Priyanka Chopra: ఆస్కార్స్ అనేది సినీ పరిశ్రమలో పనిచేసే ప్రతీ ఒక్కరి కల. ఆ వేదికపై నిలబడాలని, పర్ఫార్మ్ చేయాలని, అక్కడ తమ పేరు వినాలని.. ఇలా అందరిలో ఒక కల ఉంటుంది. గత కొన్నేళ్లుగా పలు విభాగాల్లో ఇండియన్ సినిమాలను కూడా ఆస్కార్ వరించింది. ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం తెలుగు ప్రేక్షకులను గర్వపడేలా చేసింది. ఆ తర్వాత మరే తెలుగు సినిమా ఆ స్థాయి వరకు వెళ్లలేకపోయింది. కానీ ఒక ఇండియన్ సినిమా మాత్రం అన్ని అడ్డంకులు దాటుకుంటూ ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్ వరకు వెళ్లి ఓటమిని చవిచూసింది. అదే ‘అనూజ’. దీనికి, ప్రియాంక చోప్రాకు ఒక సంబంధం ఉంది.
గెలిచిన సినిమా
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ కేటగిరిలో ‘అనూజ’ సెలక్ట్ అయ్యింది. చివరి వరకు నామినేషన్స్‌లో నిలబడినా కూడా దీనికి అవార్డ్ మాత్రం రాలేదు. దీని బదులుగా డచ్ భాషలో తెరకెక్కిన సైఫై చిత్రం ‘అమాయ్ నాట్ ఏ రోబో’ మూవీని ఆస్కార్ వరించింది. ఈ సినిమాను విక్టోరియా వార్మర్డ్యామ్ తెరకెక్కించారు. ‘అమాయ్ నాట్ ఏ రోబో’ కథ మ్యాక్స్ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఒక కాప్చా టెస్ట్‌లో ఓడిపోయిన తర్వాత తను నిజంగానే మనిషి కాదా అని మ్యాక్స్‌కు సందేహం మొదలవుతుంది. తను నిజంగానే రోబో అయ్యింటాడేమో అని సందేహం కలుగుతుంది. అలాంటి సందేహం కలిగిన తర్వాత మ్యాక్స్ ఏం చేస్తాడు అనేది ‘అమాయ్ నాట్ ఏ రోబో’ కథ.
ఏంటా నిర్ణయం?
ఇక ‘అనూజ’ సినిమాను ఆడమ్ జే గ్రేవర్స్, సుచిత్ర మట్టై కలిసి డైరెక్ట్ చేశారు. ఇది అనూజ అనే తొమ్మిదేళ్ల అమ్మాయి కథ. తను అలాగే చదువును కొనసాగించాలా లేదా చదువును ఆపేసి తన అక్కతో కలిసి ఫ్యాక్టరీలో పనికి వెళ్లాలా అని నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తను తీసుకునే నిర్ణయం వల్ల తన జీవితం మాత్రమే కాదు.. తన అక్క జీవితం కూడా ఆధారపడి ఉంటుంది. ఈ సినిమాలో సజ్దా పతాన్, అనన్య షన్భాగ్ లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ సినిమాను రెండుసార్లు ఆస్కార్ సాధించిన నిర్మాత గునీత్ మోంగా నిర్మించారు. అంతే కాకుండా దీనికి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించింది. హాలీవుడ్‌లో రైటర్, యాక్టర్‌గా గుర్తింపు సాధించిన మిండీ కలింగ్ కూడా ఈ మూవీ నిర్మాణంలో భాగమయ్యారు.
Also Read: గత అయిదేళ్లలో ఆస్కార్‌ను గెలుచుకున్న బెస్ట్ మూవీస్.. కలెక్షన్స్ తెలిస్తే ఫ్యూజులు అవుట్
పిల్లల కోసం
‘అనూజ’ (Anuja) అనే సినిమాను అవార్డుల కోసం తెరకెక్కించలేదు. వీధుల్లో పనిచేసే పిల్లలను సపోర్ట్ చేయడం కోసం మీరా నాయర్ అనే ఫిల్మ్ మేకర్.. సలామ్ బాలక్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్‌తో నిర్మాతలంగా కలిసి ‘అనూజ’ అనే కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీనికి షైన్ గ్లోబల్, కృషాన్ నాయక్ ఫిల్మ్స్ సంస్థలు కూడా తోడయ్యాయి. ఇక ‘అనూజ’ సినిమాకు ఆస్కార్ రాకపోయినా ఇది ఇండియన్ ప్రేక్షకులు చూసే అవకాశం ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల ఈ మూవీ విడుదలయ్యింది.