Ananya pandey: సినిమా అనే గ్లామర్ ప్రపంచంలోకి అడుగు పెట్టాలంటే ఎంతో ధైర్యంతో పాటు మానసిక శక్తి కూడా ఉండాలి. అప్పుడే ఇలాంటి విమర్శలు వచ్చినా నిలదొక్కుకునే స్టామినా ఉంటుంది. అయితే కొంతమంది ఇవేవీ ఆలోచించకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ అవ్వాలని చూస్తారు. కానీ వీరి ఆలోచనలను, కోరికలను కొంతమంది వెనక్కి లాగే ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రయత్నాలు ఎక్కువగా సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటాయి. ఇండస్ట్రీ మీద ఆశతో సక్సెస్ అవ్వాలని వచ్చే ఎంతోమంది హీరోయిన్స్ ఎన్నో రకాల విమర్శలు ఎదుర్కొని, చివరికి మానసిక ఒత్తిడికి కూడా గురి అవుతున్నారు. బాడీ షేమింగ్ మొదలుకొని యాక్టింగ్ వరకు ప్రతి విషయంలో కూడా హీరోయిన్స్ ని టార్గెట్ చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది వీటిని ధైర్యంగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తే.. మరి కొంత మంది ఈ విమర్శల నుంచి బయటపడలేక ఇబ్బందులు పడతారు. అలాంటి వారిలో తాను కూడా ఒకరు అని చెబుతోంది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Pandey).
థెరపీ తీసుకున్నాను..
బాలీవుడ్ యంగ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న అనన్య పాండే.. వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా పలు పోస్ట్ లు షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరగా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య ఊహించని కామెంట్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. అనన్య మాట్లాడుతూ..” నేను గతంలో చికిత్స తీసుకున్నాను. అయితే ఇప్పుడు రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు చికిత్స తీసుకుంటున్నాను” అని తెలిపింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా కలవరపాటుకు గురి అవుతున్నారు. అసలు ఈమె దేనికి చికిత్స తీసుకుంటోంది అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు.
భరించలేకపోయా..
అనన్య మాట్లాడుతూ..” ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎంతో నెగిటివిటీని ఎదుర్కొన్నాను. ఎన్నో విమర్శలు కూడా నాపై గుప్పించారు. వాటి వల్ల మానసిక వేదన అనుభవించాను. భావోద్వేగాలను తట్టుకోలేక పోయాను. ఆత్మవిశ్వాసం కోల్పోయాను.మానసిక ఒత్తిడికి గురయ్యాను. కారణం ఏమిటంటే కొంతమంది చేసే విమర్శలే దీనికి ప్రధాన కారణం. కొన్ని సందర్భాలలో మనం సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ ని చదువుతూ ఉంటాం. ఆ సమయంలో అవి పెద్దగా ప్రభావితం చేయవు. కానీ కొంతకాలం తర్వాత పదేపదే అవే మాటలు మనకు గుర్తుకు వస్తాయి. ఇబ్బంది పెడతాయి. నా విషయంలో కూడా సరిగ్గా అలాగే జరిగింది. అందుకే థెరపీ తీసుకున్నాను. దీనివల్ల నా ఆలోచన విధానం మెరుగుపడింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ నన్ను నేను ప్రూవ్ చేసుకోగలుగుతున్నాను” అంటూ తెలిపింది అనన్య పాండే. ఇకపోతే ఈ విషయం తెలిసిన తర్వాత అనన్య పాండే అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి విషయాలను పట్టించుకోకూడదు అని, పని పైన మాత్రమే ఫోకస్ చేయమని కూడా కోరుతున్నారు.
అనన్య పాండే తెలుగు చిత్రం..
ఇక అనన్య పాండే విషయానికి వస్తే.. తెలుగులో విజయ్ దేవరకొండ (Vijay Deverakonada) , పూరీ జగన్నాథ్ (Puri Jagannath) కాంబినేషన్లో వచ్చిన ‘లైగర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే డిజాస్టర్ ను మూటగట్టుకున్నా.. తన నటనతో తెలుగు ఆడియన్స్ ను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.