Oscar 2025 : అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ 2025 (Oscar 2025) సంవత్సరానికి ఆస్కార్ విజేతల పేర్లను ప్రకటించింది. ‘అనోరా’ (Anora) చిత్రం ఉత్తమ చిత్రం విభాగంలో అవార్డును గెలుచుకుంది. 97వ ఆస్కార్ అవార్డులలో ‘అనోరా’ ఏకంగా 5 అవార్డులను దక్కించుకుని, చరిత్రను సృష్టించింది. అయితే గత 5 ఏళ్లలో ఇలా ఆస్కార్ అవార్డును ఎగరేసుకుపోయిన బెస్ట్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టాయి. మరి ఏ మూవీ ఎన్ని వేల కోట్లు రాబట్టిందో తెలుసుకుందాం పదండి.
ఆస్కార్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకోవడం అంటే మామూలు విషయం కాదు. కథ, కథనంతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తే తప్ప ఆ గ్లోబల్ అవార్డులకు నామినేట్ కావు సినిమాలు. అయితే ఆస్కార్ అవార్డులను సైతం సొంతం చేసుకున్న సినిమాలు ఏకంగా వేల కోట్లు కొల్లగొట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి.
5 ఏళ్లలో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాలు
2020 – పారాసైట్ (Parasite)- 2292 కోట్లు
2021 – నోమాడ్‌ల్యాండ్ (Nomadland)- 350 కోట్లు
2022 – కోడా (Coda)- రూ. 18 కోట్లు
2023 – ‘ఎవ్రీవన్ ఆల్ ఎట్ వన్స్ (Everything Everywhere All At Once)- 1260 కోట్లు
2024 – ఓపెన్ హైమర్ (Oppenheimer)- 8530 కోట్లు
2020 సంవత్సరంలో కరోనా మహమ్మారి సమయంలో కూడా ‘పారాసైట్’ చిత్రం మ్యాజిక్ కనిపించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2200 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. దీని తరువాత కరోనా మహమ్మారి చేసిన తాండవంతో రెండేళ్ల పాటు సినిమాలు పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ కోడా, నోమాడ్‌ల్యాండ్ వంటి చిత్రాలు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్నాయి. ‘కోడా’ కేవలం రూ.18 కోట్లు మాత్రమే సంపాదించగలిగింది. కానీ ఆస్కార్ ను అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. 2023లో పరిస్థితి కొంచెం బెటర్ అయ్యింది. దాని ప్రభావం ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సినిమాపై స్పష్టంగా కనిపించింది. ‘ఎవ్రీవన్ ఆల్ ఎట్ వన్స్’ సినిమా విడుదలై, అక్షరాలా 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కానీ 2024లో జె రాబర్ట్స్ ‘ఓపెన్‌హైమర్’ మూవీ కలెక్షన్లు అంటే ఎలా ఉంటాయో చూపించింది. ఈ బయోపిక్ ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 8500 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఈ 5 ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సినిమాలు నిర్మాతలను అమాంతం ధనవంతులను చేశాయి. ఈ 5 సంవత్సరాలలో 5 సినిమాలు రూ.12,450 కోట్లు వసూలు చేశాయి. అంటే ఈ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ అవార్డులను గెలుచుకోవడమే కాకుండా నిర్మాతలకు లెక్కలేనంత డబ్బును, ప్రపంచవ్యాప్తంగా దేశానికి కీర్తిని తెచ్చిపెట్టాయన్న మాట.
2025 లో నామినేట్ అయిన 10 సినిమాలు
2025 ఏడాదిలో ది బ్రూటలిస్ట్, ఎ సబ్‌స్టెన్స్, ఎమిలియా పెరెజ్, ఎ కంప్లీట్ అన్‌నోన్, డ్యూన్ పార్ట్ 2, కాన్‌క్లేవ్, నికెల్ బాయ్స్, అనోరా, వికెడ్ వంటి 10 సినిమాలు నామినేట్ కాగా, ‘అనోరా’ బెస్ట్ మూవీగా అవార్డును ఎగరేసుకుపోయింది. ప్రపంచవ్యాప్తంగా 10 గొప్ప చిత్రాలు ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో చోటు సంపాదించాయి. ఈ చిత్రాలలో ఒకే ఒక్క సినిమా మాత్రం ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. కానీ దురదృష్టవశాత్తు ఈసారి ఈ లిస్ట్ లో పోటీకి భారతదేశం నుంచి ఒక్క సినిమా కూడా లేదు.