Hbd Hrithik Roshan : ప్రముఖ నటుడు, దర్శకుడు రాకేష్ రోషన్ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్న ఆయన వారసుడు, స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan). బాలీవుడ్‌లో గ్రీక్ గాడ్ గా పేరు తెచ్చుకున్నాడు హృతిక్. ఇండస్ట్రీలోకి మంచి సినిమా బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో అతికొద్ది కాలంలోనే చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈరోజు (జనవరి 10) హృతిక్ తన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా హృతిక్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
లగాన్ (Lagaan)
హృతిక్ తన మొదటి చిత్రం ‘కహో నా ప్యార్ హై’తోనే బెస్ట్ యాక్టర్ గా అవార్డును అందుకున్నారు. అయితే ఆ తరువాత ‘లగాన్’ వంటి సూపర్ హిట్ సినిమాను చేజార్చుకున్నాడు. అమీర్ ఖాన్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘లగాన్’. 2001లో విడుదలైన ఈ సినిమా కోసం ముందుగా హృతిక్ ని హీరోగా అనుకున్నారట. ఈ మేరకు ఆయనను సంప్రదించగా, హృతిక్ రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత ఈ చిత్రం అమీర్ ఖాన్ చేతికి చిక్కింది. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు సృష్టించింది. ఈ చిత్రం అప్పట్లోనే రూ.25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా, బాక్సాఫీస్ వద్ద రూ.58.05 కోట్లను కొల్లగొట్టింది.
‘బాహుబలి’ (Baahubali)
సౌత్ సూపర్ స్టార్ ప్రభాస్ ఇండియన్ సినిమాలో ‘బాహుబలి’గా నిలవడానికి, ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీని సంపాదించుకోవడానికి ‘బాహుబలి’ మూవీనే కారణం. అయితే ప్రభాస్ కంటే ముందు హృతిక్ కి ఈ సినిమా ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమాను హృతిక్ పక్కకు పెట్టడంతో, ఆ లైఫ్ ఛేంజింగ్ ఛాన్స్ ప్రభాస్ ను వరించింది.
దిల్ చాహ్తా హై (Dil Chahta Hai)
‘దిల్ చాహ్తా హై’ చిత్రం 2001లో విడుదలైంది. ఫర్హాన్ అక్తర్ తొలిసారిగా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. దాదాపు రూ.8 కోట్లతో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.40 కోట్లు రాబట్టింది. ఈ చిత్రంలో అమీర్ ఖాన్, అక్షయ్ ఖన్నా, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా పాత్రకు హృతిక్ ని సంప్రదించగా, ఆయన రిజెక్ట్ చేశారట.
‘రంగ్ దే బసంతి’ (Rang De Basanti)
రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ‘రంగ్ దే బసంతి’ చిత్రం 2006లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా రూ.96.90 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి, హిట్ మూవీగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా బడ్జెట్ 28 కోట్లు. అమీర్, సిద్ధార్థ్, అతుల్ కులకర్ణి వంటి తారలు ఈ చిత్రంలో కనిపించారు. ఈ సినిమాలో సిద్ధార్థ్ పాత్రలో నటించమని హృతిక్‌ని సంప్రదించగా, అతను ఆ పాత్రను తిరస్కరించాడు.
మై హూ నా (Main Hoon Na)
ఫరా ఖాన్ దర్శకత్వం వహించిన ‘మై హూ నా’ చిత్రం 2004లో విడుదలైంది. ఇందులో షారుక్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించాడు. అయితే ఇందులో హృతిక్‌కి హీరో పాత్ర కాకుండా సపోర్టింగ్ రోల్ ఆఫర్ చేశారట. కానీ హృతిక్ సపోర్టింగ్ రోల్ చేసే మూడ్ లో లేకపోవడంతో రిజెక్ట్ చేశారు. 28 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.96.90 కోట్లు రాబట్టింది.