BigTV English

Maha KumbhMela 2025: మహా కుంభమేళా ప్రారంభం.. మొదటిరోజు 61 లక్షల మంది త్రివేణిలో పుణ్యస్నానాలు

Maha KumbhMela 2025: మహా కుంభమేళా ప్రారంభం.. మొదటిరోజు 61 లక్షల మంది త్రివేణిలో పుణ్యస్నానాలు

Maha KumbhMela 2025| ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభమేళా (Kumbh Mela) ఘనంగా ఆరంభమైంది. ఈ అత్యంత ప్రముఖమైన వేడుక గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమ ప్రదేశం అయిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj) లో జరుగుతోంది. ఈ సందర్భంగా, పుష్య పౌర్ణమి రోజున సోమవారం తెల్లవారుజామునుంచే లక్షలాదిమంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమానికి చేరుకొని పవిత్ర స్నానాలు చేసేందుకు వస్తున్నారు. భక్తుల పూజలతో ఈ ప్రాంతం దేదీప్యమానంగా వెలుగుతోంది. స్థానిక అధికారుల ప్రకారం.. ఉదయం 7.30 గంటల ఇప్పటి వరకు దాదాపు 35 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. మొదటిరోజే 61 లక్షల మంది ఈ ప్రాంతానికి పుణ్యస్నానాలకు రానున్నారని సమాచారం.


భూ గ్రహంపైనే అత్యంత భారీ జన సమూహంతో హజరయ్యే ఈ కార్యక్రమం 45 రోజులపాటు కొనసాగనుంది. దీని కోసం దేశ-విదేశాల నుంచి కోట్లాదిమంది భక్తులు, పర్యటకులు వచ్చి పాల్గొననున్నారు. ఈ వేడుక కోసం మొత్తం 35 కోట్ల మంది వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని, భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడం, అలాగే భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా, నదిలో నిరంతరం పహారా కాసేందుకు ప్రత్యేకంగా తేలియాడే పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేశారు. అటు, చిన్న చిన్న పడవలపై భద్రతా సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) కుంభమేళా ప్రారంభంపై స్పందించారు. ‘‘భారతీయ విలువలు, సంస్కృతిని గౌరవించే కోట్లాది మందికి ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభమైంది. ఈ వేడుక విశ్వాసం, భక్తి, సంప్రదాయాల సంగమంతో ఎంతోమందిని ఒకచోట చేర్చింది. మన దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఈ వేడుక ప్రతిబింబిస్తుంది. పవిత్ర స్నానాలు ఆచరించి, భగవంతుడి ఆశీస్సులు తీసుకునేందుకు లెక్కలేనంతమంది రావడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని ప్రధాని మోదీ ఎక్స్ వేదికపై రాసుకొచ్చారు.


Also Read: మహాకుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్ చుట్టూ అడవి సృష్టి.. మియావాకీ టెక్నిక్‌తో 10 రెట్లు వేగంగా పెరిగే చెట్లు

ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు ఏర్పాట్లు కోసం 10,000 ఎకరాల్లో విస్తరించిన ప్రాంతాన్ని సిద్ధం చేశారు. ఎటువంటి పరిస్థితులలోనైనా 50 లక్షల నుంచి 1 కోట్ల మంది భక్తులు సౌకర్యంగా ఉండేలా అన్ని ఏర్పాట్లను కల్పించారు. భద్రత కోసం 55 పోలీసు స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసి, 45,000 మంది పోలీసులను విధుల్లో పెట్టింది. కుంభమేళాలో 13 అఖాడాలు భాగం అవుతాయని, వీటి ద్వారా అనేక సాధువులు, భక్తులు ఈ వేడుకలో పాల్గొంటారని సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.

జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సంరంభం అయిన మహా కుంభమేళా వేడుక కొనసాగనుంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు ప్రయాగ్‌రాజ్ (Prayagraj)కు కోట్లాది భక్తులు చేరుకోవాలని అంచనా వేయబడింది. భక్తులకు అన్ని సౌకర్యాలు అందించేందుకు యూపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాయి. హిందూ సమాజంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ మహాకుంభమేళాకు ఈసారి 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేయబడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడంపై  ప్రత్యేక దృష్టి పెట్టాయి.

రవాణా సౌకర్యాలు
ప్రయాగ్‌రాజ్‌కు భక్తులను రవాణా చేసేందుకు అన్ని రకాల సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయి. యూపీ ఆర్టీసీ (Uttar Pradesh RTC)తో పాటు భారతీయ రైల్వే, వివిధ ఎయిర్‌లైన్స్ సంస్థలు భక్తులకు సేవలు అందించడానికి రెడీ అయ్యాయి.

యూపీ ఆర్టీసీ రవాణా ఏర్పాట్లు: యూపీ ఆర్టీసీ ఈ కుంభమేళాకు 7,550 బస్సులను నడపనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ప్రయాగ్‌రాజ్‌కి బస్సుల సేవలు అందుబాటులో ఉంటాయి. మేళా వేదిక వద్దకు భక్తులను తరలించేందుకు 550 కొత్త షటిల్ బస్సులను కూడా ఏర్పాటు చేశారు. పొరుగున ఉన్న ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 3 కోట్ల మంది భక్తులు ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాగ్‌రాజ్‌కు రాగలరని అంచనా వేయబడింది. రోజుకు సుమారు 8 లక్షల మంది బస్సుల ద్వారా ప్రయాగ్‌రాజ్ చేరుకోనున్నారు.

రైల్వే రవాణా ఏర్పాట్లు: రైల్వే కూడా మహా కుంభమేళా కోసం భారీ ఏర్పాట్లు చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 13,000 ప్రత్యేక రైలు సర్వీసులను సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రధాన నగరాల నుండి ప్రయాగ్‌రాజ్‌కి రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అదనంగా 50 నగరాల నుంచి కూడా ప్రత్యేక రైలు సర్వీసులను ఏర్పాటు చేశారు.

ఎయిర్‌లైన్స్ సర్వీసులు: ఎయిర్‌లైన్స్ సంస్థలు కూడా ప్రయాగ్‌రాజ్‌కు భక్తులను చేరవేయడానికి సిద్ధమయ్యాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, బిలాస్‌పూర్, హైదరాబాద్, రాయ్‌పూర్, లక్నో, భుబనేశ్వర్, కోల్‌కతా, డెహ్రాడూన్, చండీఘడ్ వంటి నగరాల నుండి నేరుగా ప్రయాగ్‌రాజ్‌కి విమానాలు అందుబాటులో ఉంటాయి. అదనంగా, జమ్మూ, చెన్నై, పట్నా, నాగ్‌పూర్, అయోధ్య, పూణె, భోపాల్ వంటి నగరాల నుండి కూడా విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. సంగమ్ ప్రాంతానికి 19 కిలోమీటర్ల దూరంలో ప్రయాగ్‌రాజ్ ఎయిర్‌పోర్టు ఉంది. అక్కడి నుండి ఎలక్ట్రిక్ బస్సులు ఈ ప్రాంతానికి సులభంగా తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేయబడ్డాయి. ఈ బస్సుల టికెట్ ధర కేవలం రూ.35. ట్యాక్సీలు, క్యాబులు కూడా రూ.1,000 లోపే అందుబాటులో ఉంటాయి.

ఈసారి కుంభమేళా వేడుకలు ఎప్పటికి గుర్తుండిపోయేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాయి. భక్తుల సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని అధికారులు జాతీయ మీడియాకు తెలిపారు.

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×