Aamir Khan: వారసులుగా ఎంటర్ అయిన వారికి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చినవారి కంటే ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. వారసులుగా సినీ పరిశ్రమలో హీరో, హీరోయిన్ అవ్వాలనే కలతో అడుగుపెట్టిన వారిని తరచుగా తమ తండ్రిదండ్రులతో పోలుస్తూ ఉంటారు ఆడియన్స్. అందుకే వారు వెంటనే సక్సెస్ అవ్వలేరు. బాలీవుడ్‌లో అయితే ఇలాంటి కల్చర్ మరింత ఎక్కువ. తాజాగా బాలీవుడ్‌లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ వారసుడు జునైద్ ఖాన్ కూడా హీరోగా డెబ్యూ ఇచ్చాడు. కానీ తన డెబ్యూ మూవీ అంతగా సక్సెస్ అవ్వకపోవడంతో స్వయంగా అమీర్ ఖాన్ రంగంలోకి దిగి తనకు సక్సెస్ మార్గం చూపించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
నిర్మాతగా ఫిక్స్
ఇతర బాలీవుడ్ సీనియర్ హీరోలలాగా అమీర్ ఖాన్ ఇప్పుడు అంతగా యాక్టివ్‌గా ఉండడం లేదు. నటుడిగా వెండితెరపై కనిపించడం ఆపేసి పూర్తిగా నిర్మాణ రంగంపై ఫోకస్ పెట్టాడు. నిర్మాతగా అమీర్ ఖాన్ ఎలాంటి సినిమాను సెలక్ట్ చేసుకున్నా కూడా.. ఆ మూవీ కచ్చితంగా ప్రేక్షకులను నచ్చేలా ఉంటుందని ఇండస్ట్రీ నిపుణులు కూడా అనుకుంటూ ఉంటారు. అలా ఇప్పటివరకు అమీర్ ఖాన్ నిర్మాతగా ‘తారే జమీన్ పర్’, ‘లాపతా లేడీస్’, ‘లగాన్’ వంటి చిత్రాలు తెరకెక్కాయి. ఇక నిర్మాతగా ‘లాపతా లేడీస్’ సూపర్ సక్సెస్‌ను చూశాడు అమీర్. అందుకే అదే స్థానంలో ఉంటూ తన కుమారుడు జునైద్ ఖాన్‌కు హిట్ అందించాలని అనుకుంటున్నాడట ఈ సీనియర్ హీరో.
డెబ్యూ ఫ్లాప్
అసలైతే నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిల్మ్ ‘మహారాజ్’తోనే జునైద్ ఖాన్ డెబ్యూ జరిగిపోయింది. కానీ అది నేరుగా ఓటీటీలో విడుదల అవ్వడం వల్ల అది జునైద్‌కు గ్రాండ్ డెబ్యూ అని భావించలేదు అమీర్. ఆ మూవీలో జునైద్ నటనకు మంచి మార్కులు పడినా.. తనను వెండితెరపై చూసుకోవాలని అమీర్ ఆరాటపడ్డాడు. అలా తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘లవ్ టుడే’ మూవీని హిందీలో ‘లవ్‌యాపా’ పేరుతో రీమేక్ చేయించాడు. ఈ సినిమాతో జునైద్ ఖాన్ మాత్రమే కాదు శ్రీదేవి వారసురాలు ఖుషీ కపూర్ డెబ్యూ కూడా జరిగింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అందుకే అమీర్ ఖాన్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
Also Read: హాస్పిటల్ బెడ్‌పై గాయాలతో ఫేమస్ సింగర్.. ఇంతకీ ఏం జరిగిందంటే.?
మల్టీ స్టారర్ కూడా
ఇప్పటికే జునైద్ ఖాన్ (Junaid Khan), సాయి పల్లవి కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీని అమీర్ నిర్మించాడు. అంతే కాకుండా ఇందులో తాను ఒక గెస్ట్ రోల్ చేసిన విషయాన్ని కూడా తాజాగా బయటపెట్టాడు అమీర్. ఇది మాత్రమే కాదు.. దీని తర్వాత కూడా జునైద్ సినిమాలు తానే నిర్మించాలనే ఆలోచనలో ఉన్నాడట. అంతే కాకుండా కొడుకు సక్సెస్ అవ్వడం కోసం తనతో కలిసి మల్టీ స్టారర్ చేయడానికి కూడా సిద్ధమే అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు అమీర్ ఖాన్ (Aamir Khan). ఇదంతా చూస్తుంటే జునైద్ ఖాన్ సక్సెస్ కోసం అమీర్ ఎంత ఆరాటపడుతున్నాడో అర్థమవుతుందని అనుకుంటున్నారు ప్రేక్షకులు.