Arigapudi Vijay Kumar: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, సమర్పకుడు, నిర్మాత, సోషల్ వర్కర్ అయిన ఆరిగపూడి విజయ్ కుమార్ (Arigapudi Vijay Kumar) హఠాత్తుగా కన్నుమూశారు. ఏవీకే ఫిల్మ్స్‌ను స్థాపించిన విజయ్ కుమార్.. ఇటీవల గుండెపోటుతో మరణించారు. ఆయన ఏవీకే ఫిల్మ్స్ సంస్థ ద్వారా ‘ఓ తండ్రి తీర్పు’ అనే సినిమాను ప్రజెంట్ చేశారు. ఇటీవల షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఫస్ట్ కాపీ సిద్ధమయ్యింది. ఇదే సమయంలో ఆయన మరణం తీరని లోటు అని ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు. ఈ విషయం తెలిసిన పలువురు తెలుగు సినీ సెలబ్రిటీలు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
అనారోగ్య సమస్యలు
ఆరిగపూడి విజయ్ కుమార్‌ను చాలామంది లయన్ డాక్టర్ ఆరిగపూడి విజయ్ కుమార్ అని ప్రేమగా పిలుస్తుంటారు. ఈయన నవంబర్ 26 రాత్రి గుండెపోటుతో మరణించారు. అంతే కాకుండా గత కొన్నాళ్లుగా ఆయన పలు ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నట్టు సన్నిహితులు చెప్తున్నారు. ఇక సోషల్ వర్కర్‌గా గుర్తింపు తెచ్చుకొని, ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయం చేసిన ఆయన.. అనారోగ్య సమస్యలను సైతం పట్టించుకోకుండా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. వాటిని మాత్రం ఎప్పుడూ పక్కన పెట్టలేదని సన్నిహితులు గర్వంగా తెలిపారు. సహాయం కోసం ఎవ్వరు వచ్చినా లేదనుకుండా సాయం చేయడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమని అన్నారు.
Also Read: నాటి ఇబ్బందులను మళ్లీ గుర్తు చేసుకుని ఎమోషనల్ సామ్.. అంత కష్టపడిందా..?
భార్య మృతితో డిప్రెషన్
కొన్నాళ్ల క్రితమే ఆరిగపూడి విజయ్ కుమార్ భార్య ఆరిగపూడి కృష్ణకుమారి మరణించారు. అప్పటినుండి ఆయన మరింత కృంగిపోయారని, ఆమె లేని లోటు భరించకపోయారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ముందు నుండే ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నా భార్య మరణించిన తర్వాత ఆ సమస్యలు మరింత పెరిగిపోవడంతోనే ఆయనకు గుండెపోటు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. లయన్ శ్రీరామ్ దత్తి నిర్మాతగా తెరకెక్కిన ‘ఓ తండ్రి తీర్పు’ సినిమాను ఆరిగపూడి విజయ్ కుమార్ ప్రజెంట్ చేశారు. ఇది ఒక సోషల్ డ్రామా మూవీ. ఆ సినిమా ఆయన సమాజానికి ఇస్తున్న గిఫ్ట్ లాంటిది అని విజయ్ కుమార్ పదేపదే చెప్పేవారని కుటుంబ సభ్యులు గుర్తుచేసుకుంటున్నారు.
చివరి సినిమా
‘ఓ తండ్రి తీర్పు’ మూవీని ఆరిగపూడి విజయ్ కుమార్ ప్రజెంట్ చేయడం మాత్రమే కాకుండా అందులో ఆయన కీలక పాత్ర కూడా పోషించారు. కానీ ఇదే ఆయన ఆఖరి చిత్రం అవుతుందని ఊహించలేదు. ఆయన మరణ వార్త తెలిసి ఆయన నుండి సాయం పొందిన ఎంతోమంది బాధపడుతూ విజయ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. బుల్లితెర రచయిత రాజేంద్ర రాజు కాంచనపల్లి సైతం ఆరిగపూడి విజయ్ కుమార్ మరణవార్త తెలిసి కన్నీటి పర్యంతమయ్యారు. ఏపిఎన్ ఫౌండేషన్ ఛైర్మన్ లయన్ శ్రీరామ్ దత్తి కూడా విజయ్ కుమార్ మృతికి నివాళులు అర్పించారు. శనివారం ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.