Indian Railways: 2019లో పట్టాలెక్కిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి. అప్పటి వరకు ఉన్న రైళ్లకు పూర్తి భిన్నంగా ఎంట్రీ ఇచ్చాయి. ప్రయాణీకులకు అత్యాధునిక సౌకర్యాలను కల్పించడంతో పాటు కళ్లుచెదిరే వేగంతో గమ్యస్థానాలకు చేర్చడం మొదలుపెట్టాయి. సాధారణ రైళ్లతో పోల్చితే వందేభారత్ రైళ్ల టికెట్ ధర కాస్త ఎక్కువే అయినా, ప్రయాణీకులు అత్యంత ఆహ్లాదకరమైన జర్నీని అందిస్తున్నాయి. సెమీ హైస్పీడ్ రైళ్లుగా ఎంట్రీ ఇచ్చిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్లు దేశ వ్యాప్తంగా తమ సేవలను అందిస్తున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సుమారు 135 వందేభారత్ రైళ్లు ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి.
త్వరలో వందేభారత్ స్లీపర్ రైళ్లు ఎంట్రీ
వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్నాయి. తొలుత 8 కోచ్ లతో ప్రారంభం అయిన ఈ రైళ్లు ప్రస్తుతం 20 కోచ్ ల వరకు పెరిగాయి. త్వరలోనే 24 కోచ్ లతో అందుబాటులోకి రాబోతున్నది. అటు సుదూర ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని వందేభారత్ స్లీపర్ రైళ్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. వచ్చే ఏడాది జనవరిలో తొలి వందేభారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్నట్లు తెలిపింది. అంతేకాదు, వందేభారత్ రైళ్లతో పోల్చితే వందేభారత్ స్లీపర్ రైళ్లలో మరిన్ని సౌకర్యాలు ఉంటాయని వెల్లడించింది. త్వరలోనే ఈ రైలుకు సబంధించిన ఫీల్డ్ ట్రయల్స్ కొనసాగనున్నాయి. రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ లోని ఖజురహోలో ఈ రైళ్ల ట్రయల్స్ నిర్వహించనున్నారు.
ఒకేసారి అందుబాటులోకి 10 స్లీపర్ రైళ్లు
దేశంలో తొలి వందేభారత్ స్లీపర్ రైలును జనవరి 26(2025) నాడు ప్రధాని మోడీ ప్రారంభించనున్నట్లు తెలుస్తున్నది. ఈ రైలు న్యూఢిల్లీ నుంచి నేరుగా కాశ్మీర్ కు వెళ్లనుంది. ఈ రైలు చీనాబ్ నది మీద నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి మీదుగా కొనసాగనుంది. ఈ రైలు ప్రారంభం అయిన తర్వాత మరికొద్ది రోజుల్లోనే 10 వందేభారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే సంస్థ ప్రయాణాళికలు సిద్ధం చేస్తున్నది.
ప్రస్తుతం ఈ స్లీపర్ రైళ్లు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో రూపొందుతున్నాయి. వీటిని అస్తెనిటిక్ స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారు చేస్తున్నారు. క్రాష్ బఫర్, స్పెషల్ కఫ్లర్ లాంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లను కలిగి ఉన్నాయి. ప్రపంచ స్థాయి సౌకర్యాలు, అత్యాధునిక డిజైన్ తో రూపొందించిన ఈ రైళ్లు సుదూర ప్రయాణాల కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. ఈ స్లీపర్ రైళ్లు 16 కోచ్ లను కలిగి ఉండనున్నాయి. ఇందులో 823 మంది ప్రయాణీకులు ప్రయాణించనున్నారు. ఈ రైలు గంటకు 160 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించనుంది. వచ్చే ఏడాదిలోనే 10 స్లీపర్ రైళ్లను ప్రారంభించే ప్రయత్నం చేస్తోంది. తొలి రైలు న్యూఢిల్లీ-కాశ్మీర్ నడుమ తన సేవలను కొనసాగించనుంది. మిగతా రైళ్లు ఏ మార్గాల్లో నడిపించాలనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
Read Also: ఈ రైలు ముందు రాజధాని, శతాబ్ది, దురంతో దిగదుడుపే.. స్పీడ్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!