Premaku jai Movie: ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలుగా వచ్చి పెద్ద పెద్ద హిట్లవుతున్న సినిమాలను మనం చూస్తూ ఉన్నాం. అలా రియల్ స్టోరీ తో డైరెక్టర్ భాస్కర్, హీరో అనిల్ బూర్గాని హీరోయిన్ జ్వలితలతో తెరకెక్కిన తాజా మూవీ ‘ప్రేమకు జై’.. ఈ సినిమా ఏప్రిల్ 11న విడుదలకు సిద్ధంగా ఉండడంతో తాజాగా ఓ ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో, డైరెక్టర్, హీరోయిన్, విలన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరి ఇంతకీ ఈ సినిమా రియల్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం..
మా ఊర్లో జరిగిన నిజ జీవిత కథ ఈ ప్రేమకు జై- డైరెక్టర్
అనిల్ బూర్గాని 2017 లో ‘వజ్రాలు కావాలా నాయనా’ అనే సినిమాతో మన ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. ఇక రెండో సినిమాగా ‘ప్రేమకు జై’తో రాబోతున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. డైరెక్టర్ , హీరో..డైరెక్టర్ మాట్లాడుతూ.. “ఈ సినిమా రియల్ స్టోరీ.. అది కూడా మా ఊర్లో జరిగింది.. అయితే అప్పుడు నేను చదువుకుంటున్నాను. ఆయన నాకంటే వయసులో పెద్దవాడు.మా ఊరిలో అగ్రకులాలకు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించి , అణిచివేతకు గురైన ఆయన ఆ తర్వాత హైదరాబాద్ కు వెళ్లి బాగా డబ్బు సంపాదించి సెటిల్ అయ్యాక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ఎన్నో ఆశలతో హైదరాబాద్ కి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్ళాక డబ్బు సంపాదించిన ఆయన తర్వాత కొద్ది రోజులకే యాక్సిడెంటల్ గా మరణించారు. అయితే ఆయన మరణం ఇప్పటికి కూడా మా ఊర్లో ఓ మిస్టరీగానే ఉంది. అయితే మా ఊర్లో అగ్రకులాలకు చెందిన అమ్మాయిని ప్రేమించడంతో ఈ విషయాన్ని ఎవరు కూడా మాట్లాడడానికి ముందుకు రాలేదు.కానీ ఆయన మరణం మాత్రం మిస్టరీగానే మిగిలి పోయింది.
కోర్టు తరహాలో మిమ్మల్ని మెప్పిస్తుంది – డైరెక్టర్
ఇక ఆయన మెగాస్టార్ కి వీరాభిమాని.. అలా జూనియర్ ఆర్టిస్ట్ గా , డాన్సర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ చివరికి మిస్టీరియస్ గా మరణించారు. ఆయన మరణించిన సమయంలో ఊర్లో ఆయన మరణం గురించి కథలు కథలుగా మాట్లాడుకున్నారు. కానీ అసలు విషయం మాత్రం బయట పెట్టడానికి ఎవరు ముందుకు రాలేదు. అయితే దాన్ని అనుసంధానంగా చేసుకొని నేను రియల్ స్టోరీని తెరకెక్కిస్తున్నాను. ఈ సినిమాలో కూడా ప్రేమ అనే అగ్ర కులానికి చెందిన అమ్మాయిని జై అనే అబ్బాయి ప్రేమించి ఎన్ని ఇబ్బందులు పడతారు.. అనేది ఈ సినిమాలో చూపించాను. ఈ మధ్యనే కోర్టు వంటి ఒక మంచి సినిమాను మనం చూసాం.అలాంటి స్టోరీ తోనే ప్రేమకు జై అనే మూవీ తో మీ ముందుకు రాబోతున్నాను.. ఈ సినిమా బాగుంటుందని మీ అందరికీ నచ్చుతుందని, నేను అనుకుంటున్నాను.అలాగే ఈ సినిమాలో హీరో, హీరోయిన్లు అద్భుతంగా నటించారు” అంటూ డైరెక్టర్ చెప్పుకొచ్చారు..
ఈ సినిమా చూసైనా పరువు హత్యలు ఆగుతాయని ఆశిస్తున్నాం- హీరో
ఇక హీరో కూడా ఈ సినిమా గురించి స్పందిస్తూ..” ప్రతి సంవత్సరం ఏదో ఒక పరువు హత్యను మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ పరువు హత్యలు మళ్ళీ రిపీట్ కాకూడదు అని ఒక మంచి కాన్సెప్ట్ మా సినిమాలో చూపించబోతున్నాం. ఒక మనిషి ప్రాణం తీయడం ఈ సినిమా చూసైనా ఆపుతారు అనే కాన్సెప్ట్ తోనే ఈ సినిమా రాబోతోంది.ఈ సినిమా మీ అందరిని అలరిస్తుందని నేను అనుకుంటున్నాను” అంటూ హీరో అనిల్ బూర్గాని తెలియజేశారు.