైవర్… చివరికి గాంధీ వైద్యుల అద్భుతం!
సైబర్ నేరాలపై అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ప్రజలు ఈ మోసాలకు బలవుతున్నారని పోలీసులు చెబుతున్నారు. చిన్న చిన్న ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లేదా తెలియని లింక్‌లపై క్లిక్ చేయడం వల్లే ఈ రకమైన పెద్ద నష్టాలు వాటిల్లుతున్నాయని హెచ్చరిస్తున్నారు. ఈ తరహా మోసాల నుంచి దూరంగా ఉండేందుకు ప్రజలు బ్యాంక్ వివరాలను, ఓటీపీ నంబర్లు, పిన్ నంబర్లు ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడదని స్పష్టంగా సూచించారు.
శ్రవణ్ కుమార్ అరెస్ట్ తరువాత, ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవడానికి సైబర్ క్రైమ్ అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రాష్ట్రాల సైబర్ విభాగాలతో కూడా సమన్వయం కొనసాగిస్తున్నారు. ఇందులో ప్రధాన మాస్టర్‌మైండ్‌లను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను నియమించారు.
సైబర్ క్రైమ్ డీసీపీ మాట్లాడుతూ, ఇది అత్యంత పెద్ద సైబర్ నేర నెట్‌వర్క్. కేవలం రెండు నెలల్లోనే రూ.500 కోట్ల లావాదేవీలు జరిపారు. ఇలాంటి నేరాలపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఈ సంఘటనతో మరోసారి సైబర్ సెక్యూరిటీ ప్రాముఖ్యత ఎంతగా పెరిగిందో స్పష్టమైంది. వ్యక్తిగత సమాచారం రక్షణలో నిర్లక్ష్యం చేస్తే ఏ క్షణాన్నైనా సైబర్ మోసగాళ్ల వలలో పడే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.