Allu Arjun : రీసెంట్ గా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో గాయాల పాలైన శ్రీ తేజ్ (Sritej) ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వివాదం అల్లు అర్జున్ (Allu Arjun) మెడకు చుట్టుకొని సృష్టించిన సంచలనం అంతా కాదు. తాజాగా ఈ వివాదంలో ఎఫ్డిసి చైర్మన్ పొజిషన్ లో నిర్మాత దిల్ రాజు (Dil Raju) కల్పించుకుని… ఇటు సినిమా ఇండస్ట్రీ, అటు ప్రభుత్వానికి మధ్యన సయోధ్య కుదిర్చే ప్రయత్నంలో ఉన్నారు.
అందులో భాగంగానే ఇప్పటికే శ్రీ తేజ (Sritej) ను పరామర్శించిన దిల్ రాజు (Dil Raju) తాజాగా మరోసారి ‘పుష్ప 2’ నిర్మాతలు, అల్లు అరవింద్ తో కలిసి కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఆయన మరోసారి శ్రీ తేజ కుటుంబ సభ్యులు, డాక్టర్లతో మాట్లాడి అతడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అనంతరం దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ రేవతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేశారు. “దాదాపు 72 గంటల నుంచి శ్రీ తేజ్ వెంటిలేటర్ లేకుండా చాలా స్పీడ్ గా కోరుకుంటున్నాడు. ఇప్పటికే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగాము. ఈరోజే దీనిపై కన్ఫర్మేషన్ వచ్చింది. రేపు హైదరాబాద్లో ఉన్న పలువురు హీరోలు, నిర్మాతలతో కలిసి వెళ్లి ముఖ్యమంత్రిని కలుస్తాము. ఎఫ్డిసి చైర్మన్ గా సినీ ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేస్తాను. త్వరలోనే అల్లు అర్జున్ ను కూడా కలుస్తాను. అల్లు అరవింద్ ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు” అంటూ చెప్పుకోచ్చారు.
శ్రీతేజ్ కుటుంబానికి ఈ సందర్భంగా 2 కోట్ల నష్ట పరిహారాన్ని అందజేశారు. అల్లు అర్జున్ తరఫున అల్లు అరవింద్ కోటి రూపాయలు, సుకుమార్ 50 లక్షలు, మైత్రి మూవీ మేకర్స్ మరో 50 లక్షలు ప్రకటించగా, దిల్ రాజుతో పాటు అందరూ కలిసి శ్రీ తేజ కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఆ తర్వాత అల్లు అరవింద్ (Allu Aravind) మాట్లాడుతూ శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆశించారు. అయితే ఈ నేపథ్యంలోనే అల్లు ఫ్యామిలీ నేషనల్ మీడియాపై స్పెషల్ గా ఫోకస్ చేయడం కొత్త విమర్శలకు దారి తీసింది. ఇప్పటికే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ టైంలో నేషనల్ మీడియా వచ్చిందా? అని అడిగి మరీ, ఇంగ్లీషులో మాట్లాడారు. ఇప్పుడేమో శ్రీ తేజ కుటుంబానికి కోటి రూపాయలు ఇస్తున్నాము అంటూ అల్లు అరవింద్ నేషనల్ మీడియా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి, ఇంగ్లీషులో మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది.
తాము కోటి రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నామని చెప్పడానికి నేషనల్ మీడియా ఉందా లేదా అని చెక్ చేసుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో కూడా పబ్లిసిటీ అవసరమా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత జరిగినా సరే నేషనల్ మీడియాను మాత్రం మిస్ చేయట్లేదు. పైగా ఈ వివాదాన్ని నేషనల్ మీడియాలోనే ఎక్కువగా హోరెత్తిస్తున్నారు. ఏం జరిగినా సరే దాన్ని పబ్లిసిటీ స్టంట్ గా వాడుకోవడానికి అల్లు ఫ్యామిలీ వెనకాడట్లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే రేపు ముఖ్యమంత్రితో సినీ పెద్దల భేటీ తర్వాత వివాదం సద్దుమనిగేలా కనిపిస్తోంది.