Allu Arjun Arrest : ప్రముఖ హీరో అల్లు అర్జున్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కు బెయిల్ కష్టాలు మొదలైనట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఈరోజు గనక బెయిల్ దొరకకపోతే మూడు రోజులు అల్లు అర్జున్ జైలులోనే ఉండాల్సి వస్తుంది.
‘పుష్ప 2’ మూవీ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడిన ఘటన అందరికీ తెలిసిందే, ఈ సంఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై బిఎన్ఎస్ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చిన సమయంలో భద్రతపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు అయింది.
ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు అరెస్ట్ చేసిన పోలీసులు, తాజాగా అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. మరోవైపు అల్లు అర్జున్ తనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసిన కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అంతలోనే శుక్రవారం రోజు ఆయన ఇంటికి వెళ్లి పోలీసులు బన్నిని అదుపులోకి తీసుకొని, పోలీస్ స్టేషన్ కు తరలించారు. అల్లు అర్జున్ లోకి తీసుకున్నారన్న విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు పోలీస్ స్టేషన్ కి చేరుకుంటున్నారు.
ఇక ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ క్యాష్ పిటిషన్ పై లంచ్ మోషన్ పిటిషన్ జరపాలని జస్టిస్ దువ్వాడ శ్రీదేవి కోర్టులో న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి మెన్షన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ పిటిషన్ లో సోమవారం వరకు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయకుండా ఆర్డర్ ఇవ్వాలని కోరినట్టు సమాచారం. అయితే ఈరోజు సాయంత్రం 4 గంటలకు అల్లు అర్జున్ ఖ్వాష్ పిటిషన్ విచారణకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చినట్టు సమాచారం. మరి 4 గంటల తర్వాత ఏం జరగబోతుంది అన్నది ఇప్పుడు టెన్షన్ టెన్షన్ గా మారింది.
ఎందుకంటే ఇప్పుడు గనుక ఈ కేసులో అల్లు అర్జున్ కు బెయిల్ దొరకకపోతే ఈ మూడు రోజుల పాటు జైలులోనే ఉండక తప్పదు. ఎందుకంటే రేపు రెండో శనివారం, తర్వాత ఆదివారం. ఈ రెండు రోజులు కోర్టుకు సెలవు. కాబట్టి ఈరోజుతో కలుపుకుని 3 రాత్రులు అల్లు అర్జున్ జైలులో ఉండాల్సి వస్తుందా? లేక బెయిల్ దొరుకుతుందా? అన్నది ఉత్కంఠభరితంగా మారింది.
మరోవైపు పోలీసులు అల్లు అర్జున్‌ను రిమాండ్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ రిమాండ్ రిపోర్ట్ రెడీ చేస్తున్న పోలీసులు, ఆయన స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేస్తున్నట్టు సమాచారం. ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు వైద్య పరీక్షల కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు అల్లు అర్జున్ ను తరలించబోతున్నారని అంటున్నారు. మరి హాస్పిటల్ వద్ద అల్లు అర్జున్ అభిమానులను పోలీసులు ఎలా నిలువరిస్తారో చూడాలి.