Allu Arjun : ‘పుష్ప 2’ ప్రీమియర్ల సందర్భంగా హైదరాబాదులోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వివాదం ఇంకా కొనసాగుతోంది. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడంతో అల్లు అర్జున్ (Allu Arjun) ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ధైర్యం చేసి అల్లు అర్జున్ కు స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తున్న సెలబ్రిటీ ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. కానీ కన్నడ బ్యూటీ సంజన గల్రాని మాత్రం స్పందించి, వివాదంపై మళ్లీ ఎవ్వరూ ప్రశ్నించని విధంగా సమాధానం చెప్పింది.
అల్లు అర్జున్ కు కన్నడ హీరోయిన్ సంజన గల్రాని (Sanjjanaa Garlani) స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా అల్లు అర్జున్ అరెస్ట్, ఆ తదనంతర పరిణామాల గురించే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా నేషనల్ మీడియా ఈ విషయంపై మరింత కుతూహలాన్ని ప్రదర్శిస్తుంది. అందులో భాగంగా వరుసగా డిబేట్లు పెట్టి, అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం కరెక్టేనా? అంటూ చర్చల మీద చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సంజన ఓ డిబేట్లో పాల్గొన్నారు. అందులో భాగంగా ఆమె అల్లు అర్జున్ ని సమర్థిస్తూనే, తాను కూడా వ్యవస్థకు బలయ్యానని వివరించింది.
ఇలాంటి కేసులోనే తాను కూడా అరెస్ట్ అయ్యానని, అయితే ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడటం నిజంగా సాహసోపేతమైన విషయమని చెప్పింది సంజన. ఈ వివాదం గురించి ఆమె మాట్లాడుతూ “అల్లు అర్జున్ దీనికి బాధ్యత వహించలేడు, అతను నిందితుడు కాదు. కానీ బలవంతంగా నిందితుడిగా చేర్చారు. అయితే నిజానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని ప్రేక్షకులకు సెలబ్రిటీలు అంటే పిచ్చి. అయినప్పటికీ ఆయన స్థానిక థియేటర్ కి వెళ్లడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటిదాకా ఎన్నోసార్లు వెళ్లి సినిమాలు చూశారు. అలాంటిది ఇప్పుడు ఇలాంటి ఘటన చోటు చేసుకుంటే అతను ఎలా బాధ్యుడు అవుతాడు? ఈ ఘటనలో అల్లు అర్జున్ తప్పేమీ లేదు” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
ప్రభాస్ ‘బుజ్జిగాడు’ సినిమాలో రెండవ హీరోయిన్ గా నటించి ఆకట్టుకున్న సంజన తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేసింది. అయితే కన్నడలో మాత్రం స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన బ్యూటీ గతంలో డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యి, జైలుకు కూడా వెళ్లి వచ్చింది. ఇక 2021లో తన ప్రియుడు డాక్టర్ పాషాను పెళ్లి చేసుకుంది.
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి, బయటకు వచ్చిన తరువాత నానితో పాటు పలువురు స్టార్స్ ఈ వివాదంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. చాలామంది ప్రముఖులు అల్లు అర్జున్ ను పరామర్శించడానికి ఆయన ఇంటికి వెళ్ళిన సంగతి తెలిసిందే. కానీ అసెంబ్లీలో అల్లు అర్జున్ పై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డాక ఎవ్వరూ కామెంట్స్ చేసే సాహసం చేయలేదు. తాజాగా అల్లు అర్జున్ పై విచారణ పూర్తయింది. మళ్లీ అవసరం అయితే పోలీసుల విచారణకు సహకరిస్తానని అల్లు అర్జున్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.