Tollywood..ఈ మధ్యకాలంలో ఆడియన్స్ అభిరుచి పూర్తిగా మారిపోయింది. అందుకే ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టుగా దర్శక నిర్మాతలు కూడా విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే హార్రర్, సస్పెన్స్, కామెడీ, థ్రిల్లర్, ఫ్యామిలీ, ఎమోషనల్ వంటి జానర్ లలో సినిమాలు, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ముఖ్యంగా ఎమోషనల్ సినిమాల విషయానికి వస్తే.. తల్లి సెంటిమెంట్ తో వచ్చే సినిమాలు ఎప్పుడూ కూడా విజయాన్ని అందుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తమ వంతు ప్రయత్నంగా అమ్మ గొప్పతనాన్ని ఆవిష్కరించే విధంగా ‘అమ్మ’ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ప్రముఖ నృత్యకారిణి అభినయశ్రీ ఇంద్రాణి దవలూరి (Indrani davaluri).
అమ్మ షార్ట్ మూవీపై ఇంద్రాణి కామెంట్స్..
అమ్మ అంటే ఆలనా.. అమ్మ అంటే ఆప్యాయత.. అమ్మ అంటే అనురాగం.. అలాంటి అమ్మ విలువను గుర్తిస్తూ తెరకెక్కుతున్న సందేశాత్మక షార్ట్ మూవీ అమ్మ. ఏఏఆర్ ఫిలిం మేకర్స్ సమర్పణలో ‘నాట్య మార్గం’ సహకారంతో ఈ షార్ట్ ఫిలిం మదర్స్ డే సందర్భంగా మే 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో ప్రముఖ నృత్యకారిణి ఇంద్రాణి తెరపై అమ్మగా లాలించబోతోంది. ఇకపోతే ఈమె ప్రధాన పాత్రలో నటించిన ‘అందెల రవమిది’ సినిమా విడుదలకు ముందే పలు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుంది. ఇప్పుడు ‘అమ్మ’ మూవీలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇకపోతే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇంద్రాణి మాట్లాడుతూ.. “ఏమీ యాచించని నిస్వార్ధ ప్రేమ మూర్తి అమ్మ. అలాంటి ఒక అమ్మ కథను చూపించే సందేశాత్మక చిత్రమే మా అమ్మ మూవీ” అంటూ ఆమె తెలిపారు.
అమ్మ కథ మూవీ ఇదే – హరీష్ బన్నాయ్
ఈ షార్ట్ చిత్రానికి కథ , స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అందించిన హరీష్ బన్నాయ్ మాట్లాడుతూ.. “మనకు ఏదైనా కష్టం వస్తే ముందుగా మనం చెప్పుకునేది అమ్మకే . అలాంటి ఆ అమ్మకే బాధ కలిగిస్తే ఆమె పడే ఆవేదన ఎలా ఉంటుంది? కొవ్వొత్తిలా కరిగి మనకు దారి చూపించ అమ్మకు మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం? ఇదే మా మూవీ సబ్జెక్టు ” అంటూ ఆయన తెలిపారు. ఇక ఇందులో ఇంద్రాణి దవలూరి, సాంబి, సుధా కొండపు, రీనా బొమ్మసాని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంగీతం కేవీ భరద్వాజ్ అందించగా సినిమా ఆటోగ్రఫీగా కార్తీక్ కళ్లూరి పనిచేశారు.