Actress Kasthuri Shankar: ప్రముఖ సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్ (Kasthuri Shankar) ఇటీవల తమిళనాడులో నివసిస్తున్న తెలుగు ప్రజలపై చేసిన వ్యాఖ్యలకు గానూ ఆమెపై పరువు నష్టం కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే కస్తూరి శంకర్ మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆనంద్ వెంకటేష్ (Anand Venkatesh) కస్తూరి శంకర్ పిటిషన్ ను మంగళవారం నవంబర్ 12న విచారించనున్నారు. ముందస్తు బెయిల్ కోరిన కస్తూరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తుందో లేదో మరికొన్ని గంటల్లో తేలనుంది.
తెలుగువారిపై కస్తూరి శంకర్ అనుచిత వ్యాఖ్యలు..
ఇకపోతే తన పిటీషన్ లో దురుద్ధ్యేశంతోనే తనపై పరువు నష్టం కేసు పెట్టారు అంటూ కస్తూరి పేర్కొంది. నవంబర్ 3న( ఆదివారం) తమిళనాడులో జీవిస్తున్న బ్రాహ్మణులకు మద్దతుగా హిందూ మక్కల్ కట్చి చెన్నైలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి శంకర్ మాట్లాడుతూ..” 300 సంవత్సరాల క్రితం మహారాణులకు సేవ చేయడానికి తెలుగు వారు ఇక్కడికి వలస వచ్చారు” అంటూ తెలుగువారిని అవమానిస్తూ కామెంట్లు చేశారు కస్తూరి శంకర్.
పరారీలో కస్తూరి శంకర్..
తన ప్రసంగంలో తమిళనాడులో తెలుగు మాట్లాడే ప్రజలపై ఈమె విమర్శలు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈమె పైన విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తమిళనాడు లోని పలు పోలీస్ స్టేషన్ లలో ఈమెపై కేసులు కూడా నమోదు అయ్యాయి. దీంతో ఈమెను అరెస్టు చేయడానికి పోలీసులు చెన్నైలోని పోలీసులు ఆమె నివాసానికి వెళ్ళగా.. ఇంటికి తాళం వేసి, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పరారీ అయినట్లు గుర్తించారు. ఇకపోతే కస్తూరి తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పినా సరే రాష్ట్రవ్యాప్తంగా ఆమెపై పలు ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.
కస్తూరి శంకర్ ను దూరం పెట్టిన బీజేపీ పార్టీ..
మరోవైపు 2024 లోకసభ ఎన్నికలలో బీజేపీ తరఫున విస్తృతంగా ప్రచారం చేసింది కస్తూరి. ఇక ఇప్పుడు తెలుగు వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో తమిళనాడు బీజేపీ కూడా ఆమెకు దూరమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే తనపై వెల్లువెత్తుతున్న విమర్శలను దృష్టిలో పెట్టుకున్న కస్తూరి శంకర్ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తనపై ప్రతికూల ప్రచారం జరుగుతోందని, తాను మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుంటున్నానని, దయచేసి తెలుగు ప్రజలను ఉద్దేశించి, తాను ఒక్క మాట కూడా అనలేదు అంటూ తెలిపింది. ముఖ్యంగా ” ‘ద్రవిడ మున్నేట్రకజగం’ కపటత్వాన్ని, ద్వంద్వ ప్రమాణాలను బహిర్గతం చేసేలా మాత్రమే మాట్లాడాను… అంతే తప్పించి తెలుగువారిని ఒక్క మాట కూడా అనలేదు. అయితే నా వ్యాఖ్యలను వక్రీకరించి నేను తెలుగు సమాజం పై విస్తృతంగా దాడి చేశానని కామెంట్లు చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకుంటారని చెబుతున్నాను. తమిళనాడులో ఉండే హిందూ బ్రాహ్మణులకు సహాయం చేయండి” అంటూ కోరింది కస్తూరి శంకర్.. మరి తన అభిప్రాయాలను విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కస్తూరి శంకర్ సినిమాలు..
ఇకపోతే కస్తూరి శంకర్ నటించిన సినిమాల విషయానికొస్తే.. నాగార్జున (Nagarjuna) హీరోగా నటించిన ‘అన్నమయ్య’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈమె, ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా మారిపోయింది కస్తూరి శంకర్.