Varra Ravindra Reddy: YCP సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రకు కడప కోర్టు 14రోజులు రిమాండ్ విధించింది. ఈ కేసులో అరెస్ట్ అయిన మరో ఇద్దరు నిందితులు ఉదయ్, సుబ్బారెడ్డిలకు 41 A నోటీసులు ఇచ్చి పంపాలని పోలీసులకు తెలిపారు మెజిస్ట్రేట్. వర్రాను కోర్టులో హాజరు పరిచి.. కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను మెజిస్ట్రేట్ ముందుంచారు ఇరు పక్షాల లాయర్లు. ఇరుపక్షాల వాదనల అనంతరం వర్రాకు రిమాండ్ విధించింది కోర్టు. వర్రాపై అట్రాసిటీ కేసు ఉన్నందున రిమాండ్ విధించినట్టు తెలిపారు మెజిస్ట్రేట్.
మరోవైపు వర్రా రవీంద్ర తనకు జరిగిన అన్యాయాన్ని మేజిస్ట్రేట్‌కు తెలిపారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఎస్పీకి తెలిపేందుకు హైదరాబాదు నుంచి వస్తుంటే.. కర్నూలు టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని.. అరికాళ్ళపై కొట్టి, తొడలపై కాళ్లతో ఎక్కి తొక్కి టార్చర్ చేసినట్లు మెజిస్ట్రేట్‌కు మొర పెట్టుకున్నారు వర్రా. YS విజయమ్మ, YS షర్మిలపై, సునీతపై పోస్టులు పెట్టినట్టు ఒప్పుకోమని పోలీసులు టార్చర్ చేశారని చెప్పారు. అవినాష్ రెడ్డి పేరు చెప్పాలంటూ పోలీసులు తనను టార్చర్ చేసినట్లు మెజిస్ట్రేట్‌కు చెప్పారు.
ఒప్పుకోకపోతే తన కుటుంబంలోని మహిళలపై వేధింపులు ఉంటాయని పోలీసులు హెచ్చరించినట్లు కూడా మెజిస్ట్రేట్ ముందు వర్రా రవీంద్ర తెలిపాడు. మాట వినకపోతే ఎన్ కౌంటర్ చేయడానికి కూడా వెనుకాడబోమని పోలీసులు అన్నట్టు రవీంద్ర మెజిస్ట్రేట్ వద్ద చెప్పారు. వర్రా రవీంద్ర చెప్పిన స్టేట్‌మెంట్ అంతా మెజిస్ట్రేట్ రికార్డు చేశారు. పోలీసుల టార్చర్ విషయమై వర్రాకు మరోసారి మెడికల్ టెస్ట్ చేయించాలని పోలీసులను ఆదేశించారు మెజిస్ట్రేట్. ఈ క్రమంలో వర్రాను ఇవాళ 10 గంటల తరువాత మెడికల్ చెక్ అప్‌కు తీసుకెళ్ళే అవకాశం ఉంది.
Also Read: చక్రం తిప్పబోతున్న చంద్రబాబు.. జగన్ పై అనర్హత వేటు
ఇక వర్రా అరెస్ట్‌పై DIG పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మార్కాపురం సమీపంలో వర్రాను అదుపులోకి తీసుకున్నట్టు DIG తెలిపారు. వర్రా రవీంద్రారెడ్డి గతంలో భారతి సిమెంట్ కంపెనీలో పనిచేసినట్టు గుర్తించామని. YCP అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ సోషల్ మీడియా కోసం పని చేశాడని తెలిపారు DIG. విపక్ష పార్టీ నేతల కుటుంబంలోని మహిళలు, పిల్లలే టార్గెట్‌గా పోస్టులు వేసేవారని DIG తెలిపారు. ఇలాంటి వారిని ఇప్పటి వరకు 45 మందిని గుర్తించామని చెప్పారు.
నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని.. వీరంతా జగన్ కనెక్ట్స్ అనే వేదిక నుంచి పనిచేస్తున్నట్టు దర్యాప్తులో తేలిందని అన్నారు. ఈ జగన్ కనెక్ట్స్‌కు 2022 నుంచి సజ్జల భార్గవ్ రెడ్డి ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారని తెలిపారు. కడప జైలులో ఉంటే వర్రాకు ప్రాణహాని ఉందని వాగ్మూలంలో తెలిపిన నేపథ్యంలో వేరే జిల్లా జైలుకు రిమాండ్ కోసం మెజిస్ట్రేట్‌ను కోరుతామని DIG తెలిపారు.