ప్రతిరోజు ఉదయం హిందువులు సూర్య భగవానుడికి అర్ఘ్యం అర్పిస్తారు. గంగాజలం లేదా సాదా నీటితో సూర్యభగవానుడిని మొక్కుకొని మంచి ఆరోగ్యం, అదృష్టం, శ్రేయస్సు కావాలని అడుగుతూ ఆ నీటిని అతనికే సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల సూర్యుడి కరుణా తమపై ఉందని చెప్పుకుంటారు. ఇక సూర్యుడు ఏడు గుర్రాల పేర్ల విషయానికి వస్తే గాయత్రి, బృహతి, ఉష్ణీ, జగతి, త్రిష్టుభం, అనుష్టుబం, పంక్తి. ఏడు గుర్రాలను అనేక అర్థాలతో పోలుస్తారు. శరీర చక్రాలు, ఇంద్ర ధనస్సులోని రంగులు కూడా ఏడే.
సూర్యుడి గుర్రాల పేర్లు
సనాతన సంప్రదాయంలో సూర్యదేవుడి ఏడు గుర్రాలు… వేద శ్లోకాలలో ఉపయోగించే ఏడు కవితా చందస్షులకు చిహ్నంగా భావిస్తారు. గాయత్రిలో 24 అక్షరాలు ఉంటాయి. ఇది జ్ఞానం, ఆధ్యాత్మిక మేలుకొల్పులతో ముడిపడి ఉంటుంది. అలాగే బృహతి 36 అక్షరాలతో, ఉష్ణీ 28 అక్షరాలతో, జగతి 48 అక్షరాలతో, దృష్టిబం 44 అక్షరాలతో, అనుష్టభం 32 అక్షరాలతో, పంక్తి 40 అక్షరాలతో ఉంటుంది.
ఏడు గుర్రాల గురించి మరొక వివరణ కూడా ఉంది. ఇంద్ర ధనస్సులోని ఏడు రంగులు… ఈ ఏడు గుర్రాలను సూచిస్తాయని అంటారు. సూర్యుడు కాంతి, వెచ్చదనం, ప్రకాశం వంటి లక్షణాలను అందిస్తాడు. అలాగే ఈ ఏడు గుర్రాలు కూడా నీలం, ఆకుపచ్చ, పసుపు, నారింజ, ఎరుపు, ఇండిగో, ఊదా రంగులను సూచిస్తాయని చెబుతారు.
మానవ శరీరంలోని చక్రాలు
మానవ శరీరంలోని పవిత్ర చక్రాలు లేదా శక్తి మార్గాలు ఉంటాయి. వీటిని మూల చక్రం, కిరీట చక్రం ఇలా పిలుస్తూ ఉంటారు. ఇలా ఏడు చక్రాలను సూచించేవే ఈ ఏడు గుర్రాలు అని కూడా చెప్పుకుంటారు. సూర్య భగవానుడి రథం ముందుకు సాగడానికి ఏడు గుర్రాలు ఎలా సహాయపడతాయో మన శరీరంలోని ఏడు చక్రాలు కూడా మన జీవితానికి అలాగే సహాయపడతాయని చెప్పుకుంటారు.
వాస్తు శాస్త్రం ప్రకారం కూడా ఏడు గుర్రాలు ఉన్న పెయింటింగ్ ను అదృష్టంగా భావిస్తారు. ఏడు గుర్రాల పెయింటింగ్ ఇంట్లో లేదా కార్యాలయంలో పెట్టుకుంటే విజయం, అదృష్టం, సానుకూలత వంటివి కలుగుతాయని నమ్ముతారు. ఆ గుర్రాలకు రథం లేకపోయినా కాళ్ళ కదలికలు అవి కలిసి పరుగెడుతున్నట్టు చూపిస్తాయి. ఈ గుర్రాలు బలం, శక్తి, వేగం, స్థిరత్వం, సంకల్పం వంటి వాటిని సూచిస్తాయి అని అంటారు.