Rented House Rituals: అద్దె ఇంట్లో పాలు పొంగించవచ్చా..? పొంగిస్తే మంచి జరగుతుందా..? చెడు జరగుతుందా..? అసలు కిరాయి ఇంట్లో పాలు పొంగించే సంప్రదాయం ఉందా..? అలాగే ఒక ఇంట్లోంచి మరో ఇంట్లోకి మారాలనుకుంటే ఏ రోజు మారితే మంచిది. ఇల్లు మారడానికి కూడా ముహూర్తాలు చూసుకోవాలా..? ఇలాంటి ధర్మ సందేహాలు చాలా మంది మెదుళ్లను తొలుస్తుంటాయి. అయితే అలాంటి వారి కోసమే ఈ కథనం.
నూతన గృహ ప్రవేశ సమయంలో ఇంట్లో పాలు పొంగించడం అనేది హిందూ సాంప్రదాయంలో అనాదిగా వస్తుంది. ఇదంతా సొంతిల్లు ఉన్న వారికి వర్తిస్తుంది. మరి సొంతిల్లు లేని వారి పరిస్థితి ఏంటి..? ఇల్లు లేని వారు ఎక్కువగా అద్దె ఇండ్లలో ఉంటారు. అటువంటి వారు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మారినప్పుడు ఆ అద్దె ఇంట్లో పాలు పొంగించవచ్చా అనేది చాలా మందిని వేధిస్తున్న ధర్మసంకటం లాంటిది. అయితే నిజంగా అద్దె ఇంట్లో పాలు పొంగించవచ్చా..? అసలు శాస్త్రం ఏం చెబుతుంది. అలాగే అద్దె ఇంట్లోకి మారడానికి కూడా ముహూర్తాలు చూడటం అవసరమా..? ముహూర్తాలు చూస్తే.. ఎలాంటి సమయం మంచిది అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఏ రోజు మారితే మంచిది:
ఒక ఇంట్లోంచి ఇంకొక ఇంట్లోకి మారాలనుకుంటే మంచి ముహూర్తం చూసుకోవాలంటున్నారు పండితులు. అయితే చాలా మంది అద్దె ఇల్లే కదా దానికి టైం చూసుకోవాలా..? అని ఎద్దేవా చేస్తుంటారు. కానీ అద్దె ఇల్లు అయినా సరే మంచి టైం చూసుకోవాలంటున్నారు. అద్దె ఇల్లు మారాలనుకుంటే ఆషాడ మాసం, శ్రావణ మాసం, భాద్రపద మాసం.. ఈ మూడు నెలల్లో ఇల్లు మారితే అంతా శుభం జరుగుతుందంటున్నారు. అలాగే తిథుల విషయానిక వస్తే.. పాడ్యమి, విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, ద్వాదశి వంటి తిథులు ఉన్న సమయంలో అద్దె ఇంటి ప్రవేశం చేయడం శుభదాయకం అంటున్నారు. ఇక వారాల విషయానికొస్తే.. శుక్రవారం నాడు అద్దె ఇంట్లోకి మారడం కూడా ఎంతో శుభప్రదం అంటున్నారు. అయితే శుక్రవారంతో పాటు పై తిథులు, నెలలు కలిసి వస్తే ఇంకా చాలా మంచి సమయంగా బావించాలట.
అద్దె ఇంట్లో పాలు పొగిస్తే:
అద్దె ఇంట్లో పాలు పొంగించకూడదని శాస్త్రం చెబుతుందట. అలా పొంగిస్తే మీకు ఎప్పటికీ సొంతింటి కల నెరవేరదని హిందూ పురాణాల్లో ఉందట. ఇదే కాకుండా. అద్దె ఇంట్లో పాలు పొంగించడం వల్ల వచ్చిన పుణ్యం కూడా ఇంటి యజమానికే వెళ్తుందట కానీ మీకు రాదట. అందుకే అద్దె ఇంట్లోకి వెళ్లినప్పుడు వారం తిథి చూసుకుని వెళితే సరిపోతుందని పండితులు సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే కానీ బిగ్ టీవీ సొంతంగా క్రియేట్ చేసింది మాత్రం కాదని గమనించగలరు. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు