Akshay Kumar : బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar) తాజా షూటింగ్ లో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అక్షయ్ గాయపడ్డాడని సమాచారం. ప్రస్తుతం ముంబైలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘హౌస్‌ఫుల్ 5’ (Housefull 5) షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రం కోసం అక్షయ్ కుమార్ స్టంట్ చేస్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో ఆయన గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో అక్షయ్ కంటికి గాయమైనట్లు టాక్ నడుస్తోంది.
ఇన్సైడ్ వర్గాల సమాచారం మేరకు అక్షయ్ (Akshay Kumar) స్టంట్ చేస్తున్నప్పుడు, ఓ వస్తువు ఎగిరి అతని కంటిలో గుచ్చుకుంది. దీంతో వెంటనే అప్రమత్తమైన సెట్‌లో ఉన్న చిత్రబృందం… ఐ డాక్టర్ ను పిలిపించారు. వైద్యులు అక్షయ్ కుమార్ కంటికి తగిలిన గాయాన్ని పరీక్షించి, కంటికి కట్టు కట్టి, విశ్రాంతి తీసుకోమని చెప్పారు. అయితే ఈ ఘటన వలన కాసేపు ఆగిన షూటింగ్, ప్రస్తుతం అక్షయ్ కుమార్ లేకుండా ఇతర నటీనటులతో తిరిగి ప్రారంభమైంది. గాయంతో కూడా అక్షయ్ కుమార్ షూటింగ్ చేస్తానని పట్టుబట్టారు. సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్న నేపథ్యంలో తన వల్ల ఆలస్యం కాకూడదని అక్షయ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. కానీ దర్శకనిర్మాతలు ఆయనను రెస్ట్ తీసుకోమని కోరడంతో, గాయం నయమైన తరువాత వీలైనంత త్వరగా అక్షయ్ కుమార్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు. తాజాగా అక్షయ్ కుమార్ కంటికి గాయమైంది అనే విషయం బయటకు రావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అక్షయ్ కుమార్ బాగానే ఉన్నారని తెలుస్తోంది.
‘హౌస్‌ఫుల్ 5’లో అభిషేక్ బచ్చన్, శ్రేయాస్ తల్పాడే, చుంకీ పాండే, జాక్వెలీన్ ఫెర్నాండెజ్, నర్గీస్ ఫక్రీ తదితరులు మరోసారి ఈ సీక్వెల్ లో భాగం కాబోతున్నారు. అక్షయ్ (Akshay Kumar), రితీష్ దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఫ్రాంచైజీలో ఫర్దీన్ ఖాన్, డినో మోరియా, జానీ లివర్, జాకీ ష్రాఫ్, సంజయ్ దత్, నానా పటేకర్, సోనమ్ బజ్వా, చిత్రాంగద సింగ్ తదితరులు కొత్తగా యాడ్ అవుతున్నారు. అక్షయ్ కుమార్ గత కొంతకాలంగా వరువ డిజాస్టర్లను అందుకుంటున్న సంగతి తెలిసిందే. అందుకే ఆయన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బ్లాక్ బస్టర్ సీక్వెల్ ‘హౌస్ ఫుల్ 5’పై ఆశలన్నీ పెట్టుకున్నారు. కానీ ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ లో అక్షయ్ కు గాయాలు కావడంతో ఆయన అభిమానులు, అక్షయ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా ఈ ఏడాది ప్రారంభంలో యూరప్‌లో సెట్స్‌పైకి వెళ్ళింది. అక్కడ చిత్రబృందం 40 రోజుల పాటు క్రూయిజ్ షిప్‌లో మూవీని చిత్రీకరించారు. స్పెయిన్, నార్మాండీ, హోన్‌ఫ్లూర్ వంటి ఇంటర్నేషనల్ లొకేషన్లలో ఈ సినిమాను షూట్ చేశారు. తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహిస్తున్న ‘హౌస్‌ఫుల్ 5’ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. 2025 జూన్ 6న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు అక్షయ్ కుమార్ (Akshay Kumar) ‘కన్నప్ప’ అనే పాన్ ఇండియా సినిమాలో శివుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.