Maha Kumbhmela Rituals At Home| హిందూ ధర్మంలోని అతిపవిత్రమైన పండుగల్లో మహాకుంభమేళా ఒకటి. ఈ సమయంలో త్రివేణీ సంగమంలో స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. కానీ ఈ మహాకుంభమేళాకు వెళ్లలేని వారి పరిస్థితి ఏంటి?
మహాకుంభమేళాకు సమయం వచ్చేసింది. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఈ సమయంలో గంగా స్నానం చెయ్యడానికి తరలివస్తున్నారు. తాజాగా యాపిల్ కంపెనీ కోఫౌండర్, దివంగత స్టీవ్ జాబ్స్ భార్య లారీన్ కూడా ప్రయాగ్‌రాజ్ వచ్చి, త్రివేణీ సంగమంలో స్నానం చేశారు. ఈ సమయంలో త్రివేణీ సంగమంలో స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు. నదీ స్నానం చేసి వచ్చిన తర్వాత ఏదైనా పుణ్యకార్యం చేస్తే చాలా పుణ్యం వస్తుందని, ఆ సమయంలో దేవతలు మనకు అందించే ఆశీర్వాదాలు కూడా జన్మజన్మలకూ కొనసాగుతాయని నమ్ముతారు.
అయితే ఇంత పుణ్యకాలంలో కూడా కొందరు అనివార్య కారణాల వల్ల కుంభమేళాకు వెళ్లలేకపోవచ్చు. అనారోగ్యం వల్లనో, శరీరం సహకరించకపోవడం వల్లనో కావచ్చు. లేదా ఆర్థిక ఇబ్బందుల వల్లనో.. కారణం ఏదైనా కొందరు కుంభమేళాకు వెళ్లలేకపోవచ్చు. అయితే అక్కడకు వెళ్లలేకపోయిన వాళ్లు కూడా కుంభమేళాలో నదీస్నానం చేసిన పుణ్యం పొందే అవకాశం ఉంది. అలా జరగాలంటే ఏం చెయ్యాలో శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద మార్గాలు చెప్పారు.
ఏదైనా కారణం వల్ల మనం మహాకుంభ మేళాకు వెళ్లలేకపోతే.. మనకు తెలిసిన వాళ్లు ఎవరైనా వెళ్తున్నారేమో కనుక్కోండి. వాళ్లను త్రివేణీ సంగమం నుంచి కొన్ని నీళ్లు తీసుకురమ్మని చెప్పి, తెప్పించుకోండి. ఆ నీటిని ఇంటిలో ఉన్న నీటిలో కలుపుకొని, ఏదో ఒక మంచిరోజున స్నానం చేసినా.. త్రివేణీ సంగమంలో స్నానం చేసినంత పుణ్యం వస్తుందని శంకరాచార్య చెప్పారు.
మహాకుంభమేళా నుంచి నీరు తెచ్చుకోవడం ఎలా?
మనకు తెలిసిన వాళ్లు ఎవరైనా మహాకుంభ్‌కు వెళ్తుంటే వారితో నీళ్లు తెప్పించుకోవచ్చు. లేదంటే చాలా ఎన్జీవోలు కూడా మహాకుంభమేళా నుంచి నీరు, ప్రసాదాలు సరఫరా చేస్తున్నాయి. మన అడ్రస్‌కే త్రివేణీ సంగమం నుంచి నీరు, మహాకుంభమేళా నుంచి ప్రసాదాన్ని కొన్ని ఎన్జీవోలు ఉచితంగా డెలివరీ చేస్తున్నాయి. ఈ ఎన్జీవోల దగ్గర దరఖాస్తు చేసుకొని కూడా మహాకుంభమేళా నుంచి నీరు తెప్పించుకోవచ్చు. లేదంటే ‘త్రివేణీ సంగం వాటర్ డెలివరీ సర్వీస్’ నుంచి కూడా త్రివేణీ సంగం నీరు ఆర్డర్ ఇవ్వొచ్చు.
గంగా స్నానం కూడా మంచిదే..
ఒకవేళ మహాకుంభమేళా నుంచి నీరు తెప్పించుకోవడం కుదరకపోతే.. ఎక్కడి నుంచైనా గంగాజలం అయినా తెప్పించుకోవచ్చు. అమృత స్నానం రోజుల్లో ఏదో ఒక రోజున గంగాజలం కలిపిన నీటితో స్నానం చేసినా మహాకుంభమేళాలో నదీస్నానం చేసిన పుణ్యం వస్తుందట. మహాకుంభమేళాకు వెళ్లకపోయినా ఆ పుణ్యం సంపాదించే మార్గాలు ఇన్ని ఉంటే.. ఇక ఆలస్యం ఎందుకు? ఏదో ఒక మార్గంలో ఆ పుణ్యం పొందడానికి ప్రయత్నించండి.