Maha Kumbh 2025 Miyawaki Forest| మహాకుంభమేళా కోసం ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ లో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోట్ల మంది భక్తులు, సాధువులు, అఘోరీలు ఈ ఆధ్యాత్మిక సంగమంలో తమ పాపాలు కడిగేసుకునేందుకు వేంచేస్తారు. అందుకోసం ఇంత భారీ సంఖ్యలో జనం కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. అంతమంది అక్కడికి ఒక్కసారిగా రావడంతో వారికి స్వచ్ఛమైన గాలి, వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల ముందే కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ప్రజలకు ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు కలుగకూడదని పార్కింగ్ నుంచి స్టే వరకు అన్ని వసతులకు ఏర్పాట్లు చేశారు. అయితే అన్నింటికంటే ముఖ్యమైనది అక్కడి వాతావరణం. కోట్ల మంది ఒకేసారి రావడంతో అందరికీ తగిన స్థాయిలో ఆక్సిజన్ ఉండడం చాలా అవసరమని నిపుణులు ముందుగానే హెచ్చరించారు. అందుకోసం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగ్ రాజ్ చుట్టూ ఉన్న ప్రాంతాలలో ఏకంగా ఒక అడవినే సృష్టించింది.
ప్రయాగ్‌రాజ్ మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కుంభమేళా ఆక్సిజన్ అవసరాల కోసం గత రెండు సంవత్సరాలుగా ప్రయాగ్ రాజ్ చుట్టూ లక్షకు పైగా చెట్లు పెంచారు. ప్రయాగ్ రాజ్ చుట్టూ ఉన్న 55,800 స్క్వేర్ మీటర్లలో పది లొకేషన్లలో దట్టమైన అడవినే సృష్టించారు. ప్రయాగ్ రాజ్ సమీపంలో నైనీ ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతంలోనే 63 జాతులకు చెందిన 1.2 లక్షల చెట్లు నాటారు. అలాగే బస్వర్ ప్రాంతంలో చెత్త యార్డు ఉంది. దాన్ని తొలగించి ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేసి 27 జాతులకు చెందిన 27,000 చెట్లు నాటారు. ఈ చెట్లు నాటే ప్రాజెక్టులతో ప్రయాగ్ రాజ్ నగరం ఇండస్ట్రియల్ వేస్ట్, దుమ్ము, దుర్వాసన, వంటివి తగ్గిపోయి.. నగరం చుట్టూ పచ్చదనం బాగా పెరిగింది.
Also Read: 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళా.. ఈ ఆధ్యాత్మిక సంగమం విశిష్టత తెలుసా?..
ఈ అడవుల కారణంగా చాలా పర్యావరణ లాభాలు కూడా ఉన్నాయి. భూమి సారవంతం పెరిగింది, నీటి కాలుష్యం, గాలి కాలుష్యం తగ్గింది. జంతువులు, పక్షులకు నివాసం దొరకడంతో వాటి సంఖ్య కూడా పెరుగుతోంది. వాతావరణ నిపుణుల ప్రకారం.. ఈ అడవుల కారణంగా వేసవి కాలంలో 4 నుంచి 7 డిగ్రీల టెంపరేచర్ తగ్గుతుంది. దీన్ని వల్ల్ ఇక్కడ నివసించే ప్రజలకు వేసవి కాలంలో ఎండల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంతేకాదు.. ఈ ప్రాంతంలో మామిడి, చింత, టేకు, వేప, రావి లాంటి సంప్రదాయ చెట్లతోపాటు.. తులసి, ఆమ్లా, మున్నకాడ లాంటి ఔషధ చెట్లు కూడా నాటారు.
అయితే కేవలం రెండేళ్లలో ఈ చెట్లు బాగా ఎత్తు ఏపుగా పెరిగిపోయాయి. ఇదెలా సాధ్యమైందో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దీని వెనుక ఉన్న టెక్నిక్ పేరు మియావాకీ టెక్నిక్. జపాన్ దేశానికి చెందిన అకీరా మియావాకీ అనే బోటానిస్ట 1970వ దశకంలో ఈ టెక్నిక్ ని కనుగొన్నారు. మియావాకీ టెక్నిక్ తో చెట్లు 10 రెట్లు వేగంగా పెరుగుతాయి. చెట్లను ఒకదానికి ఒకటి సమీపంగా అంటే పక్క పక్కనే పెంచడమే ఈ మియావాకీ టెక్నిక్. అయితే వివిధ జాతుల మొక్కలను కలిపి నాటాలి. ఇదే ఈ టెక్నిక్ లో కీలకం. దీన్ని పాట్ ప్లాంటేషన్ (కుండ నాటు) అని కూడా పిలుస్తారు. ఈ చెట్లు త్వరగా పెరగడంతో పాటు సమీపంగా ఉండడంతో దట్టమైన అడవుల రూపంలో కనిపిస్తాయి. దీంతో ఆ ప్రాంతాలలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ ని పీల్చుకుంటాయి. దీంతో పర్యావరణంలోని గాలి కాలుష్యం విపరీతంగా తగిపోయి స్వచ్ఛమైన గాలి అందుబాటులో ఉంటుంది.