Game Changer : ఇటీవల కాలంలో సినిమా టికెట్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా పేరుతో మేకర్స్ ప్రేక్షకులపై టికెట్ రేట్ల భారాన్ని భారీగానే మోపుతున్నారు. రీసెంట్ గా ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీ విషయంలో పెరిగిన టికెట్ రేట్లపై దారుణంగా విమర్శలు ఎదురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ విషయంలో మరోసారి టికెట్ హైక్ హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా ఏపీలో ఈ పెరిగిన టికెట్ ధరలను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, కోర్టు సంక్రాంతి సినిమాలకు షాక్ ఇచ్చింది.
జనవరి 10న సంక్రాంతి సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన పాన్ ఇండియా పొలిటికల్ ఎంటర్టైనర్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత రెండు రోజులకే అంటే జనవరి 12న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా చేసిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) రిలీజ్ కాబోతోంది. అయితే ‘గేమ్ ఛేంజర్’ మూవీ పాన్ ఇండియా మూవీ కాగా, ‘డాకు మహారాజ్’ మూవీ మాత్రం సౌత్ లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించి టికెట్ ధరలపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
అందులో రెండు సినిమాల బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరలను కూడా పెంచినట్టు నిర్ణయించింది. ఆ జీవో ప్రకారం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీకి రిలీజ్ రోజున బెనిఫిట్ షో టికెట్ ధర 600 పెంచగా, ‘డాకు మహారాజ్’ బెనిఫిట్ షోలకి టికెట్ ధరను 500 పెంచింది. ఇక రెగ్యులర్ షోలకు మల్టీప్లెక్స్ టికెట్ ధరపై 135 పెంచగా, సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధరపై 110 పెంచుతూ జీవోను రిలీజ్ చేశారు. దీంతో పెరిగిన టికెట్ ధరలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.
తాజాగా పిటిషనర్ తన వాదనలో బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వడం వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, నిబంధనలకు విరుద్ధంగా టికెట్ ధరలను పెంచాలని పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer), ‘డాకు మహారాజ్’ రెండు సినిమాలకు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ టికెట్ ధరల పెంపుపై వేసిన ఈ పిటిషన్ పై విచారణను చేపట్టి, టికెట్ ధరల పెంపు గడువును 14 రోజుల నుంచి 10 రోజులకే పరిమితం చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహారాజ్’ టీమ్ లకు ఇది ఎదురుదెబ్బ లాంటిదే. ఈ ఎఫెక్ట్ కచ్చితంగా మూవీ కలెక్షన్ల పై పడే అవకాశం ఉంటుంది. ఇక తెలంగాణలో ఇంకా ఈ బెనిఫిట్ షోల విషయం తేలాల్సి ఉంది.