Anil Ravipudi: 2025 సంక్రాంతి సినిమాల్లో విన్నర్ ఎవరు అని అడిగితే.. చాలామంది ప్రేక్షకులు ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) అని చెప్పేలాగా ఉన్నారు. ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ సినిమాను ప్రమోట్ చేయడం ఆపడం లేదు మేకర్స్. దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు హీరోయిన్స్ మీనక్షి చౌదరి (Meenakshi Chaudhary), ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh)లు కూడా ఈ ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా ఎవరూ లేకుండా కేవలం ఈ మూవీ టీమ్ మాత్రమే చిట్ చాట్‌లో పాల్గొంది. అందులో ‘సంక్రాంతికి వస్తున్నాం’లో హీరోయిన్స్‌గా మీనాక్షి, ఐశ్వర్య కాకపోతే ఎవరు హీరోయిన్స్‌గా నటించి ఉండేవారు అనే విషయాన్ని అనిల్ రివీల్ చేశాడు.
స్ట్రెయిట్ సమాధానం
‘సంక్రాంతికి వస్తున్నాం’లో హీరో వెంకటేశ్‌కు భార్య పాత్రలో ఐశ్వర్య రాజేశ్ నటించగా.. తన ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరీ కనిపించింది. వెంకటేశ్ ఎలా అయితే తన పాత్రతో నవ్వించారో మీనాక్షి, ఐశ్వర్య కూడా ప్రేక్షకులను అంతే నవ్వించడానికి ప్రయత్నించారు. పైగా సక్సెస్ అయ్యారు కూడా. వెంకటేశ్ భార్య పాత్ర చేయడానికి ఐశ్వర్య రాజేశ్ కంటే ముందే ముగ్గురు హీరోయిన్స్‌ను అప్రోచ్ అయినా వాళ్లు అలాంటి పాత్ర చేయడానికి ముందుకు రాక రిజెక్ట్ చేశారని అనిల్ రావిపూడి ఇప్పటికే రివీల్ చేశాడు. ఇక తాజాగా ఈ సినిమా ఐశ్వర్య, మీనాక్షి కాకపోయింటే ఎవరిని హీరోయిన్స్‌గా సెలక్ట్ చేసేవారు అనే ప్రశ్నకు స్ట్రెయిట్ సమాధానమిచ్చాడు అనిల్.
వారితో చేయిస్తా
‘సంక్రాంతికి వస్తున్నాం’లో హీరోయిన్స్‌గా తమరిని కాకపోయింటే ఎవరిని సెలక్ట్ చేసుండేవారని అనిల్ రావిపూడిని స్వయంగా అడిగింది ఐశ్వర్య రాజేశ్. దానికి సమాధానంగా ఐశ్వర్య స్థానంలో నిత్యా మీనన్, మీనాక్షి స్థానంలో పూజా హెగ్డేను సెలక్ట్ చేసేవాడిని అని ఓపెన్‌గా చెప్పేశాడు అనిల్. అది వినగానే ఆ పాత్రల్లో తమరిని తప్పా ఎవరినీ ఊహించుకోలేను అని చెప్తారేమో అని భావించానంటూ చెప్పి నవ్వింది ఐశ్వర్య. నిజం చెప్పాలంటే భాగ్యం పాత్రలో ఐశ్వర్య రాజేశ్‌ను తప్పా ఇంకెవరినీ ఊహించుకోలేనని అన్నాడు అనిల్. మీనాక్షి కూడా మొదటిసారి తన ఎంటర్‌టైన్మెంట్‌తో ప్రేక్షకులను నవ్వించిందని తెలిపాడు.
Also Read: పవన్ కళ్యాణ్ వల్లే నాకు ఈ సినిమాలో అవకాశం వచ్చింది.. బుల్లి రాజు కామెంట్స్
డ్రీమ్ హీరోలు
మామూలుగా ప్రతీ హీరోయిన్‌కు ఒక డ్రీమ్ హీరో ఉంటాడు. అలా మీనాక్షి చౌదరీకి డ్రీమ్ హీరో ఎవరు, తనకు ఎవరితో యాక్ట్ చేయాలని ఉంది అని అడగగా.. దాదాపు అందరి హీరోలతో నటించాలని ఉందని చెప్పింది. కానీ అందులో మొదటి స్థానంలో ప్రభాస్ ఉంటాడని తెలిపింది. ఇక ఐశ్వర్య రాజేశ్ మాత్రం ఎన్‌టీఆర్‌తో జోడీకట్టాలని ఉందంటూ మనసులోని మాటను బయటపెట్టింది. ఇక అనిల్ రావిపూడి (Anil Ravipudi).. తనకు చిరంజీవిని డైరెక్ట్ చేయాలని ఉంది అన్నాడు. ఎలాగో కొన్నిరోజుల్లో చిరును డైరెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు కాబట్టి అనిల్ కోరిక అప్పుడే తీరిపోయిందని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. కోలీవుడ్‌లో విజయ్‌తో కలిసి పనిచేయాలని ఉందంటూ బయటపెట్టాడు.