Ugadi festival: ఉగాది పండుగ దక్షిణ భారతదేశంలోనే ( ప్రత్యేకంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక) ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ. ఇది తెలుగు ప్రజల కొత్త సంవత్సరం కూడా. ఈ పండుగ సాదారణంగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అయితే మార్చి–ఏప్రిల్ నెలల్లో వస్తుంది. తెలుగు నెలల ప్రకారం అయితే చైత్ర మాసం శుద్ధ పాడ్యమి రోజున వస్తుంది. ఈ పండుగకు ఉన్న మరిన్ని ప్రత్యేకలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉగాది అనే పదానికి అర్థం: ఉగాది అంటే యుగ + ఆది అంటే యుగానికి మొదటిది అని అర్థం. యుగాది కాలక్రమేణా ఉగాది మారిపోయింది. ఉగాది అంటే కొత్త యుగానికి నాంది.. లేదా ప్రారంభం అని అర్థం. ఈ రోజున నుంచే తెలుగు సంవత్సరానికి కొత్త పేరు మొదలవుతుంది. బ్రహ్మ దేవుడు యుగాన్ని ప్రారంభించిన రోజు అని కూడా చెప్తుంటారు.
ఉగాది పండుగ ప్రత్యేకత: ఉగాది రోజే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది రోజునే కొత్త సంవత్సరానికి పేరు పెట్టబడుతుంది. తెలుగులో ఉన్న 60 సంవత్సరాలలో ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేక పేరు ఉంటుంది. పండితులు ఉగాది రోజునే పంచాంగ శ్రవణం చేసి ఆ సంవత్సర ఫలితాలు చెబుతారు.
పంచాంగ శ్రవణం: ఉగాది రోజున పండితులు కొత్త సంవత్సరానికి సంబంధించిన విషయాలు చెబుతారు. ఉదాహారణకు ఆ సంవత్సరం వర్షాలు ఎలా ఉంటాయి..? వ్యవసాయం పరిస్థితులు ఎలా ఉంటాయి..? దేశ, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి..? అలాగే వ్యక్తిగత రాశి ఫలితాలు చెప్తుంటారు. దీన్నే పంచాంగ శ్రవణం అంటారు.
ఉగాది పచ్చడి ప్రత్యేకత: ఉగాది పండుగ రోజున ప్రత్యేకంగా ఉగాది పచ్చడి (Ugadi Pachadi) తయారు చేస్తారు. ఈ పచ్చడిలో 6 రుచులు ఉంటాయి.. ఒక్కో రుచికి ఒక్కో అర్థం ఉంటుంది. ఆ అర్థాలు కూడా జీవితానికి అన్వయించుకుని ఉంటాయి. ఆరు రుచులు..
వేపపువ్వుచేదు – జీవితంలో కష్టాలు
బెల్లం తీపి – జీవితంలో ఆనందం
చింతపండు పులుపు – జీవితంలో ఆశ్చర్యం
మామిడి వగరు – జీవితంలో ఉత్సాహం
ఉప్పు – జీవితంలో అవసరాలు
మిరపకారం – జీవితంలో కోపం
ఈ ఆరు రుచులు ఆరు జీవిత విశేషాలను ఎలా నియంత్రించుకోవాలో సూచిస్తాయట.
ఇళ్ల అలంకరణ: ఉగాది రోజున ఇళ్ల ముందు రంగు రంగుల ముగ్గులు వేసి అందంగా అలంకరించాలి. అలాగే గుమ్మాలకు మామిడి ఆకుల తోరణాలు కట్టాలి. ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయట.
ఆలయ దర్శనం చేసుకోవాలి: ఉగాది రోజు తప్పకుండా ఆలయ దర్శనం చేసుకోవాలని సూచిస్తున్నారు.
పూజలు మరియు దానాలు: ఉగాది పండుగ రోజు దేవుడికి ప్రత్యేక పూజలు చేయడమే కాకుండా బీదలకు పేదలకు అన్నదానాలు చేయాలట.
ఉగాది పండుగ ప్రాముఖ్యత: ఉగాది పండుగ మనుషుల జీవితాలను చాలా నేర్పిస్తుంది. జీవితంలో కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని నూతన పనులు ప్రారంభించాలని సూచిస్తుంది. అలాగే సంవత్సరం మొత్తం పాజిటివ్ దృక్పథంలో వ్యవహరించాలని సూచిస్తుంది.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.