Huge Betting on AP Election 2024 Results: ఈ సారి ఎలక్షన్స్‌లో ప్రశాంత్ కిషోర్ ఏ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించలేదు. పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా గత పదేళ్లలో పీకే తనదైన బ్రాండ్ చూపించుకున్నారు. మోడీ మొదటి సారి ప్రధానిగా గెలిచినప్పుడు బీజేపీకి పనిచేసిన ఆయన తర్వాత ఏపీలో జగన్, బెంగాల్‌లో మమతాబెనర్జీ పవర్‌లోకి రావడంలో తనదైన పాత్ర పోషించారు. అప్పుడు బీజేపీ, తర్వాత వైసీపీకి రూట్ మ్యాప్ చూపించిన ఆ కాస్ట్లీ స్ట్రాటజిస్ట్.. ఇప్పుడా రెండు పార్టీలపై జోస్యాలు చెప్తున్నారు. ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఆయన చేస్తున్న విశ్లేషణలు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. మరోవైపు పందెంరాయుళ్లకు ఊతమిచ్చేలా ఉండటం విమర్శల పాలవుతుంది.
ఏపీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో కాని .. వాటిపై బెట్టింగులు మాత్రం జోరుగా సాగుతున్నాయి. పెరిగిన పోలింగ్ శాతం ప్రభావంతో రాష్ట్రంలో ఈసారి ఎన్డీఏ కూటమిదే విజయం అన్న ధీమాతో పందేలు సాగుతున్నాయి. భీమవరం, కడప, నెల్లూరులాంటి ప్రాంతాల్లో కూటమి విజయంపై, ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంశంలపైనే బెట్టింగ్ రాయుళ్లు ఎగబడి పందాలు కాస్తున్నారు. ఒకవేళ కూటమి ఓడిపోతుందని ఎవరైనా పందానికి సిద్దమైతే .. ఒకటికి నాలుగు రెట్లు ఎక్కువ ఇస్తామంటున్నారు.
గత ఎన్నికల్లో కంటే ఈసారి ఎక్కువ సీట్లు గెలవబోతున్నాం. చరిత్ర సృష్టించబోతున్నామని సీఎం, జగన్ ఇటీవల స్వయంగా ప్రకటించారు. విజయవాడలో ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లిన వైసీపీ అధ్యక్షుడు తమ విజయంపై విపరీతమైన ధీమా వ్యక్తం చేశారు. తర్వాత ఆ పార్టీ నేతలు రెండు అడుగులు ముందుకేసి జూన్ 9న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ప్రకటనలు గుప్పించారు. ఈ మాటలేవీ పందేలపై ప్రభావం చూపించడం లేదంటున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ సారి ఆ పార్టీపై నెగిటివ్ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. వైసీపీ పరాజయం ఖాయమని ఆయన నెలల ముందే చెప్పేశారు.
Also Read: బెంగుళూరు రేవ్ పార్టీ, తెలుగు వారే ఎక్కువ మంది
ప్రశాంత్ కిషోర్ ఆ జోస్యం చెప్పిన నాటి నుంచే ఏపీలో బెట్టింగ్‌ల హడావుడి మొదలైంది. కూటమి గెలుపుపై బెట్టింగ్ బాబులు కాయ్ రాజా కాయ్ అంటున్నారు. కౌంటింగ్‌కి గడువు ఎక్కువగా ఉండటంతో బెట్టింగులకు అంతే లేకుండా పోతుంది. వందల కోట్ల పందాలు జరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు వారిని మరింత రెచ్చగొట్టడానికి అన్నట్లు ప్రశాంత్ కిషోర్ మళ్లీ పాత జోస్యాన్నే రిపీట్ చేయడం కలకలం రేపుతోంది.
వైసీపీకి ఘోర పరాజయం ఎదురు కాబోతోందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి స్పష్టం చేశారు. పదేళ్లుగా ఎన్నికల క్షేత్రంలో పనిచేస్తున్న తనకు ఫలితాలకు ముందే ఓటమిని అంగీకరించినవారు ఎవరూ కనిపించలేదని సెటైర్ విసిరారు. జగన్ గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుస్తామని చెప్పడమే అందుకు నిదర్శనమంటున్నారు. మరోవైపు దేశంలో బీజేపీ, మోడీలపై అసంతృప్తి ఉంది తప్పితే.. ఆగ్రహం లేదని వెల్లడించారు. అందువల్ల ఈసారి కమలానికి గతంలో ఉన్న సీట్లకు సమానంగా కానీ, లేదంటే అంతకంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఆయన సరికొత్త అంచనాలు వెల్లడించారు.
Also Read: TDP says CM Jagan chapter closed: జగన్ చాప్టర్ క్లోజ్, వాళ్లది మైండ్ గేమ్ అంటూ..
తాము ఎన్నికల్లో గెలవబోతున్నామని జగన్‌మోహన్‌రెడ్డి చెబుతున్నట్లుగానే రాహుల్‌గాంధీ, అమిత్ షా కూడా చెబుతున్నారని ఓట్ల లెక్కింపు రోజు నాలుగు రౌండ్లు పూర్తయిన తర్వాత కూడా వారు అదే ధీమా వ్యక్తం చేస్తారని యద్దేవా చేశారు. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోతున్నాడని తాను గతంలో చెప్పానని కానీ జగన్ మాత్రం గతం కంటే ఎక్కువగా సాధించబోతున్నామని చెప్పుకోవడంపై పీకే స్పందించారు. జగన్ అలా చెప్పుకోవడంలో తప్పేమీ లేదని జూన్ 4న జగన్ మాటల్లో, లేక తన మాటల్లో ఏది నిజమో తేలిపోతుందని కౌంటర్ ఇచ్చారు. మరి ఎన్డీఏ కూటమికి ఫేవర్‌గా పీకే చెప్తున్న జోస్యాలు ఎంత వరకు ఫలిస్తాయో కాని ఇంకా దేశంలో ఎన్నికలు ప్రక్రియ కాకుండానే ఫలితాలపై విశ్లేషణలు ఇస్తుండటం విమర్శలపాలవుతుంది.