14 Days Girlfriend Intlo Trailer: క్యాచీ టైటిల్, యూత్‌ను కట్టిపడేసే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమానే ‘14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు చేతుల మీదుగా రిలీజ్ చేయించారు మేకర్స్. మార్చి 7న ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతుండడంతో ట్రైలర్ లాంచ్‌తో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ముఖ్యంగా టైటిల్‌తోనే మూవీపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. సత్య ఆర్ట్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి శ్రీ హర్ష మన్నె దర్శకత్వం వహించారు. తాజాగా విడుదలయిన ట్రైలర్ కూడా యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది.
రాఘవేంద్ర రావు విషెస్‌తో
‘14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో’ సినిమాను సత్య కోమల్ నిర్మించారు. ‘#90s’ వెబ్ సిరీస్ తెరకెక్కించిన ఎంఎన్ఓపీ అధినేత రాజశేఖర్ మేడారం సహకారంతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సౌండ్ మిక్సింగ్ విభాగంలో గ్రామీ అవార్డును అందుకున్న పీ.ఏ దీపక్ ‘14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో’ చిత్రానికి పనిచేయడం విశేషం. ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసిన తర్వాత దానిని చూసి మేకర్స్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు రాఘవేంద్ర రావు. ఈ సినిమా హిట్ అవ్వాలని అన్నారు. అంతే కాకుండా మార్చి 7న విడుదల కానున్న ‘14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో’ మూవీని అందరూ థియేటర్లకు వచ్చి ఆదరించాలని కోరారు.
కొత్త పెయిర్
తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా, మరికొన్ని సినిమాల్లో హీరో పాత్రకు ఫ్రెండ్‌గా నటించిన అంకిత్ కొయ్య (Ankith Koyya).. ‘14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో’ (14 Days Girlfriend Intlo) సినిమాలో హీరోగా కనిపించనున్నాడు. అంకిత్ కొయ్యకు జోడీగా ‘గ్యాంగ్ లీడర్’ మూవీ ఫేమ్ శ్రియ కొంతం (Shriya Kontham) హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే విడుదలయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌లో వీరి పెయిర్ చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. సినిమా మొత్తం ఫన్నీగా సాగిపోతూ యూత్‌ను ఆకట్టుకునేలా, లవ్, కామెడీ సీన్స్‌తో తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ముఖ్యంగా యూత్‌ను టార్గెట్ చేస్తూ ఈ మూవీని తెరకెక్కించినట్టు తెలుస్తోంది.
Also Read: శ్రీనివాస రావు మిస్సింగ్.. రాజమౌళి వివాదంలో అసలేం జరుగుతోంది.?
అదే కథ
గర్ల్ ఫ్రెండ్‌ను కలవడానికి వెళ్లిన కుర్రాడు అనుకోకుండా అదే ఇంట్లో 14 రోజులు ఉండాల్సి వస్తే ఏంటి పరిస్థితి అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న కథే ‘14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో’. చాలావరకు టైటిల్‌లోనే సినిమా కథను రివీల్ చేసినా ఇంకా ఇందులో ఏముంటుంది అనే ఆసక్తిని ట్రైలర్ ద్వారా క్రియేట్ చేయగలిగారు మేకర్స్. బాయ్‌ఫ్రెండ్ తమ ఇంట్లోనే ఉన్న విషయాన్ని తల్లిదండ్రులకు, తాతకు తెలియకుండా హీరోయిన్ ఎలాంటి పాట్లు పడింది అనేది ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు. ఈ మూవీలో వెన్నెల కిషోర్ పాత్ర హైలెట్ అవ్వనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రియ కొంతం గ్లామర్ ఇంకొక ప్లస్ పాయింట్ కానుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో ఇంద్రజ, ప్రశాంత్ శర్మ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.