Critics Choice Awards : క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ 2025 (Critics Choice Awards 2025) విజేతలకు అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోంది. అమెరికన్ సిరీస్ ‘షోగన్’ ఈ అవార్డులలో ఆధిపత్యం చెలాయించింది. ‘షోగన్’ నాలుగు అవార్డులను అందుకుంది. ఉత్తమ డ్రామా సిరీస్ అవార్డుతో పాటు ‘షోగన్’ నటుడు హిరోయుకి సనాదకు ఉత్తమ సహాయ నటుడిగా అవార్డును గెలుచుకున్నారు. అలాగే నటుడు తడనోబు అసనో ఉత్తమ సహాయ నటుడి అవార్డును అందుకున్నారు. అదే సమయంలో, ఈ సిరీస్ లో నటించిన మోకా హోషి డ్రామా సిరీస్‌లో సహాయ నటిగా అవార్డును అందుకుంది. ఇక ఈసారి క్రిటిక్స్ అవార్డులలో రేసులో పాయల్ కపాడియా చిత్రం ‘ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్’ (All We Imagine as Light), ‘సిటాడెల్ హనీ బన్నీ’ (Citadel: Honey Bunny) సిరీస్ ఉన్నాయి. కానీ ఈ రెండింటినీ పక్కకు నెట్టి మరో హాలీవుడ్ మూవీ, సిరీస్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును ఎగరేసుకుపోయాయి.
క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు విన్నర్
30వ క్రిటిక్స్ ఛాయిస్ (Critics Choice Awards 2025) అవార్డుల జాబితాలో పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ‘ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్’ ఉత్తమ విదేశీ భాషా చిత్రం అవార్డుకు నామినేట్ అయ్యింది. కానీ తాజాగా ప్రముఖ చిత్రనిర్మాత జాక్వెస్ ఆడియార్డ్ రూపొందించిన స్పానిష్ భాషా ఫ్రెంచ్ మ్యూజిక్ క్రైమ్ మూవీ ‘ఎమిలియా పెరెజ్’ ఈ మూవీని వెనక్కి నెట్టేసి, అవార్డు పట్టేసింది. అయినప్పటికీ ‘ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్’కు మంచి గుర్తింపు దక్కింది. అంతర్జాతీయ చిత్ర పరిశ్రమలో ఈ మూవీ పేరు మార్మోగిపోతోంది.
రెండూ కేటగిరీల్లోనూ తప్పని నిరాశ
ఇక వరుణ్ ధావన్, సమంత రూత్ ప్రభు కలిసి నటించిన సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ (Citadel: Honey Bunny) 30వ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులలో ఉత్తమ విదేశీ భాషా సిరీస్ విభాగంలో నామినేట్ అయ్యింది. అయితే సిటాడెల్: హనీ బన్నీ’కి కూడా ఈ అవార్డును అందుకునే అవకాశం దక్కలేదు. మొత్తానికి ఇండియా నుంచి నామినేట్ అయిన సిరీస్, సినిమా రెండూ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయాయి.
కేన్స్ లో ‘ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్’
పాయల్ కపాడియా తెరకెక్కించిన ‘ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్’ (All We Imagine as Light) క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ లో నిరాశ పరిచినప్పటికీ, ఇప్పటికే ఈ మూవీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గ్రాండ్ ప్రిక్స్ విజేతగా నిలిచి, చరిత్రను సృష్టించింది. 2024లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రతిష్టాత్మక గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకున్న తొలి భారతీయ చిత్రం ‘ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్’.
క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల ప్రదానోత్సవం లైవ్ స్ట్రీమింగ్
కాగా 30వ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల (Critics Choice Awards 2025) ప్రదానోత్సవం ఫిబ్రవరి 7 శనివారం ఉదయం కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలోని బార్కర్ హ్యాంగర్‌లో జరుగుతోంది. భారతదేశంలో లయన్స్‌గేట్ ప్లేలో ఈ అవార్డుల ప్రదానోత్సవం లైవ్ స్ట్రీమింగ్ అవుతోంది.