Well Predicts Death: ఎవరి బర్త్ డే వారికి తెలుస్తుంది. కానీ డెత్ డే తెలిసే అవకాశం ఉందా? లేనేలేదు అనేస్తున్నారా? అయితే జస్ట్ వెయిట్.. ఇక్కడికి వెళ్లారో డెత్ డే ఇట్టే తెలిసిపోతుందట. ఔను అక్కడి భక్తులు ఇదే విశ్వసిస్తారు. ఇంతకు డెత్ డే తెలుసుకొనే ఆలయం ఎక్కడుందో అనుకుంటున్నారా? అయితే ఈ కథనం పూర్తిగా చదవండి.
సృష్టిలోని ప్రతి జీవికి మరణం తథ్యం. జీవులలో మానవులకు మరణం అంటేనే అదొక భయం. అన్నీ బంధాలను విడనాడి లోకాన్ని వదిలి వెళ్లే పరిస్థితి. అందుకే మరణం అంటేనే మానవులకు అదో రకమైన భయం. కానీ ఏ క్షణమైనా మృత్యువు ఏ రూపంలోనైనా కబళించవచ్చు. ఇటీవల మృత్యువు సంభవించే కొన్ని ఘటనలు చూస్తే, నివ్వెర పోవాల్సిందే. వివాహాల వేళ, డ్యాన్సులు చేస్తూ ఇలా ఎందరో మృత్యువు దారి పడుతున్నారు.
కొంతమంది సత్పురుషులు మరణాన్ని కూడా సంతోషంగా స్వీకరిస్తారు. వారి దృష్టిలో మరణం అంటే.. దేవుని చెంతకు తాము చేరుతామని అర్థం. అయితే మానవులకు మరణాన్ని సూచించే ఓ బావి ఉందట. ఆ వింత బావి వద్దకు వెళితే మరణం గురించి సూచన వస్తుందట. ఇంతకు ఆ వింత బావి ఏమిటో, ఎక్కడుందో తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని వారణాసి అంటే తెలియని వారుండరు. ఇదొక పవిత్ర పుణ్యక్షేత్రంగా భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడి గంగానదిలో పవిత్ర స్నానం ఆచరిస్తే, సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ ఎన్నో ప్రసిద్ది చెందిన ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల సందర్శనకు విదేశీ భక్తులు కూడా వస్తుంటారు. సుమారు 5 వేల సంవత్సరాల క్రితం పరమ శివుడే వారణాసి నగరాన్ని స్థాపించారని చరిత్రకారులు చెబుతుంటారు. అందుకే ఈ నగరం భక్తిమయమైన నగరాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. ఇక్కడ వెలసిన శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం ఎంతో ప్రసిద్ది చెందింది. నిత్యం భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చి స్వామి వారికి పూజలు నిర్వహిస్తుంటారు.
కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలోని సిద్ధేశ్వరి మందిర్ ప్రాంగణంలో చంద్రుడు నిర్మించిన చంద్రకూప్ అనే బావి ఉంది. ఈ బావి నీటి కోసమే కాకుండా రాబోయే మరణాన్ని వెల్లడించే శక్తి కలిగి ఉందని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం ఎవరైనా ఈ బావిలోకి చూస్తే వారి ప్రతిబింబం కనిపించకపోతే, రాబోయే ఆరు నెలల్లో జీవితం ముగుస్తుందని, ఇది ఒక శకునమని స్థానికులు చెబుతుంటారు. అందుకే ఈ బావి వద్దకు వచ్చి మరీ భక్తులు తమ నీడ కనిపిస్తుందా? లేదా అనే కోణంలో పరీక్షించుకుంటారట. అంతేకాదు ఈ బావి నీరు మహిమలు గల నీరుగా ప్రసిద్ది చెందింది.
Also Read: Heavy Rainfall India: సమ్మర్ లో భారీ వర్షసూచన.. అలర్ట్ చేసిన ఐఎండీ.. ఇదేమి చిత్రమో కదా..
మరి మరణం గురించి ముందే సూచన వస్తే చాలు, అక్కడి భక్తులు ముందస్తు జాగ్రత్త తీసుకుంటారని ప్రచారం సాగుతోంది. నేటి ఆధునిక కాలంలో వీటిని విశ్వసించే వారు ఉంటారు.. అలాగే విశ్వసించని వారు కూడా ఉంటారు. ఎవరి నమ్మకం వారిది.. ఎవరి భక్తి వారిది. ఏదిఏమైనా చంద్రకూప్ బావి మాత్రం ఈ తరహాలో ప్రాచుర్యంలో ఉంది. వారణాసికి వెళ్లిన ఎవరైనా ఇక్కడికి తప్పక వెళ్లి వస్తారట.