హిందూ క్యాలెండర్లో అమావాస్యా, పౌర్ణమి ఎంతో ముఖ్యమైనవి. మరి కొన్ని రోజుల్లో అమావాస్య వస్తోంది. దీన్ని సోమావతి అమావాస్య అని అంటారు. డిసెంబర్ 30న ఈ సంవత్సరంలో చివరి అమావాస్య రాబోతోంది. డిసెంబర్ 31 ఉదయం 3:56 గంటల వరకు అమావాస్య ఉంటుంది. కాబట్టి ఉదయం తిథి డిసెంబర్ 30నే వస్తుంది, కాబట్టి సోమావతి అమావాస్యను డిసెంబర్ 30 సోమవారం నాడే నిర్వహించుకోవాలి.
జాతకంలో పితృ దోషం ఉంటే జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి సోమవతి అమావాస్య నాడు కొన్ని పనులు చేయడం ద్వారా మీ పూర్వీకులను సంతోషించేలా చేసి పితృ దోష పరిహారణ చేసుకోవచ్చు.
పూర్వీకుల ఆశీర్వాదం పొందడానికి, పితృ దోషాన్ని నివారించడానికి అమావాస్యను ఉత్తమంగా భావిస్తారు. ఎందుకంటే అమావాస్యను పూర్వీకులకు అంకితం చేస్తారు. ఆరోజున పూర్వీకుల ఆత్మకు శాంతి కలిగించడానికి వారిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని పనులను ప్రత్యేకంగా చేయాల్సి ఉంటుంది. పూర్వీకులు సంతృప్తి చెందితే మీకు ఆశీర్వాదాలను ఇస్తారు. మీ జీవితం అద్భుతంగా ఉంటుంది.
సోమావతి అమావాస్యనాడు ఉదయాన్నే లేచి ముందుగా కాలకృత్యాలను తీర్చుకొని స్నానం చేయాలి. తర్వాత పూర్వీకులను స్మరించుకొని పూజ చేయాలి. నల్ల నువ్వులు, తెల్లటి నువ్వులు కలిపి దర్భలు చేత్తో పట్టుకొని తర్పణం సమర్పించాలి. ఇలా తర్పణం సమర్పిస్తే పితృ దోషం నుండి ఉపశమనం పొందుతారని అంటారు.
సోమావతి అమావాస్యనాడు తలస్నానం చేసిన తర్వాత రావి చెట్టుకు నీళ్లు పోయాలి. ఇలా చేసినా కూడా పితృ దోషం తొలగిపోతుంది. రావి చెట్టుకు పూజ చేసి ఏడుసార్లు దాని చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఆవాల నూనెలో నల్ల నువ్వులు వేసి దీపం పెట్టాలి. రావి చెట్టులో పూర్వీకులు నివసిస్తారని నమ్ముతారు. అందుకే దానికి నీళ్లు పోయడం, దీపం పెట్టడం అన్నీ వంటివన్నీ మీ పూర్వీకులను సంతోషించేలా చేయవచ్చు.
పూర్వీకులు కొంతమంది కోపంతో ఉంటారు. అలాంటివారిని శాంతింప చేయడానికి సోమావతి అమావాస్య రోజు పితృ చాలీసాను పారాయణం చేయాలి. పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది. బ్రాహ్మణులకు ఆహారం దానం చేయండి. నల్ల నువ్వులు, పెరుగు, పాలు, బట్టలు, పండ్లు, ఆహారం వంటివి పేదలకు దానం చేయండి. ఇవన్నీ చేస్తే మీ జీవితం ఎంతో ఆనందంగా సాగుతుంది. మీ పితృదేవతలు మిమ్మల్ని ఆశీర్వదించి ప్రశాంతంగా తమలోకంలో ఉంటారు.