Sr. NTR Birth Anniversary::ఆంధ్రుల ‘అన్నగారు’ గా పేరు సొంతం చేసుకున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు (Sr.NTR) కు నేడు రాష్ట్ర ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని అందించింది. ఆయన అటు సినీ పరిశ్రమకు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన ఎనలేని సేవలను దృష్టిలో పెట్టుకొని ఇకపై ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా మే 28వ తేదీన రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేడు సీనియర్ ఎన్టీఆర్ 102వ జయంతి కావడంతో ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. సీఎస్ విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేస్తూ.. “సీఎంగా సామాజిక న్యాయం, వికేంద్రీకరణ, ప్రజాకేంద్రీకృత పరిపాలన ఆధారంగా సంస్కరణలను ప్రవేశపెట్టారు. సంక్షేమ పథకాలకు మార్గదర్శకత్వం వహించారు. తెలుగు భాష సంస్కృతి కేవలం వారసత్వంగా కాకుండా తెలుగు ప్రజల సమిష్టి విధికి పునాదిగా చూడాలని తరతరాలను ప్రేరేపించారు..” అంటూ తెలిపారు.
ఎన్టీఆర్ జయంతి.. అరుదైన గౌరవం..
ఇంకా మాట్లాడుతూ..”ఇంత గొప్ప మహనీయుడి జన్మదినోత్సవాన్ని గౌరవప్రదంగా జరుపుకోవాలని, ఆయన జ్ఞాపకాలకు తగిన గౌరవాన్ని ఇవ్వడం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇకపై ప్రతి ఏటా మే 28 ని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని ఆంధ్ర ప్రభుత్వం నిర్ణయించింది అధికారులందరూ కూడా ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలి” అంటూ తెలిపారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అటు సినీ సెలబ్రిటీలు, ఇటు ప్రజలు ప్రభుత్వ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సీనియర్ ఎన్టీఆర్ జననం..
1923 మే 28న సోమవారం సాయంత్రం 4.32 గంటలకు కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని గుడివాడ దగ్గర ఒక చిన్న గ్రామమైన నిమ్మకూరులో శ్రీమతి వెంకట్రావమ్మ, శ్రీ లక్ష్మయ్య చౌదరికి ఎన్టీఆర్ జన్మించారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం కాగా.. మొదటి సంతానం నందమూరి తారక రామారావు, రెండవ సంతానం నందమూరి త్రివిక్రమ రావు. సీనియర్ ఎన్టీఆర్ కి మొదట కృష్ణ అనే పేరు పెట్టాలనుకున్న తల్లి.. మేనమామ తారక రాముడు అయితే బాగుంటుందని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. ఆ తర్వాత అది కాస్త తారక రామారావుగా మారిపోయింది.
సీనియర్ ఎన్టీఆర్ విద్యాభ్యాసం..
పాఠశాల విద్యను విజయవాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పూర్తి చేసిన ఈయన.. ఆ తర్వాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్ కాలేజీలో పూర్తి చేశారు. ఇకపోతే ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతిగా ఉండేవారు. ఒక్కసారి కాలేజీలో నాటకం వేయాల్సి వచ్చినప్పుడు.. ఆయన మీసాలు తీసేయమని విశ్వనాథ సత్యనారాయణ చెప్పాడట. అయితే రామారావు మాత్రం మీసాలు తీయడానికి ఒప్పుకోకపోవడం.. పైగా అదే పాత్రతో ఆ అమ్మాయి వేషం వేయడంతో ‘మీసాల నాగమ్మ’ అనే పేరు కూడా తగిలించి ఏడిపించే వారట. 20 ఏళ్ల వయసులోనే తన మేనమామ కుమార్తె బసవతారకమును పెళ్లి చేసుకున్న.ఈయన వివాహం తర్వాత పరీక్షల్లో రెండుసార్లు తప్పాడు. ఆ తర్వాత గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో చేరి అక్కడ నాటక సంఘాలలో చురుకుగా పాల్గొనేవారు. ఎన్టీఆర్ నటుడు మాత్రమే కాదు చిత్రకారుడు కూడా. రాష్ట్రవ్యాప్తంగా చిత్రలేఖన పోటీల్లో పాల్గొని బహుమతి కూడా అందుకున్నారు.
also read:Rukmini Vasanth: ఆ ఒక్క ప్రకటనే ఈ జీవితానికి భిక్ష.. ఎన్టీఆర్ బ్యూటీ ఎమోషనల్!