Sankashtahara Chaturthi vratham: మీ జీవితంలో కష్టాల కడలి ఎప్పుడూ పలకరిస్తుందా.. ప్రతి పనిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయా.. ఏ పని కూడా సకాలంలో పూర్తి కావట్లేదా.. అయితే ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలు.. సకల ఇబ్బందులు తొలగి, దేవుని ఆశీస్సులు మీపై నిండుగా ఉంటాయని వేదాలు చెబుతున్నాయి. ఆ వ్రతాన్ని ఆచరించే రోజులు కూడా రానే వచ్చాయి. తప్పక వ్రతం ఆచరించండి.. ఊహించని ఫలితాలు అందుకోండి. ఇక ఆ వ్రతం ఏమిటి? ఎలా ఆచరించాలో తెలుసుకుందాం.
సంకష్టహర చవితి వ్రతం
మనకు జీవితంలో ఎదురయ్యే ప్రతి సంకటం తొలగిపోయి ఆపదలు దూరమై, అనుకున్న పనులు సకాలంలో జరగాలంటే సంకష్టహర చవితి వ్రతాన్ని ఆచరించాలని వేదపండితుల మాట. ప్రతి మాసంలో పూర్ణిమ తర్వాత వచ్చే చవితి తిధి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. పూర్వం దేవతలు ఋషులు, మునులు రాజులు సామాన్య భక్తుల నుంచి సామంతుల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వారి అభిష్టాలు సిద్ధింప చేసుకున్నారు.
ఈ వ్రతాన్ని దిలీప మహారాజు సూర్యవంశపు రాజులు అలాగే కార్తవీర్యార్జునుడు, పరశురాముడు, అరుంధతి నలదమయంతులు, హనుమంతుడు ఇలా ఎంతోమంది భక్తాగ్రగన్యులకు కూడా సంకష్టహర చవితి వ్రతాన్ని ఆచరించి వారు వారి కోరికలను తీర్చుకున్నారని చరిత్ర.
వ్రత విధానం ఇదే..
సంకష్టహర చవితి రోజున ప్రాతః కాలమే అంటే సూర్యోదయానికి మునుపే లేచి స్నానాధికాలు చేసి సంకల్పం చెప్పుకోవాలి. ముందుగా గణపతికి ప్రార్థన చేసి ఏ ఆటంకాలు లేకుండా ఈ వ్రతం పూర్తి చేసుకోవాలని సంకల్పించాలి. స్నానం చేసిన తర్వాత గణపతికి ప్రార్థన చేసి గణపతికి సంబంధించిన శ్లోకాలు మంత్రాలను పఠించాలి.
గణపతి మంత్రాన్ని ఓం గం గణపతయే నమః అంటూ 108 సార్లు పఠించాలి. పగలంతా ఉపవాసం ఉండాలి. సాయం సంధ్యా సమయాన గణపతిని పూజించి గణపతికి ధూప దీప నైవేద్యాలతో ఉపచారాలు చేసి పూజించి బెల్లం ముక్క నివేదన పెట్టి 21 గరికపోచలు సమర్పించి మోదకాలు సమర్పించి గుంజీలు తీయాలి.
ఇలా గణపతి ప్రీతికరంగా ఎవరైతే ఈ ఉపచారాలు చేస్తారో వారికి వారు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. దానికి ఎంతోమంది ప్రత్యక్ష నిదర్శనలు కూడా ఉన్నారు. అలాగే ఎన్నో ప్రత్యక్షమైన నిదర్శనలు ఉన్నాయి. అయితే ఈ వ్రతాన్ని మంగళవారం చవితి ఎప్పుడు వస్తుందో అప్పుడు మొట్టమొదటిసారిగా ఆచరించడానికి ఉత్వమైన రోజు. తర్వాత వ్రతాన్ని కొనసాగించాలి.
ఈసారి ఈ నెలలో బుధవారం వచ్చింది. బుధవారం గణపతికి చాలా ప్రీతికరం కాబట్టి గణపతి అనుగ్రహం కోసం వ్రతాన్ని ఆచరించడం మంచిది. మనం తలపెట్టిన ప్రతి కార్యంలో కూడా విఘ్నాలు లేకుండా సర్వ కార్యసిద్ధి కొరకు, గణపతి అనుగ్రహం పరిపూర్ణంగా లభించటానికి సంకష్టహర చవితి వ్రతం ఆచరించాలని వేదాల మాట. చివరగా అందరికీ.. నిర్విఘ్నమస్తు అవిఘ్నమస్తు! – డాక్టర్ శృతి